neetuprasad
-
ఆఫీస్‌ల కోసం అన్వేషణ
సిరిసిల్లలో కలెక్టర్ పర్యటన మినీ స్టేడియంలో పోలీస్‌పరేడ్ గ్రౌండ్ ‘సెస్’, సినారె, టౌన్ క్లబ్, డీఎస్పీ ఆఫీస్‌ల పరిశీలన సిరిసిల్ల : సిరిసిల్లలో జిల్లా కేంద్రం ఆఫీస్ కోసం అన్వేషణ ముమ్మరమైంది. దసరా రోజు కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ పరిపాలన సాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో కలెక్టర్ నీతూప్రసాద్ బుధవారం సిరిసిల్లలో పర్యటించారు. సిరిసిల్లను కొత్త జిల్లాల జాబితాలో చేర్చిన తరువాత తొలిసారి కలెక్టర్ నీతూప్రసాద్ ఆఫీస్ భవనాల కోసం పరిశీలించారు. కొత్త బస్టాండ్ సమీపంలోని సినారె కళాభవనం, వ్యవసాయ మార్కెట్‌యార్డు, ‘సెస్’ ఆఫీస్, టీఎన్జీవో భవనం, రిటైర్డు ఉద్యోగుల సంఘం ఆఫీస్, టౌన్ క్లబ్, డీఎస్పీ ఆఫీస్, సిరిసిల్ల పోలీస్‌స్టేషన్, తంగళ్లపల్లిలోని బీడీ కంపెనీ, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలను పరిశీలించారు. కలెక్టరేట్‌తోపాటు ఎస్పీ ఆఫీస్, పొలీస్ పెరేడ్ గ్రౌండ్ వంటి అంశాలను పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కోసం ఉపయోగించాలని డీఎస్పీ సుధాకర్ కోరగా.. కలెక్టర్ నిరాకరించారు. విద్యార్థులకు ఆట స్థలం లేకుండా పోతుందని, వాటి జోలికి వెళ్లవద్దని జీవోలు ఉన్నాయని అన్నారు. మినీ స్టేడియాన్ని పోలీస్ పరేడ్ మైదానానికి ఇస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. శాశ్వతంగా కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్‌లు ఒకే చోట ఉండాలని, మిగతా ఆఫీస్‌ను సిరిసిల్ల చుట్టూ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆర్డీవో జీవీ.శ్యామ్‌ప్రసాద్‌లాల్, ఏడీఏ అనిల్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ బి.సుమన్‌రావు, ఇన్చార్జి తహశీల్దార్ బొద్దుల గంగయ్య, పీఆర్ ఈఈ విజయ్‌కుమార్, డీఈఈలు కిషన్‌రావు, సూర్యప్రకాశ్, ఆర్ఐ. రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
అనుభవాన్ని సమాజానికి వినియోగించాలి
కలెక్టర్ నీతూప్రసాద్ కరీంనగర్: వయోవృద్ధులు తమ జీవిత అనుభవాలను, విజ్ఞానాన్ని సమాజాభివృద్ధికి వినియోగించాలని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా శనివారం వికలాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కళాభారతిలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. వయోవృద్ధులు వారి జీవితంలో వివిధ ఉద్యోగాలు చేసి, వివిధ రంగాలలో ఎంతో అనుభవం గడించి ఉన్నారని, దాన్నిSవారి అనుభవం వృద్ధాప్యంలో పది మందికి పంచాలని అన్నారు. పిల్లలు పెద్దలపట్ల గౌరవ మర్యాదలు ప్రేమ, అప్యాయతలు పంచాలని సూచించారు. వయోవృద్ధులు అందరూ అప్పుడప్పుడు కలుసుకోవాలని, అందుకు ప్రతినెలా సమావేశాలు నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. అప్పుడే కష్టసుఖాలు పంచుకుని ఆనందంగా ఉంటారని తెలిపారు. వయోవృద్ధులకు సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. వివిధ రంగాలల్లో సమాజసేవ చేసిన వయోవృద్ధులను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఉప సంచాలకులు నళిని, సీనియర్ వైద్యనిపుణులు రఘురాం, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, కాళోజీ అవార్డు గ్రహీత ముదుగంటి సుధాకర్‌రెడ్డి, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యలదాసరి లింగయ్య, సభ్యులు దండిగాల మల్లేశం, చింతకుంట వయోవృద్ధుల సంఘం అధ్యక్షుడు శంకరయ్య పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
విధుల్లో నిర్లక్ష్యం వహించే డాక్టర్లపై చర్యలు కలెక్టర్ నీతూ ప్రసాద్ ముకరంపుర: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ నీతూప్రసాద్ వైద్యులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో క్లస్టర్ లెవల్ అధికారులు ఎస్పీహెచ్వోలతో జిల్లాస్థాయి మార్పు సమావేశం గురువారం నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు, ఆపరేషన్ ప్రసవాలు దాదాపు సమాంతరంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. సాధారణ ప్రసవాలకే డాక్టర్లు ప్రాధాన్యమివ్వాలన్నారు. ఎక్కువ ఆపరేషన్ జరిగే ప్రై వేట్ నర్సింగ్‌హోమ్‌లకు షోకాజ్ నోటీసులివ్వాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. గంభీరావుపేట, కాటారం, సుల్తానాబాద్, పెద్దపల్లి ఆస్పత్రులలో గతనెల ప్రసవాల సంఖ్య తక్కువగా ఉన్నాయని అసంతప్తి వ్యక్తంచేశారు. అన్ని పీహెచ్సీలలో డాక్టర్లు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విధులకు తరచుగా గైర్హాజరయ్యే వారిని తొలగించి కొత్తవారిని నియమించాలని సూచించారు. లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించే ప్రై వేట్ ఆస్పత్రులపై నిఘా ఉంచి వారి లైసెన్సు రద్దు చేయాలని ఆదేశించారు. క్లస్టర్ లెవల్ సమావేశాలకు హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి ఒకరోజు వేతనాన్ని నిలుపుదల చేయాలని ఆదేశించారు. మాతాశిశుమరణాలను తగ్గించుటకు చర్యలు తీసుకోవాలన్నారు. అతిసారం, అంటువ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. గ్రామాల్లో డెంగీ జ్వరాలు సోకిన వారిని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి పంపించాలన్నారు. ఏజేసీ నాగేంద్ర, డీఎంహెచ్‌వో రాజేశం పాల్గొన్నారు. -
కలెక్టరేట్ భవనాల కోసం అన్వేషణ
పెద్దపల్లిలో బిల్డింగ్‌లను పరిశీలించిన కలెక్టర్ నీతూ ప్రసాద్ పెద్దపల్లి : పెద్దపల్లిలో కలెక్టరేట్ ఏర్పాటు చేసేందుకు అనువైన భవనం కోసం కలెక్టర్ నీతూప్రసాద్ అన్వేషిస్తున్నారు. భవనం కోసం బుధవారం కలెక్టర్ పట్టణంలోని పలు బిల్డింగ్‌లను పరిశీలించారు. పట్టణంలోని ఐటిఐ, ఎస్సారెస్పీ క్యాంపు, కొత్త ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించారు. ఐటిఐ అన్నిటికీ అనుకూలంగా ఉంటుందని చాలారోజులుగా పలువురు అధికారులతోపాటు సామాన్యులూ అభిప్రాయపడుతున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్ కూతవేటు దూరంలో.. రాజీవ్ రహదారి పక్కనే ఉండడం ద్వారా కలెక్టరేట్‌కు రావడం.. వెళ్లడం అనుకూలంగా ఉంటుందని స్థానిక అధికారులు నివేదిక సమర్పించారు. దీనిపై కలెక్టర్ ఇక్కడికి చేరుకుని ఐటిఐ, ఎస్సారెస్పీ క్యాంపు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎంపీడీవో బిల్డింగ్‌లను పరిశీలించారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీవో అశోక్ కుమార్‌తో ఇక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, సీఐ మహేష్, తహసీల్దార్ అనుపమారావు, ఎంపీడీవో మల్లేశం తదితరులున్నారు. -
రోగులకు మెరుగైన సేవలు అందించాలి
ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ నీతూప్రసాద్ కరీంనగర్ హెల్త్: నగరంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిని కలెక్టర్ నీతూప్రసాద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీచేశారు. ఆస్పత్రిలోని పిల్లలవార్డులో జరుగుతున్న మరమ్మతు పనులు పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలోని మెటర్నిటివార్డు, క్యాంటీన్ కిచన్ గదులు, ఉద్యోగ సంఘం కార్యాలయాన్ని వేరే గదుల్లోకి మార్చి అక్కడ 30పకడల వార్డును నిర్మించాలని ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో అదనపు బెడ్లలో సేవలు పొందుతున్న రోగులను వైద్య సేవల గురించి అడిగితెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాల కారణంగా రక్తంలో ప్లేట్లేట్స్ తగ్గిపోయి ఆస్పత్రిలో చేరుతున్న వారికి అవసరమైన రక్తాన్ని అందించాలన్నారు. డీఎంహెచ్‌వో రాజేశం, డీసీహెచ్ఎస్ అశోక్‌కుమార్ ఉన్నారు.