అనుభవాన్ని సమాజానికి వినియోగించాలి
-
కలెక్టర్ నీతూప్రసాద్
కరీంనగర్: వయోవృద్ధులు తమ జీవిత అనుభవాలను, విజ్ఞానాన్ని సమాజాభివృద్ధికి వినియోగించాలని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా శనివారం వికలాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కళాభారతిలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. వయోవృద్ధులు వారి జీవితంలో వివిధ ఉద్యోగాలు చేసి, వివిధ రంగాలలో ఎంతో అనుభవం గడించి ఉన్నారని, దాన్నిSవారి అనుభవం వృద్ధాప్యంలో పది మందికి పంచాలని అన్నారు. పిల్లలు పెద్దలపట్ల గౌరవ మర్యాదలు ప్రేమ, అప్యాయతలు పంచాలని సూచించారు. వయోవృద్ధులు అందరూ అప్పుడప్పుడు కలుసుకోవాలని, అందుకు ప్రతినెలా సమావేశాలు నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. అప్పుడే కష్టసుఖాలు పంచుకుని ఆనందంగా ఉంటారని తెలిపారు. వయోవృద్ధులకు సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. వివిధ రంగాలల్లో సమాజసేవ చేసిన వయోవృద్ధులను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఉప సంచాలకులు నళిని, సీనియర్ వైద్యనిపుణులు రఘురాం, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, కాళోజీ అవార్డు గ్రహీత ముదుగంటి సుధాకర్‌రెడ్డి, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యలదాసరి లింగయ్య, సభ్యులు దండిగాల మల్లేశం, చింతకుంట వయోవృద్ధుల సంఘం అధ్యక్షుడు శంకరయ్య పాల్గొన్నారు.