గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదుచేసిన కలెక్టర్ బంగ్లా ఉద్యోగిని
మీడియాకు వివరాలు వెల్లడి
నరసరావుపేట: కలెక్టర్ బంగ్లాలో పనిచేస్తున్న తనపై క్యాంపు క్లర్క్ (సీసీ)గా వ్యవహరిస్తున్న జానీబాషా లైంగిక, మానసిక వేధింపులకు పాల్పడుతున్నాడని ముద్దా నాగమణి ఆరోపించింది. ఈ మేరకు సోమవారం పల్నాడు జిల్లా కలెక్టరేట్, పోలీసు కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కె.శ్రీనివాసరావులకు ఆమె ఫిర్యాదు చేసింది. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడింది.
తాను పెద్దచెరువులోని కలెక్టర్ బంగ్లాలో రెండేళ్లుగా వంటమనిషిగా పనిచేస్తున్నానని, సీసీగా జానీబాషా వచ్చిన దగ్గర నుంచి తనతో అనుచితంగా వ్యవహరిస్తున్నాడని తెలిపింది. తాను నాలుగైదు నెలలుగా జీతాలు లేకుండా పనిచేశానని, గత కలెక్టర్ ఎల్.శివశంకర్ తనను అప్కాస్‌లో ఉద్యోగిగా చేర్చారన్నారు. ఏడాది క్రితం కలెక్టర్ బంగ్లాకు సీసీగా వచ్చిన జానీబాషా ఇబ్బందులు పెట్టడం ప్రారంభించాడన్నారు. గత ఆరు నెలల నుంచి తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని, ఒక నెల నుంచి తనను ఉద్యోగం చేయకుండా ఆపేశారన్నారు. టీ ఇచ్చే సమయంలో తన చేయి పట్టుకొని లాగటం చేసేవాడన్నారు. తానంటే ఇష్టమని చెబుతూ.. రూం బుక్ చేశాను రమ్మంటూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడని ఆవేదన వ్యక్తం చేశారు.
అయినా అతనికి లొంగనందువల్ల తనను ఉద్యోగం నుంచి తొలగించాడని చెప్పారు. అదే బంగ్లాలో తన సోదరుడు కూడా పనిచేస్తున్నాడని, సీసీ చేస్తున్న పనులను గురించి అతనికి చెప్పానని, దీనిపై సీసీని అడిగితే నా ఇష్టం వచ్చినట్లుగా ఉంటానని, జరిగిన విషయం ఎవరికై నా చెబితే మీ ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరించాడన్నారు. వారం రోజుల క్రితం కలెక్టరేట్‌లో డీఆర్‌ఓకు తాను ఫిర్యాదు చేయగా ఇప్పటివరకు ఏ చర్య తీసుకోలేదన్నారు. ఇప్పటికై నా తనకు లొంగితే నీకు, నీ తమ్ముడికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒత్తిడి చేస్తున్నాడన్నారు. దీనిపై కలెక్టర్, ఎస్పీలకు విన్నవించేందుకు వచ్చానని ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment