ఎఫ్‌డీ, ఆర్‌డీ, గోల్డ్ లోన్లలో కుంభకోణం
పల్నాడు జిల్లా బ్రాంచ్‌లో ఘటన
చిలకలూరిపేట: పల్నాడు జిల్లా, చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచ్‌లో కోట్లాది రూపాయల ఖాతాదారుల సొమ్ము గోల్‌మాల్ జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. దీంతో బాధిత ఖాతాదారులు గురువారం బ్యాంకు వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. స్థానిక బ్యాంకు బ్రాంచిలో కొన్నేళ్లుగా పలువురు ఫిక్స్‌డ్ (ఎఫ్‌డీ), రికరింగ్ డిపాజిట్లు(ఆర్‌డీ) చేయడంతో పాటు గోల్డ్ లోన్లు తీసుకున్నారు. ఆర్డీకి సంబంధించి వడ్డీ తీసుకొనే వారు బ్యాంకుకు వచ్చిన సమయంలో వారి ఖాతాల్లో డబ్బు లేకపోవడంతో విషయం బయటకు పొక్కింది.
దీంతో ఒక్కొక్కరుగా ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి తమ డిపాజిట్ల విషయమై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఖాతాలను పరిశీలించగా కోట్లాది రూపాయల అవకతవకలు జరిగినట్లు గుర్తించి బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో బ్యాంకు జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా, రీజనల్ హెడ్ రమేశ్, ఇతర ఉన్నతా«ధికారులు బ్రాంచికి వచ్చి విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో గతంలో బ్రాంచి మేనేజర్‌గా పనిచేసిన దూడ నరేశ్ చంద్రశేఖర్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు.
డిపాజిట్లు రెన్యువల్ చేయకపోవడం, ఓవర్ డ్రాఫ్ట్‌లు తీసుకోవడం వంటి అవకతవకలకు పాల్పడినట్లు బ్యాంకు ఉన్నతాధికారుల విచారణలో వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో ఇతర సిబ్బంది హస్తంపై కూడా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 14మంది బ్యాంకు ఖాతాదారులు పోలీసుస్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు రూ.6.9కోట్ల డిపాజిట్లు, 115 సవర్ల బంగారం గోల్‌మాల్ జరిగిందని చెప్పారు. అంతేకాకుండా, మరో రూ.30 కోట్ల వరకు ఖాతాదారుల సొమ్ము పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది.
కస్టమర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యం
దీనిపై జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రాను వివరణ కోరగా విచారణ జరుపుతున్నామని, అది పూర్తయ్యాక పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధి మాట్లాడుతూ "ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఎల్లప్పుడూ కస్టమర్ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. బ్యాంకు శాఖలో అవకతవకలు జరిగినట్లు మా దృష్టికి రావటంతో సంబంధిత ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేశాం. బ్యాంకులో మోసాల పట్ల మాకు జీరో టాలరెన్స్ పాలసీ ఉంది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని, కస్టమర్ల ఆర్థిక ప్రయోజనాలకు పూర్తిగా రక్షణ కల్పిస్తామని భరోసా ఇస్తున్నాం" అన్నారు
Comments
Please login to add a commentAdd a comment