పోలీసుల అదుపులో నిందితుడు
వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాసరావు
గజపతినగరం : మండలంలోని బంగారమ్మపేటలో ఇటీవల ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవడంతో కేసు నమోదు చేసిన పోలీసులు అది ఆత్మహత్య కాదు...హత్య అని తేల్చారు. కట్టుకున్న భర్తే భార్యను అమానుషంగా చంపడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాసరావు శనివారం స్థానిక గజపతినగరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. బంగారమ్మపేటకు చెందిన నక్కా జగదీష్‌కు అదే గ్రామానికి చెందిన తాడుతూరి అనూష (తనూజ)తో మూడు నెలల కిందట వివాహం జరిగింది.
మొదట్లో వీరి కాపురం సజావుగా సాగినా, జగదీష్‌కు అనుమానం ఎక్కువ కావడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. అక్కడకు కొద్ది రోజుల తర్వాత అనూషను కన్నవారింటిలో ఉంచి జగదీష్ ఉద్యోగం నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లాడు. ఈ నెల 16న గ్రామానికి వచ్చిన జగదీష్ అనూషకు ఫోన్ చేసి ఇంటి సమీపంలో ఉన్న పశువుల శాల వద్దకు రమ్మన్నాడు. దీంతో ఆరోజు (ఆదివారం) రాత్రి అనూష తన ఇంటి సమీపంలోని పశువులశాల వద్దకు రాగా.. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన జగదీష్ భార్య మెడకు నైలాన్ తాడుతో ఉరి వేశాడు.
ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన బోని ప్రసాద్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని అనూష సెల్ నుంచి ఆమె తండ్రి, సోదరుడు, స్నేహితురాళ్లతో పాటు తన సెల్‌కు కూడా జగదీష్ మెసేజ్‌లు పంపించాడు. దీంతో మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు బోని ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా.. అతను నేరం చేయలేదని తేలింది. ఈ పరిస్థితుల్లో భర్త జగదీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా... అసలు విషయం బయట పడింది. భార్యను తనే హత్య చేసినట్లు జగదీష్ ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
బోని ప్రసాద్ ఇంటిపై దాడి
తన కుమార్తె మృతికి కారణమనే అపోహతో అనూష తండ్రి, కుటుంబ సభ్యులు ప్రసాద్ ఇంటిపై దాడి చేసి అతని తండ్రి గోవిందరావుపై దాడి చేశారు. దీంతో గోవిందరావు ఫిర్యాదు మేరకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో స్థానిక సీఐ ఎన్‌వీ ప్రభాకరరావు, ఎస్సై యు.మహేష్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment