ఇప్పటి వరకు 72 మంది బాధితుల గుర్తింపు
రూ. 28 కోట్లు గోల్‌మాల్ జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి
చిలకలూరిపేట: ఐసీఐసీఐ బ్యాంకు చిలకలూరిపేట బ్రాంచ్‌లో జరిగిన కుంభకోణం విషయంలో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. సీఐడీ ఏఎస్పీ సీహెచ్ ఆదినారాయణ ఆధ్వర్యంలో సీఐడీ అధికారుల బృందం గురువారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచ్‌కి చేరుకుని విస్తృతంగా విచారణ చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకు తలుపులు మూసివేసి ఎవరినీ లోనికి అనుమతించకుండా విచారణ కొనసాగించారు.
ఈ సందర్బంగా సీఐడీ ఏఎస్పీ సీహెచ్ ఆదినారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 8న సీఐడీ ప్రధాన కార్యాలయంలో సంబంధిత విషయమై కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం కేసును గుంటూరు సీఐడీ కార్యాలయానికి బదిలీ చేసినట్టు తెలిపారు. తమ విచారణలో ఇప్పటి వరకు 72 మంది ఖాతాదారులకు సంబంధించి రూ. 28 కోట్లు గోల్‌మాల్ జరిగినట్టు గుర్తించినట్లు తెలిపారు. 2021 నుంచి ఇక్కడ బ్రాంచి మేనేజర్‌గా పనిచేసిన దూడ నరేష్‌చంద్రశేఖర్, మరో ఇద్దరు కలిసి ఈ కుంభకోణానికి పాల్పడినట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.
ఇక్కడ పనిచేసిన అనంతరం నరేష్‌చంద్రశేఖర్ నరసరావుపేట, విజయవాడ భారతీనగర్ బ్రాంచ్‌లలో మేనేజర్‌గా పనిచేసినట్టు తెలిపారు. విజయవాడలో పనిచేస్తున్న సమయంలో అతని అవకతవకలు వెలుగు చూసి ఈ ఏడాది జూలైలో బ్యాంకు అతనిని విధుల నుంచి సస్పెండ్ చేసిందన్నారు. ఈ నెల చిలకలూరిపేట బ్రాంచిలో జరిగిన అక్రమాలు వెలుగు చూడటంతో సీఐడీ కేసు నమోదు చేసిందన్నారు.
ఇంకా ఎవరైనా బ్యాంకు సిబ్బంది ఈ వ్యవహారంలో ఉన్నారా లేరా అనేది విచారణలో తేలాల్సి ఉందని తెలిపారు. వారం, పది రోజుల్లో విచారణ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని, కేసు విషయమై ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదన్నారు. సీఐడీ సీఐ సంజీవ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment