ఆఫీస్‌ల కోసం అన్వేషణ
-
సిరిసిల్లలో కలెక్టర్ పర్యటన
-
మినీ స్టేడియంలో పోలీస్‌పరేడ్ గ్రౌండ్
-
‘సెస్’, సినారె, టౌన్ క్లబ్, డీఎస్పీ ఆఫీస్‌ల పరిశీలన
సిరిసిల్ల : సిరిసిల్లలో జిల్లా కేంద్రం ఆఫీస్ కోసం అన్వేషణ ముమ్మరమైంది. దసరా రోజు కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ పరిపాలన సాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో కలెక్టర్ నీతూప్రసాద్ బుధవారం సిరిసిల్లలో పర్యటించారు. సిరిసిల్లను కొత్త జిల్లాల జాబితాలో చేర్చిన తరువాత తొలిసారి కలెక్టర్ నీతూప్రసాద్ ఆఫీస్ భవనాల కోసం పరిశీలించారు. కొత్త బస్టాండ్ సమీపంలోని సినారె కళాభవనం, వ్యవసాయ మార్కెట్‌యార్డు, ‘సెస్’ ఆఫీస్, టీఎన్‌జీవో భవనం, రిటైర్డు ఉద్యోగుల సంఘం ఆఫీస్, టౌన్ క్లబ్, డీఎస్పీ ఆఫీస్, సిరిసిల్ల పోలీస్‌స్టేషన్, తంగళ్లపల్లిలోని బీడీ కంపెనీ, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలను పరిశీలించారు. కలెక్టరేట్‌తోపాటు ఎస్పీ ఆఫీస్, పొలీస్ పెరేడ్ గ్రౌండ్ వంటి అంశాలను పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కోసం ఉపయోగించాలని డీఎస్పీ సుధాకర్ కోరగా.. కలెక్టర్ నిరాకరించారు. విద్యార్థులకు ఆట స్థలం లేకుండా పోతుందని, వాటి జోలికి వెళ్లవద్దని జీవోలు ఉన్నాయని అన్నారు. మినీ స్టేడియాన్ని పోలీస్ పరేడ్ మైదానానికి ఇస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. శాశ్వతంగా కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్‌లు ఒకే చోట ఉండాలని, మిగతా ఆఫీస్‌ను సిరిసిల్ల చుట్టూ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆర్డీవో జీవీ.శ్యామ్‌ప్రసాద్‌లాల్, ఏడీఏ అనిల్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ బి.సుమన్‌రావు, ఇన్‌చార్జి తహశీల్దార్ బొద్దుల గంగయ్య, పీఆర్ ఈఈ విజయ్‌కుమార్, డీఈఈలు కిషన్‌రావు, సూర్యప్రకాశ్, ఆర్‌ఐ. రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.