ప్రభుత్వ ఆస్పత్రిల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
-
విధుల్లో నిర్లక్ష్యం వహించే డాక్టర్లపై చర్యలు
-
కలెక్టర్ నీతూ ప్రసాద్
ముకరంపుర: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ నీతూప్రసాద్ వైద్యులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో క్లస్టర్ లెవల్ అధికారులు ఎస్‌పీహెచ్‌వోలతో జిల్లాస్థాయి మార్పు సమావేశం గురువారం నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు, ఆపరేషన్ ప్రసవాలు దాదాపు సమాంతరంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. సాధారణ ప్రసవాలకే డాక్టర్లు ప్రాధాన్యమివ్వాలన్నారు. ఎక్కువ ఆపరేషన్ జరిగే ప్రై వేట్ నర్సింగ్‌హోమ్‌లకు షోకాజ్ నోటీసులివ్వాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. గంభీరావుపేట, కాటారం, సుల్తానాబాద్, పెద్దపల్లి ఆస్పత్రులలో గతనెల ప్రసవాల సంఖ్య తక్కువగా ఉన్నాయని అసంతప్తి వ్యక్తంచేశారు. అన్ని పీహెచ్‌సీలలో డాక్టర్లు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విధులకు తరచుగా గైర్హాజరయ్యే వారిని తొలగించి కొత్తవారిని నియమించాలని సూచించారు. లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించే ప్రై వేట్ ఆస్పత్రులపై నిఘా ఉంచి వారి లైసెన్సు రద్దు చేయాలని ఆదేశించారు. క్లస్టర్ లెవల్ సమావేశాలకు హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి ఒకరోజు వేతనాన్ని నిలుపుదల చేయాలని ఆదేశించారు. మాతాశిశుమరణాలను తగ్గించుటకు చర్యలు తీసుకోవాలన్నారు. అతిసారం, అంటువ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. గ్రామాల్లో డెంగీ జ్వరాలు సోకిన వారిని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి పంపించాలన్నారు. ఏజేసీ నాగేంద్ర, డీఎంహెచ్‌వో రాజేశం పాల్గొన్నారు.