కలసి వస్తున్న కృష్ణా, గోదావరి
♦ డిసెంబరు 15కు 217 ఎంజీడీల నీళ్లు నగరానికి: కేటీఆర్
♦ శేరిలింగంపల్లిని దత్తత తీసుకుంటానన్న మంత్రి
హైదరాబాద్ : కృష్ణా మూడోదశ, గోదావరి తొలిదశల ద్వారా డిసెంబరు 15 నాటికి 217 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరానికి సరఫరా చేస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. శుక్రవారం రాయదుర్గం సర్వే నంబర్ 83లో రూ.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన మంచినీటి పైపులైన్ పనులకు, రూ.16 కోట్లతో చేపట్టనున్న ఐటీ కారిడార్ బీటీ రోడ్ల నిర్మాణపు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రెండేళ్లలో రూ.20 వేల కోట్లతో రాష్ట్రంలో రహదారులను అభివద్ధి చేస్తామన్నారు. నగరంలో రూ.2651 కోట్లతో ప్రధాన రహదారులపై స్కైవేలను నెలకొల్పుతామన్నారు.
18 చోట్ల బ్రిడ్జిలు రానున్నాయన్నారు. దుర్గం చెరువుపై రూ.178 కోట్లతో సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మిస్తామని దీన్ని రోడ్డు నెంబర్ 45, రోడ్డు నెంబర్ 36, అయ్యప్పసొసైటీలకు కలుపుతామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.575 కోట్లతో వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతులు, రూ.225 కోట్లతో వైట్ టాప్ రోడ్లను అభివద్ధి చేయనున్నామని తెలిపారు. త్వరలో మరో 1800 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుందని మంత్రి వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.500 కోట్ల వ్యయంతో 20 లక్షల ఇళ్లకు ఇంటికి నాలుగు చొప్పున 80 లక్షల ఎల్‌ఈడీ బల్బులను అందిస్తామన్నారు.
మంత్రి, ఎమ్మెల్యేకు అభ్యంతరం లేకుంటే శేరలింగంపల్లి నియోజక వర్గాన్ని తాను దత్తత తీసుకుంటానని, ఉద్యమం తరహాలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామన్నారు. రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ శివారు ప్రాంతాలకు రూ.1900 కోట్లతో మంచి నీటి అందించే పనులకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ ఎండీ ఈ.వి.నరసింహారెడ్డి, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ డాక్టర్ జనార్థన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఐటీ కార్యదర్శి జయేశ్‌రంజన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సైబరాబాద్ కమిషనర్ సీ.వీ.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.