మాట్లాడుతున్న కలెక్టర్ జగన్మోహన్
-
సేవా దృక్పథంతో విధులు నిర్వర్తించాలి
-
కలెక్టర్ జగన్మోహన్
ఉట్నూర్ : ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్యులు సేవా దృక్పథంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. శుక్రవారం కేబీ ప్రాంగణంలోని పీఎమ్మార్సీ భవనంలో ఐటీడీఏ పీవో కర్ణన్‌తో కలిసి రాష్ట్రీయ స్వస్థ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలని అన్నారు. స్థానికంగా నివాసం ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు.
గ్రామాల్లోని 18 ఏళ్లలోపు బాలబాలికలు అనారోగ్యం పాలవకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆశ్రమ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జ్వరాలతో బాధపడే విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గిరిజన ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వైద్యులు గ్రామాలకు వెళ్లేందుకు వీలుగా జిల్లాలోని 17 క్లస్టర్లకు ప్రతీ క్లస్టర్ రెండు చొప్పున 34 వాహనాలు కేటాయించామని చెప్పారు.
వైద్య బృందాలు ప్రతి రోజు కనీసం పది అంగన్‌వాడీ కేంద్రాలు, ఉన్నత పాఠశాలలు, ఆశ్రమాలు సందర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. మూడు నెలలపాటు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ వ్యాధులు, జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో మలేరియాధికారి అల్హం రవి, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి, ఆర్‌బీఎస్‌కే జిల్లా కో ఆర్డినేటర్ సుంకన్న, డీడీటీడబ్ల్యూ రాంమూర్తి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన కలెక్టర్
హరితహారం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ జగన్మోహన్ మండలంలోని ఎక్స్ రోడ్డు చీమ్నానాయక్ తండాలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. మొక్కలు నాటిన ప్రతి ఒక్కరూ వాటిని రక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.