కారును ఢీకొన్న లారీ
-
ఏడుగురికి గాయాలు
-
ఒకరి పరిస్థితి విషమం
వెంకటాచలం : కారును లారీ ఢీకొనడంతో ఏడుగురు గాయపడ్డారు. ఈ సంఘటన వెంకటాచలం వద్ద జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కోవూరుకు చెందిన వెంకటేష్, నెల్లూరుకు చెందిన ఫణీంద్ర కారులో చెన్నైకు వెళ్తుండగా వెంకటాచలం వద్ద వెనుక నుంచి లారీ ఢీకొంది. దీంతో కారు బస్సు కోసం రోడ్డు పక్కన వేచి ఉన్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న వెంకటేష్, ఫణీంద్ర కారు తలుపులు రాక అందులో ఇరుక్కుపోయారు. అక్కడే ఉన్న ప్రయాణికులు కారు అద్దాలు పగలగొట్టి బయటకు లాగారు వీరిద్దరికి స్వల్పగాయాలయ్యాయి. బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికుల్లో గుడ్లూరువారిపాళెంకు చెందిన సజ్జనపు వెంకటసుబ్బయ్య, సుమన్, మనుబోలు మండలం కొమ్మలపూడికి చెందిన సుభాషిణి, ఆమె కుమారుడు నరసింహ, కోట మండలం కోటపోలూరుకు చెందిన చెంగమ్మకు గాయాలయ్యాయి. వీరిలో వెంకటసుబ్బయ్య పరిస్థితి విషమంగా ఉంది. కారు ఢీకొనడంతో వెంకటసుబయ్య డివైడర్‌పై పడిపోవడంతో పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంకటాచలం ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ మోహన్‌కృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై 15 నిమిషాలు ట్రాఫిక్ నిలిచిపోయింది.