
ముంబై మోడల్స్‌తో వ్యభిచారం
విజయవాడ సిటీ : ముంబై మోడళ్లతో నిర్వహిస్తున్న వ్యభిచారం గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేస్తున్నట్టు చెపుతూ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఓ హాస్యనటుని బంధువును కూడా అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెపుతున్నారు. అయితే ఆ వ్యక్తి మాత్రం తాను విటుణ్ణి మాత్రమేనంటూ పోలీసుల ఎదుట వాదిస్తున్నట్టు తెలిసింది. దీనిపై విచారణ చేస్తున్న పోలీసులు పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా నున్న రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని శాంతినగర్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం వచ్చింది.
ముంబై, చెన్నై తదితర ప్రాంతాల నుంచి మోడళ్లను రప్పించి ఇక్కడ వ్యభిచారం చేయిస్తున్నట్టు కొందరు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ వ్యభిచార గృహాన్ని ఓ హాస్య నటుని సమీప బంధువుగా చెప్పుకుంటున్న వ్యక్తి నిర్వహిస్తున్నట్టు కొందరు వ్యక్తులు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో గత కొద్ది రోజులుగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ ఇంటిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే బుధవారం ముంబైకి చెందిన ఓ మోడల్‌ను కాంట్రాక్టు పద్ధతిని తీసుకొచ్చినట్టు తెలిసింది.
పక్కా సమాచారంపై టాస్క్‌ఫోర్స్ ఎసీపీ పి.వి.ఆర్.పి.బి.ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ జి.శ్రీనివాస్, సిబ్బంది గురువారం రాత్రి ఆ ఇంటిపై దాడి చేసి ఇద్దరు యువతులతో పాటు రాజమండ్రికి చెందిన రాజేష్, నగరంలో సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం నిర్వహిస్తున్న మొయినుద్దీన్ మహ్మద్‌ను అదుపులోకి తీసుకొని నున్న రూరల్ పోలీసులకు అప్పగించారు.
వీరిలో మహ్మద్ నిర్వాహకునిగా టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం ఉంది. అయితే తాను కేవలం విటుణ్ణి మాత్రమేనంటూ ఆయన చెపుతున్నాడని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేర్కొంటున్నారు. రాజేష్ మాత్రమే నిర్వహకుడని చెప్పడంతో పూర్తి వివరాలు సేకరించేందుకు నున్న పోలీసులకు అప్పగించారు. నున్న పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణ జరుపుతున్నారు. అదుపులోకి తీసుకున్న యువతుల్లో ఓ యువతి తాను బాంబేలో మోడలింగ్ చేస్తుంటానని తెలిపింది. రోజుకు రూ.10వేల చొప్పున కాంట్రాక్టుతో పాటు విమానం చార్జీలు, బస ఏర్పాటు చేయడంతో ఇక్కడికి వచ్చినట్లు ఆమె పేర్కొంది.
హాస్యనటుని బంధువేనా?
పట్టుబడిన వారిలో ఒకరు హాస్యనటుని బంధువుగా చెపుతున్నారు. నిజంగా బంధువా? లేక వీరు ఆ పేరు ఉపయోగించుకుంటున్నారా? అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.