మాచర్లలో నిలిచిన రైలు
వరదల కారణంగా మాచర్ల– నడికుడి రూట్ బంద్
గుంటూరు (నగరంపాలెం) : పల్నాడులో మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి గురజాల రైల్వేస్టేషన్ సమీపంలో దండేవాగు పొంగి రైల్వే ట్రాకు కొట్టుకుపోవటంతో మాచర్ల–నడికుడి మధ్యలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు గుంటూరు నుంచి బయలుదేరిన ప్యాసింజరు రైలును నడికుడి వరకు నడిపారు. సాయంత్రం అదే రైలును గుంటూరు స్టేషనుకు నడిపారు. మంగళవారం తెల్లవారుజామున మాచర్ల నుంచి బయలుదేరాల్సిన మాచర్ల–భీమవరం రైలును అక్కడే నిలిపివేశారు. బుధవారం కూడా గుంటూరు–నడికుడి మధ్యలోనే రైళ్లను నడపనున్నారు. దండేవాగు నీటి ఉధృతికి కొట్టుకుపోయిన ట్రాకును మంగళవారం మధ్యాహ్నం నీటి ప్రవాహం తగ్గిన వెంటనే పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన రైల్వే అధికారులు ప్రారంభించారు. పాడైపోయిన ట్రాకును తొలగించి నూతన ట్రాకును బుధవారం సాయంత్రం నాటికి సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ విజయశర్మతో పాటు, సీనియర్ డీఈఎన్ కో ఆర్డినేషన్ సైమన్, ఇతర ఇంజనీరింగ్ రైల్వే అధికారులు దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు.