మోడల్ హాస్టళ్ల ప్రారంభంపై నీలినీడలు
మోడల్ హాస్టళ్ల ప్రారంభంపై నీలినీడలు
Published Wed, Aug 10 2016 12:14 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
– సెప్టెంబర్‌లో ప్రారంభించాలన్న ప్రభుత్వం
– వార్డెన్, ఇతర సిబ్బంది నియామకాలు చేపట్టని వైనం
– సంరక్షణాధికారి బాధ్యతలను తిరస్కరిస్తున్న అధ్యాపకులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మోడల్ స్కూల్ బాలికల హాస్టళ్ల ప్రారంభంపై నీలినీడలు అలుముకున్నాయి. హాస్టళ్లకు పక్కా భవనాలు పూర్తయి ఏడాది గడిచినా వాటిని ప్రారంభించేందుకు సర్కార్ చర్యలు తీసుకోవడం లేదు. వచ్చే సెప్టెంబర్‌లో ప్రారంభించాలని సర్కారు నిర్ణయించినప్పటికీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు హాస్టల్ వార్డెన్, ఇతర సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం, మంచినీరు, విద్యుత్ సమస్యలు, మైనర్ మరమ్మతులు నిర్వహించాల్సి ఉండడం ఇందుకు కారణం.
33 హాస్టల్ భవనాలు రెడీ..
జిల్లాలోని అత్యంత వెనుకబడిన 33 మండలాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 33 మోడల్ స్కూళ్లను 2012లో ప్రారంభించారు. ప్రారంభ సమయంలోనే బాలబాలికలకు హాస్టల్ సదుపాయాన్ని కల్పించాల్సి ఉంది. అయితే అప్పట్లో నిధులలేమితో కేవలం స్కూళ్లకు మాత్రమే ప్రారంభం చేశారు. మోడల్ స్కూళ్లన్నీ మండల కేంద్రాలకు రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉండడం, హాస్టళ్లు లేకపోవడంతో బాలుర సంగతి పక్కనపెడితే బాలికలు ఇతర స్కూళ్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో 2013–14 లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 28 లక్షలతో బాలికలకు మాత్రమే హాస్టల్ సదుపాయాన్ని కల్పించేందుకు నిర్ణయం తీసకుంది. వీటిని 2014–15లో ప్రారంభించేందుకు నిర్ణయించినా భవనాల నిర్మాణంలో అంతులేని జాప్యం కారణంగా కుదరలేదు.
వార్డెన్ బాధ్యతలపై అధ్యాపకుల వ్యతిరేకత..
టీజీటీ, పీజీటీలుగా మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న అధ్యాపకులకు అదనపు బాధ్యతగా వార్డెన్ పోస్టును అప్పగించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా అందుకు వారు విముఖత ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రతిపాదనను గతేడాదే ప్రభుత్వం అధ్యాపకుల ముందుంచగా 33 హాస్టళ్లకుగాను కేవలం 15 మంది మాత్రమే వార్డెన్‌గా బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధపడ్డారు.
నిరుద్యోగులతో భర్తీ చేయాలి..
మరోవైపు మోడల్‌స్కూల్ హాస్టళ్లలో పనిచేసే సిబ్బంది పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయాలనే వాదన బలంగా వినిపిస్తోంది. పనిచేస్తున్న లెక్చరర్లకే అదనపు బాధ్యతలుగా హాస్టల్ సమన్వయ పనులను అప్పగిస్తే తీవ్రంగా నష్టపోతామని నిరుద్యోగులు పేర్కొంటున్నారు.
మాకు సమాచారం లేదు: కష్ణయ్య, మోడల్ స్కూల్ ఏడీ
సెప్టెంబర్‌లో హాస్టళ్లను ప్రారంభించాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. హాస్టళ్లలో సదుపాయాలు, సిబ్బంది నియామకం, ఇతర విషయాలపై విధివిధానాలేమి రాలేదు. 33 హాస్టళ్లకు భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రభుత్వం ఆదేశిస్తే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం.
Advertisement