- వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ
గోరంట్ల (సోమందేపల్లి) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రూ.5 వేల కోట్లతో పోలవరం ప్రాజెక్టుకు అనుమతి తీసుకొస్తే అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఒడిస్సా, చత్తీస్‌గడ్ ముఖ్యమంత్రులను కలిసి ప్రాజెక్టును ముందుకు కదలకుండా కోర్టులో వేయించారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ అన్నారు. శనివారం గోరంట్లలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
వైఎస్సార్ హయాంలో జల ప్రాజెక్టులు ప్రారంభించి, దాదాపు 80 శాతం పూర్తయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత 20 శాతం పనులు చేసి, అంతా తానే చేసినట్లు ఆర్భాటం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాడన్నారు. ఎన్నికలకు ముందు పింఛన్లు, రేషన్‌కార్డులు, పేదలకు గృహాలతోపాటు అనేక హామీలు ఇచ్చిన టీడీపీ.. అధికారం చేపట్టిన తర్వాత దగా చేసిందని గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో ప్రజలు తమ వద్ద వాపోతున్నారన్నారు. ప్రజావ్యతిరేకి టీడీపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరపడ్డాయన్నారు. పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి అభివృద్ధిని పక్కన పెట్టి, అక్రమాలను ప్రోత్సహిస్తున్నారన్నారు.
పరిగి మండలం బీచుగానిపల్లిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ప్రజా సమస్యలపై సర్పంచు బాలాజీ ప్రశ్నిస్తే
ఒక ప్రజాప్రతినిధి స్థానంలో ఉండి కూడా చేయిచేసుకునేంత వరకు వెళ్లారన్నారు. చిన్నమంతూరులో ఇసుక అక్రమంగా తరలిస్తూ గ్రామస్తులకు పట్టుబడితే ఎమ్మెల్యే అండ ఉందని ఆయన అనుచరులు బెదిరించడాన్ని బట్టి చూస్తే బీకే ఆగడాలు నియోజకవర్గంలో ఏవిధంగా ఉన్నాయో అర్థమవుతుందన్నారు.
తనకు మంత్రి పదవి వస్తుందని గొప్పలు చెప్పుకుంటూ అధికారులను సైతం భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ప్రజా సమస్యలపై పోరాడటానికి వైఎస్సార్‌సీపీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఫకృద్దీన్, బూదిలి వేణుగోపాల్‌రెడ్డి, శేషాద్రిరెడ్డి, గంపల రమణారెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోలవరం వ్యతిరేకి చంద్రబాబే
Published Sat, Jan 7 2017 11:21 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement