ఇది ప్రభుత్వ నిర్వాకమే!
- మంచినీటి సమస్యపై శంకరనారాయణ
పెనుకొండ : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పెనుకొండతోపాటు జిల్లాలోని అనేక మండలాల్లో తాగునీటి సమస్య ఉత్పన్నమైందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ విమర్శించారు. సోమందేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రధానంగా తాగునీటి సమస్యే కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం ప్రజలకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందన్నారు. పెనుకొండ ఎమ్మెల్యే బీకే.పార్థసారథికి అధికారంపైనే వ్యామోహమని, ప్రజా సమస్యలపై శ్రద్ధ లేదని అన్నారు.
ప్రజలు తాగునీటికి విలవిలలాడుతుంటే కనీసం వారి సమస్యలను వినే పరిస్థితిలో కూడా లేరన్నారు. హంద్రీనీవా కాలువను వెడల్పు చేస్తానని పామిడిలో హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు గొల్లపల్లి రిజర్వాయర్‌కు గడువులోగా నీరు తీసుకొస్తామని ఇచ్చిన హామీని ఎంతమాత్రం నెరవేర్చారో చెప్పాలన్నారు. ఈ రిజర్వాయర్‌కు నీరు తీసుకురావడంలో విఫలమైన ఆయన తెప్పోత్సవం వంటి మాటలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న తాగునీటి పథకాలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో రూ.4వేల కోట్ల పంట నష్టం సంభవించి రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం ఇన్‌పుట్ సబ్సిడీ కానీ, బీమా కానీ అందించిన పాపాన పోలేదన్నారు. ప్రజలు జగన్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా? అని ఎదురు చూస్తున్నారని, టీడీపీకి బుద్ధి చెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి భాస్కరరెడ్డి, మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరు బాబు, సర్పంచ్‌లు సుధాకరరెడ్డి, నారాయణరెడ్డి, కన్వీనర్లు వెంకటరత్నం, శ్రీకాంతరెడ్డి, నారాయణరెడ్డి, ఫక్రోద్దీన్, జిల్లా అధికార ప్రతినిధి రొద్దం చంద్రశేఖర్, ఎంపీటీసీ రామ్మోహనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.