shankarnarayana fires
-
చేనేతను విస్మరించిన చంద్రబాబు
ధర్మవరం: చేనేత రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మాలగుండ్ల శంకరనారాయణ ధ్వజమెత్తారు. సంక్షోభంలో ఉన్న చేనేతరంగాన్ని ఆదుకోవడానికి ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ముఖ్యమంత్రి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చేనేత ముడిపట్టు రాయితీ బకాయిలు చెల్లించాలని కోరుతూ ధర్మవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ నాయకులు చేపట్టిన రిలేదీక్షలు మూడోరోజు బుధవారం కూడా కొనసాగాయి. దీక్షలకు మాజీ ఎమ్మెల్యే, ధర్మవరం సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితో కలసి శంకరనారాయణ హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శంకరనారాయణ మాట్లాడుతూ వ్యవసాయం తరువాత అత్యధికమందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగాన్ని తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ముడిపట్టు రాయితీ, ఎన్‌హెచ్‌డీసీ, ఆరోగ్య బీమా తదితర సంక్షేమ పథకాలన్నింటినీ ఎత్తివేసి చేనేతలకు తీరని ద్రోహం చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు మగ్గం షెడ్లు నిర్మించి ఇస్తామని, చేనేత వస్త్రాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. చేనేత కార్మికులకు ఇస్తున్న ముడిపట్టు రాయితీని రూ.600 నుంచి రూ.1,000 పెంచుతున్నట్లు చేనేత దినోత్సవం రోజున ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారన్నారు. ఆరు నెలలు రూ.1000 చొప్పున రాయితీ ఇచ్చి.. ఆ తరువాత పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించకపోతే చేనేత కార్మికులతో జిల్లా కేంద్రంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రిలేదీక్షల్లో 22వ వార్డు ఇన్చార్జ్ కత్తే పెద్దన్న, మహబూబ్‌బాషా, శ్రీరామిరెడ్డి, శ్రీనివాసులు, మహమ్మద్‌రఫి, మధుసూదన్‌రెడ్డి, దస్తగిరి, చౌడయ్య, బయన్న, రాజా, పెద్దిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, వీరేష్, బాబు, నరేష్, లోకేష్, అమీర్‌బాషా, ప్రభాకర్‌రెడ్డి, అక్కులప్ప, శీనా, నారాయణస్వామి, గోపాల్, నారాయణస్వామి, బాబు, పెద్దనాయుడు, నాగరాజు, గంగ, అమరనాథ, జిక్రియ, చంద్ర, లక్ష్మినారాయణ, హుస్సేన్, నాగరాజు, దాసు, లక్ష్మినారాయణ, శ్రీరాములు, గోపినాథ్, శివ, జగన్, పెద్ద చౌడయ్యలు కూర్చున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు బీరే ఎర్రిస్వామి, పట్టణ అధ్యక్షులు గడ్డం కుళ్లాయప్ప, కౌన్సిలర్ చందమూరి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దమ్ముంటే వారితో రాజీనామా చేయించు
– ఎవరిబలం ఏమిటో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం – వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిజంగా దమ్మూ ధైర్యం ఉంటే వైఎస్సార్సీపీ జెండాపై గెలిచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ సవాల్ విసిరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి వచ్చిన ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డిని...పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాకే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీలో చేర్చుకున్నారనీ, జగన్మోహన్రెడ్డి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారనేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలన్నారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్య విలువలపై ఏమాత్రం నమ్మకం ఉన్నా... వైఎస్సార్ సీపీ గుర్తుతో ఎన్నికల్లో గెలిచి టీడీపీలో చేరిన వారందరి చేత రాజీనామాలు చేయించి ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. అప్పుడు ప్రజాక్షేత్రంలో ఎవరిబలమెంతో తేలుతుందన్నారు. ఇదే విషయమై జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేస్తుంటే... దాన్నుంచి తప్పించుకునేందుకు తన మంత్రులతో ఎదురుదాడికి దిగడం సిగ్గుచేటన్నారు. పట్టిసీమ, రాజధాని భూములు, ఇసుక తరలింపు ఇలా ప్రతి అంశంలోనూ టీడీపీ నేతలు అవినీతిలో కూరుకుపోయాయరని ధ్వజమెత్తారు. అక్రమాలపై ప్రశ్నించిన వైఎస్ జగన్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇలాగే వైస్ జగన్‌ను విమర్శిస్తే....వైఎస్సార్సీపీతో పాటు ప్రజలు కూడా క్షమించరని స్పష్టం చేశారు. -
ఇది ప్రభుత్వ నిర్వాకమే!
- మంచినీటి సమస్యపై శంకరనారాయణ పెనుకొండ : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పెనుకొండతోపాటు జిల్లాలోని అనేక మండలాల్లో తాగునీటి సమస్య ఉత్పన్నమైందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ విమర్శించారు. సోమందేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రధానంగా తాగునీటి సమస్యే కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం ప్రజలకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందన్నారు. పెనుకొండ ఎమ్మెల్యే బీకే.పార్థసారథికి అధికారంపైనే వ్యామోహమని, ప్రజా సమస్యలపై శ్రద్ధ లేదని అన్నారు. ప్రజలు తాగునీటికి విలవిలలాడుతుంటే కనీసం వారి సమస్యలను వినే పరిస్థితిలో కూడా లేరన్నారు. హంద్రీనీవా కాలువను వెడల్పు చేస్తానని పామిడిలో హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు గొల్లపల్లి రిజర్వాయర్‌కు గడువులోగా నీరు తీసుకొస్తామని ఇచ్చిన హామీని ఎంతమాత్రం నెరవేర్చారో చెప్పాలన్నారు. ఈ రిజర్వాయర్‌కు నీరు తీసుకురావడంలో విఫలమైన ఆయన తెప్పోత్సవం వంటి మాటలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న తాగునీటి పథకాలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో రూ.4వేల కోట్ల పంట నష్టం సంభవించి రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం ఇన్పుట్ సబ్సిడీ కానీ, బీమా కానీ అందించిన పాపాన పోలేదన్నారు. ప్రజలు జగన్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా? అని ఎదురు చూస్తున్నారని, టీడీపీకి బుద్ధి చెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి భాస్కరరెడ్డి, మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరు బాబు, సర్పంచ్‌లు సుధాకరరెడ్డి, నారాయణరెడ్డి, కన్వీనర్లు వెంకటరత్నం, శ్రీకాంతరెడ్డి, నారాయణరెడ్డి, ఫక్రోద్దీన్, జిల్లా అధికార ప్రతినిధి రొద్దం చంద్రశేఖర్, ఎంపీటీసీ రామ్మోహనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.