ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిజంగా దమ్మూ ధైర్యం ఉంటే వైఎస్సార్‌సీపీ జెండాపై గెలిచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ సవాల్ విసిరారు.
– ఎవరిబలం ఏమిటో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం
– వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ
అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిజంగా దమ్మూ ధైర్యం ఉంటే వైఎస్సార్‌సీపీ జెండాపై గెలిచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ సవాల్ విసిరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి వచ్చిన ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డిని...పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాకే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలో చేర్చుకున్నారనీ, జగన్‌మోహన్‌రెడ్డి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారనేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలన్నారు.
చంద్రబాబుకు ప్రజాస్వామ్య విలువలపై ఏమాత్రం నమ్మకం ఉన్నా... వైఎస్సార్ సీపీ గుర్తుతో ఎన్నికల్లో గెలిచి టీడీపీలో చేరిన వారందరి చేత రాజీనామాలు చేయించి ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. అప్పుడు ప్రజాక్షేత్రంలో ఎవరిబలమెంతో తేలుతుందన్నారు. ఇదే విషయమై జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేస్తుంటే... దాన్నుంచి తప్పించుకునేందుకు తన మంత్రులతో ఎదురుదాడికి దిగడం సిగ్గుచేటన్నారు. పట్టిసీమ, రాజధాని భూములు, ఇసుక తరలింపు ఇలా ప్రతి అంశంలోనూ టీడీపీ నేతలు అవినీతిలో కూరుకుపోయాయరని ధ్వజమెత్తారు. అక్రమాలపై ప్రశ్నించిన వైఎస్ జగన్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇలాగే వైస్ జగన్‌ను విమర్శిస్తే....వైఎస్సార్‌సీపీతో పాటు ప్రజలు కూడా క్షమించరని స్పష్టం చేశారు.