సానపడుతున్న జమాల్‌షా
– ఆరు పదుల వయసులోనే అలుపెరగని యోధుడు
– సానపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్న జమాల్‌షా
బనగానపల్లె: చదివిన చదువుకు సరైన పని దొరకక ఇబ్బంది పడేవారిని మనం చూసే ఉంటాం. వత్తిలో ఒడిదుడుకులను తట్టకోలేక వేరే వృత్తికి మారే వారిని గమనించి ఉంటాం. పనినే దైవంగా భావించి.. ఆ పనితోనే కుటుంబాన్ని చక్కగా పోషించే వారు అరుదుగా తారసపడతారు. ఇలాంటి కోవకు చెందిన వారే బనగానపల్లె మండలం మీరాపురం గ్రామానికి చెందిన జమాల్‌షా(65). కత్తులు, కత్తెర్లు సానలు పట్టడంలో ఈయన మంచి దిట్ట. రోజుకు 8–10 గంటలు శ్రమించి కుటుంబ పోషణకు అవసరమయ్యే మొత్తాన్ని సంపాదిస్తాడు. ఈ విషయం గ్రామప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు కూడా తెలుసు. గత 30 సంవత్సరాలుగా తాను నమ్ముకున్న వత్తి ద్వారానే తన కుటుంబాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోషిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. తాను ఈ వత్తిని ఎంచుకున్న విధానంపై జమాల్‌షా మాటల్లోనే..‘‘ మాది పేద కుటుంబం. చిన్న వయసులోనే బరువైన పనులు చేయాల్సి వచ్చేది. పని చేయకుంటే అమ్మానాన్న తిట్టేవారు. వారి తిట్టు భరించలేక హైదరబాద్ పారిపోయాను. అక్కడ నాయిబ్రాహ్మణ కులానికి చెందిన వెంకటస్వామి నన్ను ఆదరించారు. సానపట్టు మిషన్ వద్ద మెలకువలు నేర్చుకున్నాను. అప్పట్లో పది వేల రూపాయల పెట్టుబడితో సాన పట్టు మిషన్ కొన్నాను. అదే నాకు ఇప్పుడు బువ్వ పెడుతోంది. కత్తెర సానకు రూ 20, కత్తి సానకు రూ. 15 తీసుకుంటాను. ఎన్నో ప్రాంతాలు తిరిగాను. సుదూర ప్రాంతాలకు వెళ్లిన సమయంలో నెలలో 20 రోజులు అక్కడే ఉండి మరో పది రోజులు ఇంటి వద్ద ఉంటాను. నాకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం చేశాను, పెద్ద కుమారుడు ఆటో నడుపుతున్నాడు. రెండో కుమారుడు ఆర్మీలో పనిచేస్తుండగా, మూడవ కుమారుడు స్వతహాగా జీవనం సాగిస్తున్నాడు. పనిని నేను ఎప్పుడూ అశ్రద్ధ చేయను. ఇదే నా కుమారులకు, కుమార్తెకు కూడా చెప్పాను.’’