అనంతపురం అగ్రికల్చర్ : గొర్రెలు, మేకల సహకార సంఘాల జిల్లా సమాఖ్య (షీప్ అండ్ గోట్ ఫెడరేషన్)లో నెలకొన్న విభేదాల వల్ల బోర్డు మీటింగ్ కోరం లేక వాయిదా పడింది. బుధవారం స్థానిక పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో ఉన్న ఫెడరేషన్ కార్యాలయంలో బోర్డు మీటింగ్‌కు హాజరు కావాలని ఎగ్జిక్యూటివ్ అధికారి ఫెడరేషన్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, మరో 10 మంది డైరెక్టర్లకు అజెండా ప్రతులతో ఆహ్వానాలు పంపారు. సమావేశానికి అధ్యక్షుడు రామకృష్ణతో పాటు మరో ముగ్గురు డైరెక్టర్లు మాత్రమే హాజరయ్యారు. అనారోగ్య కారణాలతో ఎగ్జిక్యూటివ్ అధికారి హాజరు కాలేదు. పశుశాఖ జేడీ డాక్టర్ బి.సన్యాసిరావు సమక్షంలో జరిగిన బోర్డు మీటింగ్‌లో సహకార అధికారి హాజరయ్యారు.
కనీసం 8 మంది హాజరైతే అజెండా ప్రకారం చర్చించి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని సహకార అధికారి తెలిపారు. అధ్యక్షుడు, మరో ముగ్గరు డైరెక్టర్లు మాత్రమే హాజరు కావడంతో కోరం లేదని ప్రకటిస్తూ, మరోరోజు సమావేశం నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని జేడీ ఆదేశించారు. కాగా, బోర్డు మీటింగ్ ఉందని తెలియడంతో గొర్రెలు, మేకల సహకార సంఘాల అధ్యక్షులు పలువురు తరలివచ్చి జేడీ బి.సన్యాసిరావుతో సమావేశమయ్యారు. ఉపాధ్యక్షుడు, మరో ఏడుగురు డైరెక్టర్లు ఉద్దేశపూర్వకంగా బోర్డు మీటింగ్‌కు రానందున, వారితో ప్రమేయం లేకుండా సమావేశం నిర్వహించాలని కోరారు. సొసైటీలకు త్వరలోనే ఎన్‌సీడీసీ కింద రుణాలు మంజూరయ్యే పరిస్థితి ఉన్నందున ఇలాంటి పరిస్థితుల్లో బోర్డు మీటింగ్ వాయిదా పడితే ఇబ్బందులు ఎదురవుతాయని జేడీ దృష్టికి తీసుకెళ్లారు. ఫెడరేషన్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరించి అందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి సొసైటీల అభివృద్ధి, గొర్రెల కాపర్ల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కోరారు. మరోపక్క ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అధ్యక్షుడిపై తమకు విశ్వాసం లేనందున ఆయనపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చించడానికి అజెండా రూపొందిస్తే బోర్డు మీటింగ్ హాజరవుతాయని రెండో వర్గం నాయకులు జేడీకి కబురు పంపినట్లు సమాచారం. అన్ని అంశాలు పరిశీలించి, సహకార నిబంధనల ప్రకారం త్వరలో నిర్ణయం తీసుకుంటామని జేడీ తెలిపారు.
షీప్ ఫెడరేషన్ సమావేశం వాయిదా
Published Wed, Jul 19 2017 10:32 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement