sheep federation
-
మనీ లేదాయె.. ‘మంద’ రాదాయె!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం ఓ ప్రహసనంగా మారింది. బాలారిష్టాలు, అవినీతి ఆరోపణలు, రీసైక్లింగ్ విమర్శల నడుమ మొదటి విడత గొర్రెల పంపిణీ జరగ్గా, రెండో విడత పంపిణీకి నిధుల లేమి అడ్డంకిగా ఉంది. మొదటి విడతలో నాలుగేళ్లపాటు జాప్యం చేసి 3.8 లక్షల యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయగా, రెండో విడత గొర్రెల పంపిణీ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా అర్థంకాని పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడతలో 3.6 లక్షల యూనిట్లను మంజూరు చేసేందుకు అవసరమయ్యే రూ. 6 వేల కోట్లను రుణం కింద ఇవ్వా లని జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్సీడీసీ)కు 4 నెలల క్రితమే రాష్ట్ర గొర్రెల సమాఖ్య లేఖ రాసినా ఇప్పటివరకు అతీగతీ లేదు. అసలు రుణం వస్తుందో లేదో కూడా అర్థం కాని దుస్థితి. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో గొర్రెల పంపిణీకి రూ.1,000 కోట్లు కేటాయించడం గమనార్హం. సమావేశం జరగలేదట! వాస్తవానికి, హుజూరాబాద్ ఉప ఎన్నికల కంటే ముందే రెండో విడత గొర్రెల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 3.6 లక్షల యూనిట్ల పంపిణీకి గొర్రెలు, మేకలు పెంపకందారుల సమాఖ్యకు అనుమతినిచ్చింది. కానీ, ఇప్పటివరకు కేవలం హుజూరాబాద్ నియోజకవర్గంలో పంపిణీ చేసిన 3–4 వేల యూనిట్లు తప్పితే అదనంగా ఒక్క గొర్రెనూ పంపిణీ చేయలేదు. ఇందుకు ఎన్సీడీసీ రుణమే అవరోధంగా మారిందనే చర్చ జరుగుతోంది. ఎన్సీడీసీ బోర్డు సమావేశం జరగనందునే ఇంకా రుణం మంజూరు కావడం లేదని అధికారులు పైకి చెపుతున్నా.. ఆ రుణం మంజూరు లో ఎక్కడో తకరారు జరిగిందనే వాదన కూడా ఉంది. పెండింగ్‌కు ఎప్పుడు మోక్షం రెండో విడత అటుంచితే మొదటి విడతలో పెండింగ్‌లో ఉన్న యూనిట్లను కూడా ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. ఇందులో 21 గొర్రెలు ఒక యూనిట్‌గా లబ్ధిదారులకు ఇచ్చే యూనిట్ ధర రూ.1.25లక్షలు ఉండగా, దాన్ని గత ఏడాది రూ.1.75లక్షలకు పెంచారు. అంటే లబ్ధిదారుల వాటా కింద చెల్లించాల్సిన రూ.31,250కి తోడు అదనంగా రూ.12,500 చెల్లించాల్సి వచ్చింది. నాలుగేళ్ల క్రితమే డీడీలు కట్టినా ప్రభు త్వ జాప్యం వల్లనే తమకు గొర్రెలు రాలేదని, అందువల్ల ఆ అదనపు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని లబ్ధిదారులు అప్పట్లో కోరారు. కానీ, గొర్రెల సమాఖ్య ఒప్పుకోలేదు. రుణ నిబంధనలు అంగీకరించవంటూ అదనపు వాటానూ కట్టించుకున్నారు. కానీ, అదనపు వాటా కట్టిన 28 వేల మం దికి పైగా లబ్ధిదారుల్లో 2 వేల మందికి ఇప్పటివరకు గొర్రెల పంపిణీ చేయలేదు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలానికి చెందిన గొర్రెల పెంపకందారులు అదనపు వాటా చెల్లించి రెండు నెలలైనా ఎదురుచూపులు తప్పలేదు. రూ. 500 కోట్లు చేతులు మారాయి మొదటి విడత గొర్రెల పంపిణీలో అవినీతి ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. హైదరాబాద్‌లోని పశుసంవర్థక శాఖ ప్రధాన కార్యాలయంలోని ఓ కీలక వ్యక్తి కనుసన్నల్లోనే వ్యవహారమంతా సాగిందని, యూనిట్‌కు రేటు పెట్టి కమీషన్లు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. రూ.4 వేల కోట్ల వ్యయంతో సాగిన పంపిణీలో రూ.500 కోట్ల వరకు చేతులు మారాయనే చర్చ పశుసంవర్థక శాఖలో బహిరంగ రహస్యమే కావడం గమనార్హం. పంపిణీ కోసం దళారులు యూనియన్లుగా మారి ఒకచోట సమావేశమయ్యేంత స్థాయిలో అవినీతి జరిగిందని సమాచారం. ఇక, ఆ తర్వాత ఓ ప్రైవేటు సంస్థకు గొర్రెలను ఎంపిక చేసే కాంట్రాక్టును కట్టబెట్టినా.. దీనిపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఆ సంస్థను తప్పించారు. క్షేత్రస్థాయిలోని పశువైద్యుల మొదలు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు ముడుపులు ముట్టాయనే ఆరోపణలున్నాయి. అధికారులు కొన్నిచోట్ల లబ్ధిదారులకు గొర్రెలు ఇవ్వకుండా రూ.60–70 వేల వరకు డబ్బులిచ్చి అవకతవకలకు పాల్పడినట్లు కూడా వినిపిస్తోంది. నగదు బదిలీనే పరిష్కారం గొర్రెల పంపిణీలో అవినీతికి అడ్డుకట్ట వేయడానికి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయమే పర్యవేక్షిస్తుందని పథకం మార్గదర్శకాల్లో పెట్టారు. కానీ, ఒక్కరోజు కూడా సీఎంవో సమీక్షించలేదు. అసలు దళారులను ఎవరు ప్రోత్సహిస్తున్నారో తేల్చాలి. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే గొల్ల, కుర్మలకు నగదు బదిలీ చేసి.. నచ్చిన చోట గొర్రెలు కొనుక్కునే అవకాశమివ్వాలి. ఆ తర్వాత ఆరునెలల్లో ఎప్పుడైనా తనిఖీ చేసి దుర్వినియోగం చేసినట్టు తేలితే వారిపై చర్యలు తీసుకోవాలి. మొదటి విడత పెండింగ్ యూనిట్లను పంపిణీ చేసి, బడ్జెట్లో పెట్టిన రూ.1,000 కోట్ల నిధులతో రెండో విడత పంపిణీని కూడా త్వరగా చేపట్టాలి. – ఉడుత రవీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం -
గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్‌గా దూదిమెట్ల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య నూతన చైర్మన్‌గా డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మాసాబ్‌ట్యాంకులోని సమాఖ్య కార్యాలయంలో జరిగిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు హాజరై బాలరాజు యాదవ్‌ను అభినందించారు. అనంతరం అభినందన సభలో మంత్రులు మాట్లాడుతూ...తెలంగాణ ఉద్యమంలో బాలరాజు యాదవ్ పాత్రను అభినందిస్తూ, ఉద్యమంలో ఆయన కృషిని గుర్తిస్తూ సీఎం కేసీఆర్ పదవిని అప్పగించారన్నారు. రాష్ట్రంలో పాడి, మాంస, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా పథకాలు ప్రవేశ పెట్టారని, గొర్రెల పంపిణీ పథకం ద్వారా మాంస పరిశ్రమ అభివృద్ధికి కేసీఆర్ బాటలు వేశారన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, దానం నాగేందర్, బేతి సుభా‹ష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వీగిపోయిన అవిశ్వాసం
– సజావుగా షీప్ ఫెడరేషన్ ప్రత్యేక సమావేశం – అధ్యక్షుడు రామకృష్ణతో పాటు ఆరుగురు హాజరు – మంత్రి బంధువు రంగంలో దిగడంతో మారిన డైరెక్టర్లు అనంతపురం అగ్రికల్చర్: ఉత్కంఠ రేపిన గొర్రెల మేకల పెంపకందారుల సహకార సంఘాల జిల్లా సమాఖ్య (షీప్ ఫెడరేషన్) ప్రత్యేక పాలక వర్గ సమావేశం శనివారం సాఫీగా జరిగిపోయింది. ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫెడరేషన్‌కు రిజిష్ట్రార్ హోదాలో ఉన్న పశుసంవర్ధకశాఖ జేడీ బి.సన్యాసిరావు అనారోగ్య కారణాలతో గైర్హాజరు కాగా ఆయన స్థానంలో ఆ శాఖ డీడీ డాక్టర్ కె.సుబ్రమణ్యం, ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ ఎం.కాంతమ్మ సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం అనే ఏకైక అజెండాతో సాగింది. అవిశ్వాస తీర్మానం పెట్టిన ఉపాధ్యక్షుడు, మరో నలుగురు డైరెక్టర్లు గైర్హాజరు కావడం, అధ్యక్షుడితో పాటు ఆయనకు మద్దతుగా మరో ఆరుగురు డైరెక్టర్లు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కాగా, అధ్యక్షుడు చిట్రా రామకృష్ణ, డైరెక్టర్లు సి.శివయ్య, ఎస్.సత్యనారాయణరెడ్డి, పి.ధనుంజయ, కె.సుబ్రమణ్యం, కె.సంగప్ప, బీసీ వీరన్న 11.10 గంటలకు వచ్చారు. ఉపాధ్యక్షుడు బాలాంజనేయులు, డైరెక్టర్లు ఆదినారాయణ, జయమ్మ, మల్లన్న, లక్ష్మినారాయణ కోసం అరగంట పాటు వేచిచూశారు. 11.40 గంటలకు అవిశ్వాస తీర్మానంపై ప్రక్రియ ప్రారంభించిన అధికారులు 12.10 గంటలకు ముగించారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు లేకపోవడంతో వీగిపోయినట్లు అధికారులు ప్రకటించారు. సమావేశం తర్వాత అ«ధ్యక్షుడు రామకృష్ణ, ఆయన మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేశారు. రంగంలోకి మంత్రి బంధువు : కొంతకాలంగా ఫెడరేషన్లో నెలకొన్న వివాదాల కారణంగా ఉపాధ్యక్షుడు, మరో ఆరుగురు డైరెక్టర్లు కలిసి అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు పశుశాఖ జేడీ బి.సన్యాసిరావుకు వినతిపత్రం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 11న అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం ఉంటుందని రిజిష్ట్రార్ హోదాలో జేడీ ప్రకటించారు. అదే రోజు మహాజన సభ ఉంటుందని ముందుగా ప్రకటించి తర్వాత వాయిదా వేసినా జిల్లా నలుమూలల నుంచి 11వ తేదీ పెద్ద సంఖ్యలో పశుశాఖ కార్యాలయానికి తరలివచ్చారు. అనారోగ్య కారణాలతో జేడీ హాజరుకాకపోవడంతో ప్రత్యేక సమావేశం శనివారానికి వాయిదా వేశారు. గత 15 రోజులుగా అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఎనిమిది మంది ఏకతాటిపై ఉంటూ వచ్చారు. అవిశ్వాసం నెగ్గడానికి అవసరమైన మెజార్టీ ఉండటంతో అధ్యక్షుడు మార్పు అనివార్యమని అందరూ భావించారు. ఈ క్రమంలో 11వ తేదీ అందరూ పశుసంవర్ధకశాఖ కార్యాలయానికి చేరుకోవడం, అక్కడ పరస్పరం వాదులాటకు దిగడం, చాలా మంది సొసైటీ అధ్యక్షుడు ఫెడరేషన్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో అధ్యక్షుడు రామకృష్ణ వర్గం అప్రమత్తమై మంత్రి పరిటాల సునీత సమీప బంధువును ఆశ్రయించడం, ఆయన రంగంలోకి దిగడంతో తారుమారైనట్లు చెబుతున్నారు. కొంత కాలంగా అసమ్మతి వర్గంలో ఉన్న ఎస్.సత్యనారాయణరెడ్డి, బీసీ వీరన్న, పి.ధనుంజయ అనే ముగ్గురు డైరెక్టర్లను ఎలాగోలా లాక్కుపోవడంతో అవిశ్వాస తీర్మానం ప్రణాళిక బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. శనివారం జరిగిన ప్రత్యేక పాలక వర్గ సమావేశానికి కూడా రాప్తాడు నియోజక వర్గానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు అందరినీ పిలుచుకువచ్చి సమావేశం ముగిసేదాకా పశుశాఖ కార్యాలయంలోనే మకాం వేయడం విశేషం. -
షీప్ ఫెడరేషన్ సమావేశం వాయిదా
అనంతపురం అగ్రికల్చర్ : గొర్రెలు, మేకల సహకార సంఘాల జిల్లా సమాఖ్య (షీప్ అండ్ గోట్ ఫెడరేషన్)లో నెలకొన్న విభేదాల వల్ల బోర్డు మీటింగ్ కోరం లేక వాయిదా పడింది. బుధవారం స్థానిక పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో ఉన్న ఫెడరేషన్ కార్యాలయంలో బోర్డు మీటింగ్‌కు హాజరు కావాలని ఎగ్జిక్యూటివ్ అధికారి ఫెడరేషన్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, మరో 10 మంది డైరెక్టర్లకు అజెండా ప్రతులతో ఆహ్వానాలు పంపారు. సమావేశానికి అధ్యక్షుడు రామకృష్ణతో పాటు మరో ముగ్గురు డైరెక్టర్లు మాత్రమే హాజరయ్యారు. అనారోగ్య కారణాలతో ఎగ్జిక్యూటివ్ అధికారి హాజరు కాలేదు. పశుశాఖ జేడీ డాక్టర్ బి.సన్యాసిరావు సమక్షంలో జరిగిన బోర్డు మీటింగ్‌లో సహకార అధికారి హాజరయ్యారు. కనీసం 8 మంది హాజరైతే అజెండా ప్రకారం చర్చించి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని సహకార అధికారి తెలిపారు. అధ్యక్షుడు, మరో ముగ్గరు డైరెక్టర్లు మాత్రమే హాజరు కావడంతో కోరం లేదని ప్రకటిస్తూ, మరోరోజు సమావేశం నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని జేడీ ఆదేశించారు. కాగా, బోర్డు మీటింగ్ ఉందని తెలియడంతో గొర్రెలు, మేకల సహకార సంఘాల అధ్యక్షులు పలువురు తరలివచ్చి జేడీ బి.సన్యాసిరావుతో సమావేశమయ్యారు. ఉపాధ్యక్షుడు, మరో ఏడుగురు డైరెక్టర్లు ఉద్దేశపూర్వకంగా బోర్డు మీటింగ్‌కు రానందున, వారితో ప్రమేయం లేకుండా సమావేశం నిర్వహించాలని కోరారు. సొసైటీలకు త్వరలోనే ఎన్సీడీసీ కింద రుణాలు మంజూరయ్యే పరిస్థితి ఉన్నందున ఇలాంటి పరిస్థితుల్లో బోర్డు మీటింగ్ వాయిదా పడితే ఇబ్బందులు ఎదురవుతాయని జేడీ దృష్టికి తీసుకెళ్లారు. ఫెడరేషన్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించి అందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి సొసైటీల అభివృద్ధి, గొర్రెల కాపర్ల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కోరారు. మరోపక్క ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అధ్యక్షుడిపై తమకు విశ్వాసం లేనందున ఆయనపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చించడానికి అజెండా రూపొందిస్తే బోర్డు మీటింగ్ హాజరవుతాయని రెండో వర్గం నాయకులు జేడీకి కబురు పంపినట్లు సమాచారం. అన్ని అంశాలు పరిశీలించి, సహకార నిబంధనల ప్రకారం త్వరలో నిర్ణయం తీసుకుంటామని జేడీ తెలిపారు.