వీగిపోయిన అవిశ్వాసం
– సజావుగా షీప్ ఫెడరేషన్ ప్రత్యేక సమావేశం
– అధ్యక్షుడు రామకృష్ణతో పాటు ఆరుగురు హాజరు
– మంత్రి బంధువు రంగంలో దిగడంతో మారిన డైరెక్టర్లు
అనంతపురం అగ్రికల్చర్: ఉత్కంఠ రేపిన గొర్రెల మేకల పెంపకందారుల సహకార సంఘాల జిల్లా సమాఖ్య (షీప్ ఫెడరేషన్) ప్రత్యేక పాలక వర్గ సమావేశం శనివారం సాఫీగా జరిగిపోయింది. ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫెడరేషన్‌కు రిజిష్ట్రార్ హోదాలో ఉన్న పశుసంవర్ధకశాఖ జేడీ బి.సన్యాసిరావు అనారోగ్య కారణాలతో గైర్హాజరు కాగా ఆయన స్థానంలో ఆ శాఖ డీడీ డాక్టర్ కె.సుబ్రమణ్యం, ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ ఎం.కాంతమ్మ సమావేశం నిర్వహించారు.
అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం అనే ఏకైక అజెండాతో సాగింది. అవిశ్వాస తీర్మానం పెట్టిన ఉపాధ్యక్షుడు, మరో నలుగురు డైరెక్టర్లు గైర్హాజరు కావడం, అధ్యక్షుడితో పాటు ఆయనకు మద్దతుగా మరో ఆరుగురు డైరెక్టర్లు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కాగా, అధ్యక్షుడు చిట్రా రామకృష్ణ, డైరెక్టర్లు సి.శివయ్య, ఎస్.సత్యనారాయణరెడ్డి, పి.ధనుంజయ, కె.సుబ్రమణ్యం, కె.సంగప్ప, బీసీ వీరన్న 11.10 గంటలకు వచ్చారు. ఉపాధ్యక్షుడు బాలాంజనేయులు, డైరెక్టర్లు ఆదినారాయణ, జయమ్మ, మల్లన్న, లక్ష్మినారాయణ కోసం అరగంట పాటు వేచిచూశారు. 11.40 గంటలకు అవిశ్వాస తీర్మానంపై ప్రక్రియ ప్రారంభించిన అధికారులు 12.10 గంటలకు ముగించారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు లేకపోవడంతో వీగిపోయినట్లు అధికారులు ప్రకటించారు. సమావేశం తర్వాత అ«ధ్యక్షుడు రామకృష్ణ, ఆయన మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేశారు.
రంగంలోకి మంత్రి బంధువు : కొంతకాలంగా ఫెడరేషన్‌లో నెలకొన్న వివాదాల కారణంగా ఉపాధ్యక్షుడు, మరో ఆరుగురు డైరెక్టర్లు కలిసి అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు పశుశాఖ జేడీ బి.సన్యాసిరావుకు వినతిపత్రం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 11న అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం ఉంటుందని రిజిష్ట్రార్ హోదాలో జేడీ ప్రకటించారు. అదే రోజు మహాజన సభ ఉంటుందని ముందుగా ప్రకటించి తర్వాత వాయిదా వేసినా జిల్లా నలుమూలల నుంచి 11వ తేదీ పెద్ద సంఖ్యలో పశుశాఖ కార్యాలయానికి తరలివచ్చారు. అనారోగ్య కారణాలతో జేడీ హాజరుకాకపోవడంతో ప్రత్యేక సమావేశం శనివారానికి వాయిదా వేశారు. గత 15 రోజులుగా అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఎనిమిది మంది ఏకతాటిపై ఉంటూ వచ్చారు. అవిశ్వాసం నెగ్గడానికి అవసరమైన మెజార్టీ ఉండటంతో అధ్యక్షుడు మార్పు అనివార్యమని అందరూ భావించారు.
ఈ క్రమంలో 11వ తేదీ అందరూ పశుసంవర్ధకశాఖ కార్యాలయానికి చేరుకోవడం, అక్కడ పరస్పరం వాదులాటకు దిగడం, చాలా మంది సొసైటీ అధ్యక్షుడు ఫెడరేషన్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో అధ్యక్షుడు రామకృష్ణ వర్గం అప్రమత్తమై మంత్రి పరిటాల సునీత సమీప బంధువును ఆశ్రయించడం, ఆయన రంగంలోకి దిగడంతో తారుమారైనట్లు చెబుతున్నారు. కొంత కాలంగా అసమ్మతి వర్గంలో ఉన్న ఎస్.సత్యనారాయణరెడ్డి, బీసీ వీరన్న, పి.ధనుంజయ అనే ముగ్గురు డైరెక్టర్లను ఎలాగోలా లాక్కుపోవడంతో అవిశ్వాస తీర్మానం ప్రణాళిక బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. శనివారం జరిగిన ప్రత్యేక పాలక వర్గ సమావేశానికి కూడా రాప్తాడు నియోజక వర్గానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు అందరినీ పిలుచుకువచ్చి సమావేశం ముగిసేదాకా పశుశాఖ కార్యాలయంలోనే మకాం వేయడం విశేషం.