meeting successful
-
సమరభేరి సక్సెస్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: బీజేపీ సమరభేరి సభ సక్సెస్ కావడంతో కమలనాథుల్లో కదనోత్సాహం నింపింది. ‘మార్పు కోసం–బీజేపీ సమరభేరి’ పేరిట బుధవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన సభ ప్రజలు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. ఉత్తర తెలంగాణలోని 9 జిల్లాల నుంచి అంచనాలకు మించి జనం తరలిరావడంతో ఆ పార్టీలో మరింత జోష్ నింపింది. కాషాయ జెండాలు.. నినాదాల హోరుతో స్టేడియం మార్మోగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆయన నిప్పులు చెరిగారు. ప్రజలకిచ్చిన హామీలు తుంగలో తొక్కారని విమర్శించారు. ఐదేళ్లకు వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్తున్నారని అన్నారు. కేంద్రంలోని మోదీ భయంతోనేనని దుయ్యబట్టారు. 2014లో అధికారంలోకి రాగానే దళితుడిని సీఎం చేస్తానని మాటమార్చారన్నారు. నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలతోపాటు ప్రజలకిచ్చిన 150 వాగ్దానాలలో ఏ ఒక్కటీ అమలు చేయకుండా విఫలమయ్యారని విమర్శించారు. 99 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు విడుదల చేసినా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదన్నారు. రజాకార్ల నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించకుండా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మజ్లిస్ నేత ఓవైసీకి తొత్తులుగా మారారన్నారు. టీఆర్ఎస్తోపాటు మహాకూటమిలోని కాంగ్రెస్, టీడీపీ సీపీఐలు మజ్లిస్ పార్టీలు తొత్తులుగానే ఉంటారన్నారు. మజ్లిస్‌ను ఎదుర్కొనే దమ్మున్న పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన కేసీఆర్ ఈబీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఎవరికి కోత విధిస్తుందో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. టీఆర్ఎస్కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదన్నారు. రాహుల్ నాయకత్వంలో 2014 తర్వాత కాంగ్రెస్ ఎక్కడా గెలువలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రాంతాలను దుర్భిణి పెట్టి చూడాల్సిందేనన్నారు. ప్రధాని మోడీ ‘ఆయుష్మా¯న్ భారత్’ ద్వారా ఒకరికి 5 లక్షలు ఇవ్వాలనే పథకం తెలంగాణకు అవసరం లేదని కేసీఆర్ అడ్డుకున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్, రాహుల్ అండ్ కంపెనీ ద్వారా సాధ్యపడదన్నారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. ఎన్నికల్లో బీజేపీకే పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బహిరంగ సభలో రాష్ట్ర, జిల్లా నాయకులు చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, రాష్ట్ర నాయకులు బాబూమోహన్, బండి యెండల లక్ష్మీనారాయణ, కేశ్‌పల్లి ఆనందరెడ్డి, ఎస్.కుమార్, కాసీపేట లింగయ్య, ప్రతాప రామకృష్ణ, మీస అర్జున్‌రావు, కోమల్ల అంజనేయులు, మహిళ నాయకురాళ్లు బల్మూరి వనిత, నాగుల రాజమౌళిగౌడ్తోపాటు తొమ్మిది జిల్లాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్‌కు రక్షణకవచమవుతాను.. కాషాయ జెండాతో సంఘటితమై కరీంనగర్ నియోజకవర్గానికి రక్షణకవచం అవుతానని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ అన్నారు. అధికారంలోకి రాగానే అన్ని వర్గాలను టీఆర్ఎస్ అవమాన పరిచిందన్నారు. స్మార్ట్‌సిటీని డర్టీసిటీగా మార్చారన్నారు. గ్రానైట్, గుట్కా, స్యాండ్ అండ్ ల్యాండ్ మాఫియాలను తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రోత్సహిస్తున్నారన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో కోట్లకు పడగలెత్తాడని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ బీజేపీకి రాష్ట్రంలో డిపాజిట్లు రావంటూ ఎద్దేవా చేస్తున్నారని, ఆయన కరీంనగర్లో డిపాజిట్ కోసం ప్రయత్నాలు చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీదే విజయమని, మిగిలిన పార్టీలకు రాజకీయ సన్యాసం తప్పదన్నారు. ఐటీ దాడులు హైదరాబాద్ కాకుండా కరీంనగర్లో చేపడితే సంచలనాలు బయటపడుతున్నాయన్నారు. ఐటీ వాళ్ల మిషన్లకు సరిపోని డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయని ఆరోపించారు. హిందూ ఓటు బ్యాంకును చీల్చి కొత్త బిచ్చగాళ్ల అవతారమెత్తుతున్నారని, వారి కుటిల ప్రయత్నాలకు ప్రజలు తగిన సమాధానం చెబుతారన్నారు. టీఆర్ఎస్కు ఇక చరమగీతమే.. నాలుగున్నరేళ్లలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చని టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత ఉందని బీజేపీ కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్కు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కరీంనగర్‌ను లండన్ చేస్తామన్న కేసీఆర్ పూర్తిగా పట్టణాన్ని నరకంగా మార్చారన్నారు. ఆచరణకు నోచని హామీలతో కాంగ్రెస్ పార్టీ ఉత్తర ప్రగల్బాలకే పరిమితమైందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి హామీలు భారత ప్రభుత్వ బడ్జెట్ కూడా సరిపోదన్నారు. పదేళ్ల యూపీఏ పాలనలో కాంగ్రెస్ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందన్నారు. ఆకాశాన్ని, భూమిని వదలలేదని, పాతాళంలోని బొగ్గును సైతం కుంభకోణం చేశారన్నారు. పీఎంఏవై ఇళ్లు రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారన్నారు. కనీసం ఏ ఒక్కరికీ డబుల్బెడ్రూం ఇళ్లు నిర్మించలేదన్నారు. జిల్లాలోని 13 అసెంబ్లీల్లో బీజేపీని ఆదరించాలని, ఆత్మహత్యలు, ఆకలి లేని రాజ్యాన్ని అన్ని వసతులతో అభివృద్ధి చెందే తెలంగాణగా మార్చుతామన్నారు. కేసీఆర్ గెలిస్తే రజకార్ల పాలనే.. మరోసారి టీఆర్ఎస్కు అధికారం కట్టబెడితే రజాకార్ల పాలనే కొనసాగుతుందని, ప్రజాస్వామ్య పాలన రాదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. సమరభేరి ద్వారా ఉమ్మడి జిల్లా నుంచే మార్పు రాబోతోందన్నారు. అధికారం కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలు ప్రజలను వివిధ రకాలుగా మభ్యపెడుతున్నారన్నారు. అధికార పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్కరూ గెలవలేరన్నారు. కేసీఆర్‌ది అరిగిపోయిన రికార్డు అని పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజలు ఆ నాడు బ్రహ్మరథం పట్టి రాజకీయ జీవితమిస్తే జిల్లాను 7 ముక్కలు చేసి కక్ష కట్టిండన్నారు. ఆయువు పట్టు లాంటి ఎస్సారెస్పీ ద్వారా 16.38 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా 1968లో డిజైన్ చేస్తే ఆ నీళ్లు వృథాగా పోనిస్తూ రైతాంగాన్ని ఆగం చేస్తున్నారన్నారు. మిడ్‌మానేరు నీళ్లు సిద్దిపేట, గజ్వెల్‌కు తీసుకుపోవడానికి కుట్రలు పన్నుతున్నారన్నారు. ప్రగతిభవన్ కట్టుకున్నాడు కానీ పేదలకు డబుల్బెడ్రూంలు కట్టివ్వలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి జాడేలేదన్నారు. కేసీఆర్ ఇప్పటివరకు నైజాం పాలనే కొనసాగించారని, కుటుంబ పాలనను సహించేది లేదన్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం.. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మార్పు కోసం బీజేపీ గత నెల 15న పాలమూరులో శంఖారావం ద్వారా ముందస్తు ఎన్నికలకు సిద్ధమైందన్నారు. మిషన్ 60 ప్లస్ లక్ష్యంగా రాష్ట్రంలో 60కి పైగా శాసనసభా నియోజకవర్గాలలో పాగా వేసేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. అవినీతి కాంగ్రెస్, హామీలు తుంగలో తొక్కిన టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడేలా విస్తృత ప్రచారంతో ప్రజలను మమేకం చేస్తామన్నారు. తెలంగాణలో బీజేపీని ఆదరించి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. -
నూతనోత్సాహం
సాక్షి, వనపర్తి: వనపర్తి శివారులోని నాగవరంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీ ఆర్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది. ముందస్తు ఎన్నికల వేళ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారపర్వాన్ని మరింత ముమ్మ రం చేయనున్నారు. సభా వేదిక నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాం గ్రెస్ పార్టీ ముఖ్య నేతలుగా ఉన్న జిల్లెల చిన్నారెడ్డి, డీకే అరుణ, రేవంత్‌రెడ్డిపై విమర్శల ఎక్కుపెట్టారు. అదే సమయంలో టీడీ పీని టార్గెట్ చేసిన తీరు గులాబీ శ్రేణుల్లో ఉత్సా హం నింపింది. దీనికితోడు ప్రాజెక్టులు, సాగునీటి వాటాల్లో గతంలో పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయాన్ని సీఎం కేసీఆర్ ఎత్తిచూపారు. మహ బూబ్‌నగర్ అనగానే కరువు, వలసలు, లేబర్ జిల్లా, పెండింగ్ ప్రాజెక్టుల జిల్లాగా పేరు పడిందని వివరిస్తూనే ఉమ్మడి జిల్లా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. స్పీడు పెంచిన కారు రాష్ట్రంలో జరిగే ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదలైంది. నవంబర్ 12న నోటిఫికేషన్, డిసెంబర్ 7న ఎన్నికలు, 11న ఫలితాలు విడుదలకానున్నాయని ఎన్నికల కమిషన్ స్పష్టంచేసింది. కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించడంతో ఉమ్మ డి జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ తరఫున ఇప్పటికే ప్రకటించిన 14 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు ప్రచారంలో మరింత వేగం పెంచనున్నారు. జిల్లాలో కాంగ్రెస్, టీడీపీలకు బలమైన అభ్యర్థులు ఉన్నారు. కేసీఆర్ వారిపై విమర్శలు గుప్పించి గతంతో వారు అధికారంలో ఉండగా జిల్లా అభివృద్ధికి ఏం చేశారో.. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేసిందో చెప్పేందుకు ప్రయత్నించారు. నాలుగున్నరేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు తోడు కేసీఆర్‌కు ఉన్న ఛరిస్మా తమను గెలిపిస్తుందని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు గెలిపిస్తుందనే ధీమా.. కేసీఆర్ తన ప్రసంగంలో ఎక్కువగా ప్రాజెక్టులు, సాగునీరు అంశాన్ని ప్రస్తావించాడు. ప్రస్తుత ఎన్నికల్లో సాగునీరే టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు రాలుస్తుందనే ధీమాలో ఉన్నట్లు కనిపించింది. ఎందుకంటే 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, భీమాతో పాటు పలు ప్రాజెక్టుల్లో అధికశాతం పనులు పూర్తయ్యాయి. కానీ అప్పటికీ అవి అసంపూర్తిగానే ఉండటంతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తిచేశారు. కేఎల్ఐ ద్వారా నీటి లభ్యత 25 టీఎంసీలే ఉన్నా దానిని 40 టీఎంసీలకు పెంచారు. నీటి కేటాయింపులు ఉన్నప్పటికీ నింపడానికి రిజర్వాయర్లు అందుబాటులో లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలో సుమారు వెయ్యి చెరువులు నింపుతున్నారు. తద్వారా సాగు బాగా పెరగింది. ఈ ఏడాది పాలమూరు జిల్లాలో అందుబాటులో ఉన్న జూ రాల, కేఎల్ఐ, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా తదితర కాల్వల ద్వారా సుమారు ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందినట్లు టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మరోసారి అధికారం దక్కితే పెండింగ్‌లో ఉన్న పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పూర్తిచేసి పాలమూరులో 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇచ్చి మరో కోనసీమలా మారుస్తామని ప్రజలకు హామీఇచ్చారు. -
సభ గ్రాండ్ సక్సెస్
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ముందస్తు ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలవారీగా బహిరంగసభల షెడ్యూల్‌ను ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తొలిసభను బుధవా రం నిజామాబాద్‌లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో సభ నిర్వహించారు. తొలి సభ కావడంతో మిగతా జిల్లాల్లో నిర్వహించే సభలకు ఊపునిచ్చే విధంగా ఆ పార్టీ నేతలు భారీ జనసమీకరణ చేపట్టారు. దీంతో సభాస్థలి పూర్తిగా నిండిపోయింది. సభకు తరలివచ్చిన వారితో భైపాస్రోడ్డు, ఆర్మూర్ రహదారి, నగరంలో ట్రాఫిక్ జాం ఏర్పడింది. మైదానంలో స్థలం లేకపోవ డంతో వేలాది మంది రోడ్డుపైనే వేచి ఉన్నారు. అధినేత తొలి సభను విజయవంతం చేసేందుకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వారం రోజులుగా ఏర్పాట్లు చేశారు. అనుకున్నదానికంటే ఎక్కువ సంఖ్యలో జనం రావడంతో నాయకుల్లో ఆనందం వ్యక్తమైంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభ విజయవంతం కావడం ఎన్నికల ప్రచారానికి మరింత ఊపునిచ్చిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సభ కోసం ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేపట్టారు. బస్సులు, డీసీఎంలు, ప్రైవేటు వాహనాల్లో ప్రజలను తరలించారు. నేల ఈనిందా అన్నట్లు సభకు జనం తరలివచ్చిందని, గతంలో ఎప్పుడు లేనివిధంగా జన ప్రభంజనం కనిపిస్తోందని కేసీఆర్ పేర్కొనడం గమనార్హం. ఉత్సాహాన్ని నింపిన అధినేత ప్రసంగం.. అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సుమారు 50 నిమిషాల పాటు సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ సుదీర్ఘ ప్రసంగం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ప్రతిపక్ష పార్టీలపై వేసిన పంచ్ డైలాగ్‌లు ఉర్రూతలూగించాయి. కాంగ్రెస్ – టీడీపీల పొత్తుపై కేసీఆర్‌తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై కేసీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ నేపథ్యంలో సాగిన ప్రసంగాల మాదిరిగానే కథలతో వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. నిజామాబాద్ గులాబీ ఖిల్లా అని మరోమారు రుజువు చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ బహిరంగసభ విజయవంతం కావడం ఎన్నికల బరిలో నిలుస్తున్న ఆ పార్టీ అభ్యర్థులకు మరింత ఊపునిచ్చిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ పౌరుషానికి ప్రతీక ఇందూరు.. తెలంగాణ పౌరుషానికి నిజామాబాద్ జిల్లా ప్రతీక అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. భారీ ఎత్తున తరలివచ్చిన జనసమూహాన్ని ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగంలో కేసీఆర్ తనకు జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉందని ప్రకటించారు. రాష్ట్రంలోనే తొలిసారి నిజామాబాద్ జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగిరిందన్నారు. 2014 ఎన్నికల్లో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, మేయర్, జెడ్పీ చైర్మన్‌ను గెలిపించుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరోమారు చాటారన్నారు. తెలంగాణ ఉద్యమంలో జిల్లా ముందుందని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ ‘పునర్జీవనం’తో సస్యశ్యామలం జిల్లాలో ప్రతి ఎకరానికి సాగు నీరందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇది తన బాధ్యత అని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ పునర్జీవన పథకం, కాళేశ్వరం ప్రాజెక్టుతో జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. జాకోరా వద్ద లిఫ్టులు ఏర్పాటు చేయాల్సి ఉందన్న కేసీఆర్.. మంజీర, పెద్దవాగు, గోదావరి నదుల్లోని ప్రతిబొట్టును సాగునీటి కోసం వినియోగించుకుంటామన్నారు. నిజాంసాగర్‌కు ఒక టీఎంసీ.. నిజాంసాగర్ ఆయకట్టును ఆదుకునేందుకు సింగూరు ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ నీటిని నిజాంసాగర్‌కు విడుదల చేయాలని నిర్ణయించామని కేసీఆర్ ప్రకటించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా మంత్రి పోచారం పట్టుబట్టి టీఎంసీ నీటిని సాధించుకున్నారని పేర్కొన్నారు. బీడీ కార్మికులకు పింఛన్లు.. గతంలో మోర్తాడ్‌లో ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తున్నామని, రాష్ట్రంలోని బీడీ కార్మికుల్లో 39 శాతం జిల్లాలోనే ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకే రూ. 10 కోట్ల బకాయిలను చెల్లించి ఎర్రజొన్న రైతులను ఆదుకున్నామన్నారు. మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం.. జిల్లాలో మైనారిటీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. మరో రెండు నెలల్లో మిషన్ భగీరథ పనులు పూర్తవుతాయని, జిల్లాలో 1,690 గ్రామాలకు నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో బాన్సువాడ, బోధన్, నిజామాబాద్‌రూరల్ నియోజకవర్గాల్లో ఉన్న ఆంధ్రులు ఎప్పటి నుంచో ఇక్కడే నివాసం ఉంటున్నారన్న కేసీఆర్.. సెటిలర్లు అంతా తెలంగాణ బిడ్డలేనని పేర్కొన్నారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా, హన్మంత్ సింధే, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, మహ్మద్ షకీల్, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్‌రావు, పాతూరి సుధాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, వైస్ చైర్మన్ గడ్డం సుమనారెడ్డి, పార్టీ జిల్లా ఇన్చార్జి తుల ఉమ, డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారి, డీసీఎంఎస్ చైర్మన్ ముజీబుద్దీన్, మేయర్ ఆకుల సుజాత, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. -
వీగిపోయిన అవిశ్వాసం
– సజావుగా షీప్ ఫెడరేషన్ ప్రత్యేక సమావేశం – అధ్యక్షుడు రామకృష్ణతో పాటు ఆరుగురు హాజరు – మంత్రి బంధువు రంగంలో దిగడంతో మారిన డైరెక్టర్లు అనంతపురం అగ్రికల్చర్: ఉత్కంఠ రేపిన గొర్రెల మేకల పెంపకందారుల సహకార సంఘాల జిల్లా సమాఖ్య (షీప్ ఫెడరేషన్) ప్రత్యేక పాలక వర్గ సమావేశం శనివారం సాఫీగా జరిగిపోయింది. ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫెడరేషన్‌కు రిజిష్ట్రార్ హోదాలో ఉన్న పశుసంవర్ధకశాఖ జేడీ బి.సన్యాసిరావు అనారోగ్య కారణాలతో గైర్హాజరు కాగా ఆయన స్థానంలో ఆ శాఖ డీడీ డాక్టర్ కె.సుబ్రమణ్యం, ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ ఎం.కాంతమ్మ సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం అనే ఏకైక అజెండాతో సాగింది. అవిశ్వాస తీర్మానం పెట్టిన ఉపాధ్యక్షుడు, మరో నలుగురు డైరెక్టర్లు గైర్హాజరు కావడం, అధ్యక్షుడితో పాటు ఆయనకు మద్దతుగా మరో ఆరుగురు డైరెక్టర్లు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కాగా, అధ్యక్షుడు చిట్రా రామకృష్ణ, డైరెక్టర్లు సి.శివయ్య, ఎస్.సత్యనారాయణరెడ్డి, పి.ధనుంజయ, కె.సుబ్రమణ్యం, కె.సంగప్ప, బీసీ వీరన్న 11.10 గంటలకు వచ్చారు. ఉపాధ్యక్షుడు బాలాంజనేయులు, డైరెక్టర్లు ఆదినారాయణ, జయమ్మ, మల్లన్న, లక్ష్మినారాయణ కోసం అరగంట పాటు వేచిచూశారు. 11.40 గంటలకు అవిశ్వాస తీర్మానంపై ప్రక్రియ ప్రారంభించిన అధికారులు 12.10 గంటలకు ముగించారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు లేకపోవడంతో వీగిపోయినట్లు అధికారులు ప్రకటించారు. సమావేశం తర్వాత అ«ధ్యక్షుడు రామకృష్ణ, ఆయన మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేశారు. రంగంలోకి మంత్రి బంధువు : కొంతకాలంగా ఫెడరేషన్లో నెలకొన్న వివాదాల కారణంగా ఉపాధ్యక్షుడు, మరో ఆరుగురు డైరెక్టర్లు కలిసి అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు పశుశాఖ జేడీ బి.సన్యాసిరావుకు వినతిపత్రం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 11న అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం ఉంటుందని రిజిష్ట్రార్ హోదాలో జేడీ ప్రకటించారు. అదే రోజు మహాజన సభ ఉంటుందని ముందుగా ప్రకటించి తర్వాత వాయిదా వేసినా జిల్లా నలుమూలల నుంచి 11వ తేదీ పెద్ద సంఖ్యలో పశుశాఖ కార్యాలయానికి తరలివచ్చారు. అనారోగ్య కారణాలతో జేడీ హాజరుకాకపోవడంతో ప్రత్యేక సమావేశం శనివారానికి వాయిదా వేశారు. గత 15 రోజులుగా అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఎనిమిది మంది ఏకతాటిపై ఉంటూ వచ్చారు. అవిశ్వాసం నెగ్గడానికి అవసరమైన మెజార్టీ ఉండటంతో అధ్యక్షుడు మార్పు అనివార్యమని అందరూ భావించారు. ఈ క్రమంలో 11వ తేదీ అందరూ పశుసంవర్ధకశాఖ కార్యాలయానికి చేరుకోవడం, అక్కడ పరస్పరం వాదులాటకు దిగడం, చాలా మంది సొసైటీ అధ్యక్షుడు ఫెడరేషన్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో అధ్యక్షుడు రామకృష్ణ వర్గం అప్రమత్తమై మంత్రి పరిటాల సునీత సమీప బంధువును ఆశ్రయించడం, ఆయన రంగంలోకి దిగడంతో తారుమారైనట్లు చెబుతున్నారు. కొంత కాలంగా అసమ్మతి వర్గంలో ఉన్న ఎస్.సత్యనారాయణరెడ్డి, బీసీ వీరన్న, పి.ధనుంజయ అనే ముగ్గురు డైరెక్టర్లను ఎలాగోలా లాక్కుపోవడంతో అవిశ్వాస తీర్మానం ప్రణాళిక బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. శనివారం జరిగిన ప్రత్యేక పాలక వర్గ సమావేశానికి కూడా రాప్తాడు నియోజక వర్గానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు అందరినీ పిలుచుకువచ్చి సమావేశం ముగిసేదాకా పశుశాఖ కార్యాలయంలోనే మకాం వేయడం విశేషం.