సభ గ్రాండ్‌ సక్సెస్‌ | KCR Meeting Is Successful In Nizamabad | Sakshi
Sakshi News home page

సభ గ్రాండ్‌ సక్సెస్‌

Published Thu, Oct 4 2018 10:09 AM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

KCR Meeting Is Successful In Nizamabad - Sakshi

గులాబీ దళపతి కేసీఆర్‌ బుధవారం ఇందూరు గడ్డపై నిర్వహించిన బహిరంగ సభ గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యింది. సభాస్థలి అయిన గిరిరాజ్‌ కళాశాల మైదానం జనసంద్రమైంది. భారీగా తరలివచ్చిన ప్రజలకు ఉత్తేజాన్నిచ్చేలా కేసీఆర్‌ ప్రసంగం సాగింది. సభ విజయవంతం కావడం, తమ అధినేత ప్రతిపక్షాలపై ఘాటైన విమర్శలు చేయడం టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: ముందస్తు ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలవారీగా బహిరంగసభల షెడ్యూల్‌ను ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. తొలిసభను బుధవా రం నిజామాబాద్‌లోని గిరిరాజ్‌ కళాశాల మైదానంలో సభ నిర్వహించారు. తొలి సభ కావడంతో మిగతా జిల్లాల్లో నిర్వహించే సభలకు ఊపునిచ్చే విధంగా ఆ పార్టీ నేతలు భారీ జనసమీకరణ చేపట్టారు. దీంతో సభాస్థలి పూర్తిగా నిండిపోయింది. సభకు తరలివచ్చిన వారితో భైపాస్‌రోడ్డు, ఆర్మూర్‌ రహదారి, నగరంలో ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. మైదానంలో స్థలం లేకపోవ డంతో వేలాది మంది రోడ్డుపైనే వేచి ఉన్నారు.

అధినేత తొలి సభను విజయవంతం చేసేందుకు నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వారం రోజులుగా ఏర్పాట్లు చేశారు. అనుకున్నదానికంటే ఎక్కువ సంఖ్యలో జనం రావడంతో నాయకుల్లో ఆనందం వ్యక్తమైంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభ విజయవంతం కావడం ఎన్నికల ప్రచారానికి మరింత ఊపునిచ్చిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.  
సభ కోసం ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేపట్టారు. బస్సులు, డీసీఎంలు, ప్రైవేటు వాహనాల్లో ప్రజలను తరలించారు. నేల ఈనిందా అన్నట్లు సభకు జనం తరలివచ్చిందని, గతంలో ఎప్పుడు లేనివిధంగా జన ప్రభంజనం కనిపిస్తోందని కేసీఆర్‌ పేర్కొనడం గమనార్హం.

ఉత్సాహాన్ని నింపిన అధినేత ప్రసంగం..
అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సుమారు 50 నిమిషాల పాటు సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ సుదీర్ఘ ప్రసంగం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ప్రతిపక్ష పార్టీలపై వేసిన పంచ్‌ డైలాగ్‌లు ఉర్రూతలూగించాయి. కాంగ్రెస్‌ – టీడీపీల పొత్తుపై కేసీఆర్‌తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై కేసీఆర్‌ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ నేపథ్యంలో సాగిన ప్రసంగాల మాదిరిగానే కథలతో వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. నిజామాబాద్‌ గులాబీ ఖిల్లా అని మరోమారు రుజువు చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ బహిరంగసభ విజయవంతం కావడం ఎన్నికల బరిలో నిలుస్తున్న ఆ పార్టీ అభ్యర్థులకు మరింత ఊపునిచ్చిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
 
తెలంగాణ పౌరుషానికి ప్రతీక ఇందూరు..
తెలంగాణ పౌరుషానికి నిజామాబాద్‌ జిల్లా ప్రతీక అని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. భారీ ఎత్తున తరలివచ్చిన జనసమూహాన్ని ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగంలో కేసీఆర్‌ తనకు జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉందని ప్రకటించారు. రాష్ట్రంలోనే తొలిసారి నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగిరిందన్నారు. 2014 ఎన్నికల్లో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, మేయర్, జెడ్పీ చైర్మన్‌ను గెలిపించుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరోమారు చాటారన్నారు. తెలంగాణ ఉద్యమంలో జిల్లా ముందుందని పేర్కొన్నారు.

ఎస్సారెస్పీ ‘పునర్జీవనం’తో సస్యశ్యామలం
జిల్లాలో ప్రతి ఎకరానికి సాగు నీరందిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. ఇది తన బాధ్యత అని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ పునర్జీవన పథకం, కాళేశ్వరం ప్రాజెక్టుతో జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. జాకోరా వద్ద లిఫ్టులు ఏర్పాటు చేయాల్సి ఉందన్న కేసీఆర్‌.. మంజీర, పెద్దవాగు, గోదావరి నదుల్లోని ప్రతిబొట్టును సాగునీటి కోసం వినియోగించుకుంటామన్నారు.

నిజాంసాగర్‌కు ఒక టీఎంసీ.. 
నిజాంసాగర్‌ ఆయకట్టును ఆదుకునేందుకు సింగూరు ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ నీటిని నిజాంసాగర్‌కు విడుదల చేయాలని నిర్ణయించామని కేసీఆర్‌ ప్రకటించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా మంత్రి పోచారం పట్టుబట్టి టీఎంసీ నీటిని సాధించుకున్నారని పేర్కొన్నారు.

బీడీ కార్మికులకు పింఛన్లు..
గతంలో మోర్తాడ్‌లో ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు పింఛన్‌ ఇస్తున్నామని, రాష్ట్రంలోని బీడీ కార్మికుల్లో 39 శాతం జిల్లాలోనే ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకే రూ. 10 కోట్ల బకాయిలను చెల్లించి ఎర్రజొన్న రైతులను ఆదుకున్నామన్నారు. మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం.. జిల్లాలో మైనారిటీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. మరో రెండు నెలల్లో మిషన్‌ భగీరథ పనులు పూర్తవుతాయని, జిల్లాలో 1,690 గ్రామాలకు నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో బాన్సువాడ, బోధన్, నిజామాబాద్‌రూరల్‌ నియోజకవర్గాల్లో ఉన్న ఆంధ్రులు ఎప్పటి నుంచో ఇక్కడే నివాసం ఉంటున్నారన్న కేసీఆర్‌.. సెటిలర్లు అంతా తెలంగాణ బిడ్డలేనని పేర్కొన్నారు. 


మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్, మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌ గుప్తా, హన్మంత్‌ సింధే, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, మహ్మద్‌ షకీల్, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్‌రావు, పాతూరి సుధాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు, వైస్‌ చైర్మన్‌ గడ్డం సుమనారెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌చార్జి తుల ఉమ, డీసీసీబీ చైర్మన్‌ గంగాధర్‌రావు పట్వారి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ముజీబుద్దీన్, మేయర్‌ ఆకుల సుజాత, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

సీఎం సభలో నృత్యం చేస్తున్న కార్యకర్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement