సభలో నినదిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా
సాక్షిప్రతినిధి, కరీంనగర్: బీజేపీ సమరభేరి సభ సక్సెస్ కావడంతో కమలనాథుల్లో కదనోత్సాహం నింపింది. ‘మార్పు కోసం–బీజేపీ సమరభేరి’ పేరిట బుధవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన సభ ప్రజలు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. ఉత్తర తెలంగాణలోని 9 జిల్లాల నుంచి అంచనాలకు మించి జనం తరలిరావడంతో ఆ పార్టీలో మరింత జోష్ నింపింది. కాషాయ జెండాలు.. నినాదాల హోరుతో స్టేడియం మార్మోగింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆయన నిప్పులు చెరిగారు. ప్రజలకిచ్చిన హామీలు తుంగలో తొక్కారని విమర్శించారు. ఐదేళ్లకు వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్తున్నారని అన్నారు. కేంద్రంలోని మోదీ భయంతోనేనని దుయ్యబట్టారు. 2014లో అధికారంలోకి రాగానే దళితుడిని సీఎం చేస్తానని మాటమార్చారన్నారు.
నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలతోపాటు ప్రజలకిచ్చిన 150 వాగ్దానాలలో ఏ ఒక్కటీ అమలు చేయకుండా విఫలమయ్యారని విమర్శించారు. 99 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు విడుదల చేసినా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదన్నారు. రజాకార్ల నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించకుండా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మజ్లిస్ నేత ఓవైసీకి తొత్తులుగా మారారన్నారు.
టీఆర్‌ఎస్‌తోపాటు మహాకూటమిలోని కాంగ్రెస్, టీడీపీ సీపీఐలు మజ్లిస్ పార్టీలు తొత్తులుగానే ఉంటారన్నారు. మజ్లిస్‌ను ఎదుర్కొనే దమ్మున్న పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన కేసీఆర్ ఈబీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఎవరికి కోత విధిస్తుందో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదన్నారు. రాహుల్ నాయకత్వంలో 2014 తర్వాత కాంగ్రెస్ ఎక్కడా గెలువలేదన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రాంతాలను దుర్భిణి పెట్టి చూడాల్సిందేనన్నారు. ప్రధాని మోడీ ‘ఆయుష్మా¯న్ భారత్’ ద్వారా ఒకరికి 5 లక్షలు ఇవ్వాలనే పథకం తెలంగాణకు అవసరం లేదని కేసీఆర్ అడ్డుకున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్, రాహుల్ అండ్ కంపెనీ ద్వారా సాధ్యపడదన్నారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. ఎన్నికల్లో బీజేపీకే పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
బహిరంగ సభలో రాష్ట్ర, జిల్లా నాయకులు చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, రాష్ట్ర నాయకులు బాబూమోహన్, బండి యెండల లక్ష్మీనారాయణ, కేశ్‌పల్లి ఆనందరెడ్డి, ఎస్.కుమార్, కాసీపేట లింగయ్య, ప్రతాప రామకృష్ణ, మీస అర్జున్‌రావు, కోమల్ల అంజనేయులు, మహిళ నాయకురాళ్లు బల్మూరి వనిత, నాగుల రాజమౌళిగౌడ్‌తోపాటు తొమ్మిది జిల్లాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్‌కు రక్షణకవచమవుతాను..
కాషాయ జెండాతో సంఘటితమై కరీంనగర్ నియోజకవర్గానికి రక్షణకవచం అవుతానని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ అన్నారు. అధికారంలోకి రాగానే అన్ని వర్గాలను టీఆర్‌ఎస్ అవమాన పరిచిందన్నారు. స్మార్ట్‌సిటీని డర్టీసిటీగా మార్చారన్నారు. గ్రానైట్, గుట్కా, స్యాండ్ అండ్ ల్యాండ్ మాఫియాలను తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రోత్సహిస్తున్నారన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో కోట్లకు పడగలెత్తాడని ఆరోపించారు.
కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ బీజేపీకి రాష్ట్రంలో డిపాజిట్లు రావంటూ ఎద్దేవా చేస్తున్నారని, ఆయన కరీంనగర్‌లో డిపాజిట్ కోసం ప్రయత్నాలు చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీదే విజయమని, మిగిలిన పార్టీలకు రాజకీయ సన్యాసం తప్పదన్నారు. ఐటీ దాడులు హైదరాబాద్ కాకుండా కరీంనగర్‌లో చేపడితే సంచలనాలు బయటపడుతున్నాయన్నారు. ఐటీ వాళ్ల మిషన్లకు సరిపోని డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయని ఆరోపించారు. హిందూ ఓటు బ్యాంకును చీల్చి కొత్త బిచ్చగాళ్ల అవతారమెత్తుతున్నారని, వారి కుటిల ప్రయత్నాలకు ప్రజలు తగిన సమాధానం చెబుతారన్నారు.
టీఆర్‌ఎస్‌కు ఇక చరమగీతమే..
నాలుగున్నరేళ్లలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చని టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత ఉందని బీజేపీ కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కరీంనగర్‌ను లండన్ చేస్తామన్న కేసీఆర్ పూర్తిగా పట్టణాన్ని నరకంగా మార్చారన్నారు. ఆచరణకు నోచని హామీలతో కాంగ్రెస్ పార్టీ ఉత్తర ప్రగల్బాలకే పరిమితమైందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి హామీలు భారత ప్రభుత్వ బడ్జెట్ కూడా సరిపోదన్నారు. పదేళ్ల యూపీఏ పాలనలో కాంగ్రెస్ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందన్నారు. ఆకాశాన్ని, భూమిని వదలలేదని, పాతాళంలోని బొగ్గును సైతం కుంభకోణం చేశారన్నారు. పీఎంఏవై ఇళ్లు రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారన్నారు. కనీసం ఏ ఒక్కరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించలేదన్నారు. జిల్లాలోని 13 అసెంబ్లీల్లో బీజేపీని ఆదరించాలని, ఆత్మహత్యలు, ఆకలి లేని రాజ్యాన్ని అన్ని వసతులతో అభివృద్ధి చెందే తెలంగాణగా మార్చుతామన్నారు.
కేసీఆర్ గెలిస్తే రజకార్ల పాలనే..
మరోసారి టీఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెడితే రజాకార్ల పాలనే కొనసాగుతుందని, ప్రజాస్వామ్య పాలన రాదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. సమరభేరి ద్వారా ఉమ్మడి జిల్లా నుంచే మార్పు రాబోతోందన్నారు. అధికారం కోసం టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీలు ప్రజలను వివిధ రకాలుగా మభ్యపెడుతున్నారన్నారు. అధికార పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్కరూ గెలవలేరన్నారు. కేసీఆర్‌ది అరిగిపోయిన రికార్డు అని పేర్కొన్నారు.
కరీంనగర్ ప్రజలు ఆ నాడు బ్రహ్మరథం పట్టి రాజకీయ జీవితమిస్తే జిల్లాను 7 ముక్కలు చేసి కక్ష కట్టిండన్నారు. ఆయువు పట్టు లాంటి ఎస్సారెస్పీ ద్వారా 16.38 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా 1968లో డిజైన్ చేస్తే ఆ నీళ్లు వృథాగా పోనిస్తూ రైతాంగాన్ని ఆగం చేస్తున్నారన్నారు. మిడ్‌మానేరు నీళ్లు సిద్దిపేట, గజ్వెల్‌కు తీసుకుపోవడానికి కుట్రలు పన్నుతున్నారన్నారు. ప్రగతిభవన్ కట్టుకున్నాడు కానీ పేదలకు డబుల్‌బెడ్‌రూంలు కట్టివ్వలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి జాడేలేదన్నారు. కేసీఆర్ ఇప్పటివరకు నైజాం పాలనే కొనసాగించారని, కుటుంబ పాలనను సహించేది లేదన్నారు.
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం..
బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మార్పు కోసం బీజేపీ గత నెల 15న పాలమూరులో శంఖారావం ద్వారా ముందస్తు ఎన్నికలకు సిద్ధమైందన్నారు. మిషన్ 60 ప్లస్ లక్ష్యంగా రాష్ట్రంలో 60కి పైగా శాసనసభా నియోజకవర్గాలలో పాగా వేసేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. అవినీతి కాంగ్రెస్, హామీలు తుంగలో తొక్కిన టీఆర్‌ఎస్ పాలనకు చరమగీతం పాడేలా విస్తృత ప్రచారంతో ప్రజలను మమేకం చేస్తామన్నారు. తెలంగాణలో బీజేపీని ఆదరించి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment