సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం ఓ ప్రహసనంగా మారింది. బాలారిష్టాలు, అవినీతి ఆరోపణలు, రీసైక్లింగ్ విమర్శల నడుమ మొదటి విడత గొర్రెల పంపిణీ జరగ్గా, రెండో విడత పంపిణీకి నిధుల లేమి అడ్డంకిగా ఉంది. మొదటి విడతలో నాలుగేళ్లపాటు జాప్యం చేసి 3.8 లక్షల యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయగా, రెండో విడత గొర్రెల పంపిణీ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా అర్థంకాని పరిస్థితి.
రాష్ట్రవ్యాప్తంగా రెండో విడతలో 3.6 లక్షల యూనిట్లను మంజూరు చేసేందుకు అవసరమయ్యే రూ. 6 వేల కోట్లను రుణం కింద ఇవ్వా లని జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ)కు 4 నెలల క్రితమే రాష్ట్ర గొర్రెల సమాఖ్య లేఖ రాసినా ఇప్పటివరకు అతీగతీ లేదు. అసలు రుణం వస్తుందో లేదో కూడా అర్థం కాని దుస్థితి. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో గొర్రెల పంపిణీకి రూ.1,000 కోట్లు కేటాయించడం గమనార్హం.
సమావేశం జరగలేదట!
వాస్తవానికి, హుజూరాబాద్ ఉప ఎన్నికల కంటే ముందే రెండో విడత గొర్రెల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 3.6 లక్షల యూనిట్ల పంపిణీకి గొర్రెలు, మేకలు పెంపకందారుల సమాఖ్యకు అనుమతినిచ్చింది. కానీ, ఇప్పటివరకు కేవలం హుజూరాబాద్ నియోజకవర్గంలో పంపిణీ చేసిన 3–4 వేల యూనిట్లు తప్పితే అదనంగా ఒక్క గొర్రెనూ పంపిణీ చేయలేదు. ఇందుకు ఎన్‌సీడీసీ రుణమే అవరోధంగా మారిందనే చర్చ జరుగుతోంది. ఎన్‌సీడీసీ బోర్డు సమావేశం జరగనందునే ఇంకా రుణం మంజూరు కావడం లేదని అధికారులు పైకి చెపుతున్నా.. ఆ రుణం మంజూరు లో ఎక్కడో తకరారు జరిగిందనే వాదన కూడా ఉంది.
పెండింగ్‌కు ఎప్పుడు మోక్షం
రెండో విడత అటుంచితే మొదటి విడతలో పెండింగ్‌లో ఉన్న యూనిట్లను కూడా ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. ఇందులో 21 గొర్రెలు ఒక యూనిట్‌గా లబ్ధిదారులకు ఇచ్చే యూనిట్ ధర రూ.1.25లక్షలు ఉండగా, దాన్ని గత ఏడాది రూ.1.75లక్షలకు పెంచారు. అంటే లబ్ధిదారుల వాటా కింద చెల్లించాల్సిన రూ.31,250కి తోడు అదనంగా రూ.12,500 చెల్లించాల్సి వచ్చింది.
నాలుగేళ్ల క్రితమే డీడీలు కట్టినా ప్రభు త్వ జాప్యం వల్లనే తమకు గొర్రెలు రాలేదని, అందువల్ల ఆ అదనపు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని లబ్ధిదారులు అప్పట్లో కోరారు. కానీ, గొర్రెల సమాఖ్య ఒప్పుకోలేదు. రుణ నిబంధనలు అంగీకరించవంటూ అదనపు వాటానూ కట్టించుకున్నారు. కానీ, అదనపు వాటా కట్టిన 28 వేల మం దికి పైగా లబ్ధిదారుల్లో 2 వేల మందికి ఇప్పటివరకు గొర్రెల పంపిణీ చేయలేదు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలానికి చెందిన గొర్రెల పెంపకందారులు అదనపు వాటా చెల్లించి రెండు నెలలైనా ఎదురుచూపులు తప్పలేదు.
రూ. 500 కోట్లు చేతులు మారాయి
మొదటి విడత గొర్రెల పంపిణీలో అవినీతి ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. హైదరాబాద్‌లోని పశుసంవర్థక శాఖ ప్రధాన కార్యాలయంలోని ఓ కీలక వ్యక్తి కనుసన్నల్లోనే వ్యవహారమంతా సాగిందని, యూనిట్‌కు రేటు పెట్టి కమీషన్లు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. రూ.4 వేల కోట్ల వ్యయంతో సాగిన పంపిణీలో రూ.500 కోట్ల వరకు చేతులు మారాయనే చర్చ పశుసంవర్థక శాఖలో బహిరంగ రహస్యమే కావడం గమనార్హం.
పంపిణీ కోసం దళారులు యూనియన్లుగా మారి ఒకచోట సమావేశమయ్యేంత స్థాయిలో అవినీతి జరిగిందని సమాచారం. ఇక, ఆ తర్వాత ఓ ప్రైవేటు సంస్థకు గొర్రెలను ఎంపిక చేసే కాంట్రాక్టును కట్టబెట్టినా.. దీనిపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఆ సంస్థను తప్పించారు. క్షేత్రస్థాయిలోని పశువైద్యుల మొదలు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు ముడుపులు ముట్టాయనే ఆరోపణలున్నాయి. అధికారులు కొన్నిచోట్ల లబ్ధిదారులకు గొర్రెలు ఇవ్వకుండా రూ.60–70 వేల వరకు డబ్బులిచ్చి అవకతవకలకు పాల్పడినట్లు కూడా వినిపిస్తోంది.
నగదు బదిలీనే పరిష్కారం
గొర్రెల పంపిణీలో అవినీతికి అడ్డుకట్ట వేయడానికి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయమే పర్యవేక్షిస్తుందని పథకం మార్గదర్శకాల్లో పెట్టారు. కానీ, ఒక్కరోజు కూడా సీఎంవో సమీక్షించలేదు. అసలు దళారులను ఎవరు ప్రోత్సహిస్తున్నారో తేల్చాలి. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే గొల్ల, కుర్మలకు నగదు బదిలీ చేసి.. నచ్చిన చోట గొర్రెలు కొనుక్కునే అవకాశమివ్వాలి.
ఆ తర్వాత ఆరునెలల్లో ఎప్పుడైనా తనిఖీ చేసి దుర్వినియోగం చేసినట్టు తేలితే వారిపై చర్యలు తీసుకోవాలి. మొదటి విడత పెండింగ్ యూనిట్లను పంపిణీ చేసి, బడ్జెట్‌లో పెట్టిన రూ.1,000 కోట్ల నిధులతో రెండో విడత పంపిణీని కూడా త్వరగా చేపట్టాలి.
– ఉడుత రవీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment