సాక్షి, హైదరాబాద్: రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీకి రంగం సిద్ధమైంది. వచ్చే నెల 5వ తేదీ నుంచి రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. గొర్రెల పంపిణీ పథకంపై మంగళవారం డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తలసాని సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షాసమావేశంలో గొర్రెల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌సిన్హా, డైరెక్టర్ డాక్టర్. ఎస్.రాంచందర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయి 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, ఈ ఉత్సవాల్లో భాగంగా వచ్చే నెల 5వ తేదీ నుంచి గొర్రెల పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, ఈలోగా లబ్ధిదారులను తీసుకెళ్లి గొర్రెలు కొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
రూ.500 కోట్లు విడుదల
కాగా, గొర్రెల పంపిణీ పథకానికి అవసరమైన నిధులను ఇవ్వడంలో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) జాప్యం చేస్తున్న నేపథ్యంలో ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వమే తన ఖజానా నుంచి నిధులను సమకూర్చాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రస్తుతానికి రూ.1000 కోట్ల నిధులను మంజూరు చేసింది.
రూ.వెయ్యి కోట్లలో రూ.500 కోట్లకు గాను ఆర్థిక శాఖ బడ్జెట్ విడుదల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో గొర్రెల కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లలో పశుసంవర్ధక శాఖ అధికారులున్నారు. కాగా, రెండో విడత పంపిణీ ప్రక్రియను వచ్చే నెల 5వ తేదీన మంత్రి తలసాని నల్లగొండలో ప్రారంభించనుండగా, అదే రోజున అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment