శివయ్యా.. కనవయ్యా!
శివయ్యా.. కనవయ్యా!
Published Tue, Feb 14 2017 12:24 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైలంలో ఎక్కడి పనులక్కడే!
- ఏ రోడ్డు చూసినా గుంతలమయమే..
- భక్తులు ఈ ఉత్సవాల్లోనూ తిప్పలే
- దుమ్ము లేస్తున్నా పట్టని అధికారులు
- శివరాత్రి సమీపిస్తున్నా కొనసాగుతున్న పనులు
- ఎప్పటిలానే విడిదికి తప్పని ఇక్కట్లు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: శివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి తరలివచ్చే భక్తులకు ఈ ఏడాదీ కష్టాలు తప్పేలా లేవు. ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి పనులు కూడా ఇంకా పూర్తికాకపోవదం చూస్తే భక్తులకు ప్రతి ఏటా వచ్చే ఇబ్బందులు ఈ విడత కూడా తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధాన రహదారిలో ఇంకా రోడ్ల ఏర్పాటు పనులు పూర్తికాకపోవడంతో కళ్లల్లో దుమ్ముతోనే దేవుని దర్శనానికి వెళ్లక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఈ శివరాత్రి సందర్భంగానైనా సాధారణ భక్తులకు కాసింత విడిది సౌకర్యం కల్పించేలా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆది నుంచీ అంతే..!
వాస్తవానికి శ్రీశైలంలో జరిగే పనుల వ్యవహారం మొదటి నుంచీ ఇదే విధంగా ఉంటోంది. ఉత్సవాలు సమీపించే సమయంలో పనులు చేపట్టడం.. తీరా ఉత్సవాలు ప్రారంభమైన తర్వాత హడావుడిగా పనులను నాసిరకంగా చేపట్టడం అలవాటుగా మారింది. అటు కాంట్రాక్టర్లకు, ఇటు ఉద్యోగులకు ఇది ఎప్పుడూ జరిగే వ్యవహారం అనే చందంగా తయారయ్యింది. ప్రతి ఏటా జరిగే శివరాత్రి ఉత్సవాలతో పాటు గత ఏడాది జరిగిన కృష్ణా పుష్కరాల సమయంలోనూ ఇదే తంతు జరిగింది. ఇటు పుష్కరాల ప్రారంభ కార్యక్రమం జరుగుతుంటే మరోవైపు పనులు చేపట్టారు. ఇది భక్తులకు తీవ్ర అసౌకర్యంగా మారింది. ప్రస్తుతం కూడా శివరాత్రి సందర్భంగా ఇదే వ్యవహారం సాగుతోంది. కనీసం ఆలయం వద్దకు వెళ్లే ప్రధాన రహదారి పనులు కూడా పూర్తి చేయలేదంటే పనులు జరుగుతున్న తీరుకు అద్దం పడుతోంది. శ్రీశైలంలో పనుల వ్యవహారం ఎప్పుడూ ఇంతేననే విషయం ఈ విడతలోనూ నిరూపితమైంది.
భక్తులకు సౌకర్యాలేవీ?
ప్రతి ఏటా భక్తులకు విడిది సౌకర్యం కష్టతరంగా మారుతోంది. ఆలయం ముందే భక్తులు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోంది. చలువ పందిళ్లను ఏర్పాటు చేసినప్పటికీ అవి కూడా పూర్తిస్థాయిలో సరిపోవడం లేదు. శ్రీశైలంలో శివరాత్రి సమయంలో విడిది సౌకర్యం కేవలం వీఐపీలకే పరిమితమవుతోందనే విమర్శలున్నాయి. సాధారణ భక్తులకు ఎక్కడ చూసినా రూంలు ఖాళీ లేవనే సమాధానమే ఎదురవుతోంది. ఈ సారైనా సాధారణ భక్తులకు కాసింత విడిది సౌకర్యం కల్పించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Advertisement