జీజీహెచ్‌పై షార్ట్ ఫిల్మ్
గుంటూరు మెడికల్: పేదలకు కార్పొరేట్ వైద్యసేవలు అందిస్తూ, అరుదైన ఆపరేషన్లు చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించిన గుంటూరు జీజీహెచ్ గురించి షార్ట్‌ఫిల్మ్‌ను తీస్తున్నారు. రాష్ట్రంలో గుండె మార్పిడి ఆపరేషన్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వ ఆస్పత్రిగా రికార్డు సృష్టించిన జీజీహెచ్‌కు శనివారం ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎంప్యానల్ డైరెక్టర్ ఎ.సైదారెడ్డి వచ్చి వీడియో తీశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రి గురించి తొలిసారిగా షార్ట్‌ఫిల్మ్ తీస్తున్నామని, అది కూడా గుంటూరు జీజీహెచ్ గురించి ఫిల్మ్ చిత్రీకరించడం సంతోషంగా ఉందన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడుని, కొన్ని వైద్య విభాగాలను షూట్ చేశారు. ఆస్పత్రి చాలా పరిశుభ్రంగా ఉందని, కార్పొరేట్ ఆస్పత్రికి దీటుగా ఉందని సూపరింటెండెంట్‌ను అభినందించారు. ఆస్పత్రిలో ఎన్‌టీఆర్ వైద్యసేవ పథకం అమలు గురించి ఆరా తీశారు. జీజీహెచ్‌పై ఉన్న అపోహలు తొలగిపోయేలా డాక్యుమెంటరీ రూపొందించి పేద ప్రజలు జీజీహెచ్‌లో కార్పొరేట్ వైద్యసేవలను వినియోగించుకునేలా చేస్తామన్నారు. సుమారు మూడు నిమిషాల నిడివిగల షార్ట్‌ఫిల్మ్ వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తారని చెప్పారు.