జీజీహెచ్‌లో చిన్నారికి వైద్యం నిరాకరణ
Published Tue, Jul 19 2016 10:17 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
బాధితుల ఆందోళనతో ఆసుపత్రిలో అడ్మిషన్
గుంటూరు మెడికల్ : గుంటూరు జీజీహెచ్‌లో కొందరు వైద్యుల తీరుతో ఆసుపత్రి ప్రతిష్ట మంటగలిసిపోతోంది. కొద్దిపాటి కాలిన గాయాలతో వైద్యం కోసం వచ్చిన చిన్నారికి చికిత్స చేయకుండా రాత్రంతా అత్యవసర విభాగంలోనే ఉంచారు. వైద్యం చేయకపోగా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాలని, లేని పక్షంలో చిన్నారి ఆరోగ్యం విషమంగా మారుతుందని భయాందోళనకు గురిచేశారు. సోమవారం సాయంత్రం ఆస్పత్రికి వచ్చిన చిన్నారికి మంగళవారం మధ్యాహ్నం వరకు ఎలాంటి వైద్య సేవలు అందించకపోవడంతో బాధితులు ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేసి ఆందోళన చేశారు. దీంతో ఎట్టకేలకు మంగళవారం సాయంత్రానికి చిన్నారికి వార్డులో అడ్మిషన్ లభిం చింది. బాధితుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌కు చెందిన కొక్కెరపాటి చంద్రబాబు, నవ్య దంపతుల కుమార్తె ఎనిమిది నెల ల పూజిత సోమవారం ఇంట్లో స్నానానికి నీళ్లు తోడిన సమయంలో శరీరంపై వేడి నీళ్లుపడి గాయపడింది. వెంటనే తల్లిదండ్రులు చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు గుంటూరులో ప్రత్యేక వార్డు ఉందని చెప్పి రిఫర్ చేశారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు క్యాజువాలిటీకి వచ్చిన చిన్నారి పూజితకు వైద్యులు అడ్మిషన్ ఇవ్వలేదు. జనరల్ సర్జరీ వైద్యులు, పిడియాట్రిక్ సర్జరీ వైద్యులు, ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు, చిన్నపిల్లల వైద్య నిపుణులు చిన్నారిని అడ్మిట్ చేసుకోకుండా మాకు సంబంధించింది కాదంటే మాకు సంబంధించింది కాదంటూ మిన్నకుండిపోయారు. ఒక పక్క కాలినగాయాలతో పసికందు తీవ్రంగా రోదిస్తున్నా వైద్యులు పట్టించుకోకపోవడం చిన్నారి తల్లిదండ్రులను తీవ్రంగా కలిచి వేసింది. విషయం తెలిసిన మీడియా ఆసుపత్రికి చేరుకోవడంతో ఆర్‌ఎంవో డాక్టర్ యనమల రమేష్, క్యాజువాలిటీకి చేరుకుని చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి వారికి వార్డులో అడ్మిషన్ ఇచ్చారు.
Advertisement
Advertisement