జీజీహెచ్‌లో విద్యార్థిని మృతి
జీజీహెచ్‌లో విద్యార్థిని మృతి
Published Fri, Oct 14 2016 9:00 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
గుంటూరు ఈస్ట్: జ్వరంతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మతి చెందిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. పైగా మతిచెందిన తర్వాత కూడా ఐసీయూలోకి తీసుకువెళ్లి ప్రత్యేక వైద్యం అందించినట్టు వైద్యులు నాటకాలాడారని బంధువులు ఆరోపించడం జీజీహెచ్‌లో కలకలం రేపింది.
మృతురాలి మేనమామ గోరంట్ల సురేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తాడికొండ మండలం బైజోత్‌పురంలో నివసించే కూరపాటి నాగరాజు,సుజాతకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ప్రణతి (16) తెనాలిలోని జేఎమ్‌జే కళాశాలలో హాస్టల్‌లో ఉంటూ ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులకు గుంటూరు స్వర్ణభారతి నగర్‌లోని తన అమ్మమ్మ గోరంట్ల మేరీ ఇంటికి వచ్చింది. గురువారం ఉదయం నుంచి జ్వరంగా ఉండడంతో పాటు సాయంత్రానికి తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు జీజీహెచ్ అత్యవసర విభాగానికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం 103 వార్డుకు తరలించారు. అర్ధరాత్రిలో ప్రణతి కడుపునొప్పితో మెలికలు తిరిగి వాంతి చేసుకుంది. ఆరోగ్యం క్షీణించిన విషయాన్ని డ్యూటీలో ఉన్న డాక్టర్లకు తెలియచేసినా వారు పట్టించుకోలేదని బంధువులు ఆరోపించారు. శుక్రవారం ఉదయం ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. డ్యూటీలో లేని మరో వైద్యుడు ప్రణతి మృతి చెందిన విషయాన్ని బంధువుల చెవిలో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న వైద్యులు హడావుడిగా విద్యార్థినిని ఐసీయూకి తరలించారు. కొంతసేపు ప్రత్యేక వైద్యం చేసి ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు. వైద్యుల నిర్లక్ష్యం ఫలితంగానే ప్రణతి మృతి చెందిందని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. లిఖిత పూర్వకంగా బాధితులు ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతామని ఆర్‌ఎమ్‌వో డాక్టర్ రమేష్ హామీ ఇచ్చినా బంధువులు ఆందోళన కొన సాగించారు.
Advertisement
Advertisement