గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల
సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్లకు తగినట్లుగా కళాశాలతోపాటు జీజీహెచ్ (బోధనాస్పత్రి)లో వసతులు, వైద్య పరికరాలను కల్పించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) పలు మార్లు తనిఖీలు జరిపి ఎంబీబీఎస్ సీట్లను తగ్గించడం, పీజీ వైద్య విద్య పూర్తి చేసిన వారికిసైతం గుర్తింపు ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఎంసీఐ తనిఖీలు జరిపిన సమయంలో వసతులు, వైద్య పరికరాల కొరతను గుర్తించింది. వాటిని నిర్ణీత సమయంలో ఏర్పాటు చేసుకోని పక్షంలో ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరించింది. వైద్య పరికరాలు, సౌకర్యాలపై ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని వైద్య విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం చేసిన తప్పుకు విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారని పేర్కొంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎందరో గొప్ప డాక్టర్లను దేశ, విదేశాలకు అందించిన గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో వసతులు, సరైన భవనాలు, వైద్య పరికరాలు, బోధనా సిబ్బంది లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది. దీనికి అనుబంధంగా ఉన్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్)లో సైతం 40 ఏళ్ల క్రితం ఉన్న వసతులు మినహా కొత్తగా ఏమీ సమకూరకపోవడంతో భారత వైద్య మండలి (ఎంసీఐ) బృందం తని ఖీలకు వచ్చిన ప్రతిసారీ ఇతర బోధనా ఆస్పత్రుల నుంచి నర్సులు, వైద్య సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకుని కష్టం నుంచి గట్టెక్కాల్సిన దుస్థితి నెలకొంది. గుంటూరులో రాజధాని నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఆరు జిల్లాలకు ఆరోగ్య ప్రదాయనిగా ఉన్న జీజీహెచ్‌పై ప్రభుత్వం శ్రద్ధ కనబర్చడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీజీహెచ్ ఏర్పడిన కొత్తలో 1,170 పడకలు అధికారికంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం వాటి సంఖ్య సుమారుగా రెండు వేలకు చేరింది. అయితే నర్సులు, బోధనా సిబ్బంది, వైద్య సిబ్బంది మాత్రం గతంలో మాదిరిగానే ఉన్నారు.
కొత్తగా ఈ పోస్టులను భర్తీ చేసిన దాఖలాలు లేవు. గుంటూరు వైద్య కళాశాలలో 2013వ సంవత్సరంలో 150 ఎంబీబీఎస్ సీట్లను 200లకు పెంచుతూ భారత వైద్య మండలి నిర్ణయించింది. అయితే అందుకు తగ్గట్లుగా వసతులు, సౌకర్యాలు కల్పించలేకపోయారంటూ 2014లో 50 సీట్లను తొలగించింది. అప్పట్లో వైద్య విద్య ఉన్నతాధికారులు, ప్రభుత్వం వసతుల కల్పనపై ఎంసీఐకి హామీలు ఇచ్చి 50 సీట్లను మళ్లీ తెచ్చుకున్నారు. అయితే నాలుగేళ్లు దాటుతున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఎంసీఐ త్వరలో గుంటూరు వైద్య కళాశాల, జీజీహెచ్‌లో తనిఖీలకు రానున్న నేపథ్యంలో వసతులు సక్రమంగా లేవని గుర్తిస్తే తమకు గుర్తింపు ఇవ్వరేమోననే ఆందోళనలో వైద్య విద్యార్థులు ఉన్నారు. గతంలో యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి విభాగాల్లో పీజీ పూర్తి చేసిన వైద్యులు గుర్తింపు లేక మూడేళ్లపాటు రోడ్లపై తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కూడా వైద్య కళాశాలలోని చర్మవ్యాధుల విభాగం, రేడియాలజీ విభాగాలతోపాటు మరికొన్ని విభాగాల్లో కొన్ని సీట్లకు ఇప్పటికి గుర్తింపు లేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంసీఐ తనిఖీల నేపథ్యంలో హడావుడిగా తూతూ మంత్రపు చర్యలు చేపట్టి కంటితుడుపుగా వ్యవహరించకుండా ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని కనుగొని వైద్య విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వసతులు, సౌకర్యాలు మెరుగు పర్చాం
త్వరలో ఎంసీఐ తనిఖీలు జరుగనున్న నేపథ్యంలో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో నిబంధనలకు తగినట్లుగా సౌకర్యాలు, వసతులు కల్పించాం. బోధనాస్పత్రి జీజీహెచ్‌లో సైతం వసతులు, వైద్య పరికరాల కొరత తీర్చాం. పీజీ సీట్లకు ఇబ్బంది కలగకుండా జీజీహెచ్‌లో ఎంఆర్‌ఐ స్కాన్ మిషన్ ఏర్పాటు చేసి త్వరలో ప్రారంభించేందుకు సమాయత్తం అవుతున్నాం. బోధనా సిబ్బంది కొరత కూడా కొంత మేరకు తీరింది. రెండు, మూడు పీజీ కోర్సుల్లో ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. ఈసారి ఎంసీఐ తనిఖీల్లో ఇబ్బందులన్ని తొలగిపోతాయని ఆశిస్తున్నాం. విద్యార్థులు ఎవరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు.
– డాక్టర్ సుబ్బారావు, గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్
Comments
Please login to add a commentAdd a comment