షార్ట్‌కట్‌ ప్రమోషన్‌ | shortcut pramotion | Sakshi
Sakshi News home page

షార్ట్‌కట్‌ ప్రమోషన్‌

Published Mon, Aug 8 2016 6:24 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

వ్యవసాయ శాఖ కార్యాలయాల సముదాయం - Sakshi

వ్యవసాయ శాఖ కార్యాలయాల సముదాయం

  • డిప్యూటీ డైరెక్టర్లున్నా.. ఏడీకి జేడీఏ పదవి..
  • వ్యవసాయ శాఖ పోస్టింగ్‌లో చోద్యం 
  • గాడితప్పుతున్న పథకాలు, పాలన 
  • సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌ : వ్యవసాయ శాఖలో పాలన రోజురోజుకు అస్తవ్యస్తంగా తయారవుతోంది. పైస్థాయి అధికారులను కాదని, కింది స్థాయి అధికారులకు కీలక పదవులను కట్టబెట్టడం ఈ శాఖలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో వ్యవసాయ శాఖలో ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. వీరిని కాదని అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అధికారిని ఆ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌గా కొనసాగించడంపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం జేడీఏ అధికారి పోస్టు ఖాళీగా ఉంటే, ఆ స్థాయి అధికారిని నియమించాలి. లేనిపక్షంలో డిప్యూటీ డైరెక్టర్‌ స్థాయి అధికారికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాలి. కానీ ఈ నిబంధనలకు విరుద్ధంగా ఈ శాఖలో పోస్టింగ్‌ల వ్యవహారం కొనసాగుతుండడం విమర్శలకు దారితీస్తోంది. 
     
    పోస్టింగ్‌ల పందేరం..
    జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన రోజ్‌లీల గత ఏడాది జూలైలో ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి ఇక్కడ పోస్టింగ్‌ల పందేరం కొనసాగుతోంది. ఇన్‌చార్జిగా ఉట్నూర్‌లో భూసార సంరక్షణ కేంద్రం అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అధికారి జేడీఏగా కొనసాగుతున్నారు. కానీ జిల్లాలో ప్రస్తుతం ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. ఆదిలాబాద్‌లోని రైతు శిక్షణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌గా దాదారావు నియమితులయ్యారు. ఖానాపూర్‌ ఏడీఏగా పనిచేస్తున్న దాదారావుకు పదోన్నతి కల్పిస్తూ ఈ పోస్టింగ్‌ ఇచ్చింది. అలాగే నిజామాబాద్‌ జిల్లాలో ఏడీఏగా పనిచేసిన గంగారాంకు కూడా డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ భూసార సంరక్షణ కేంద్రం అధికారిగా నియమించింది.
     
    ఇలా ఈ ఇద్దరు ఉన్నతాధికారులు జిల్లాలో ఉన్నప్పటికీ, గత కొంత కాలంగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌నే జేడీఏగా కొనసాగించడంపై ఆ శాఖలో సర్వత్రా చర్చ జరుగుతోంది. గతంలో మరో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జేడీఏ ఇన్‌చార్జిగా కొనసాగారు. ఆయన్ను పక్కకు నెట్టి మరో ఏడీని జేడీఏగా నియమించారు. ఈ మార్పుల వెనుక ఆంతర్యమేంటనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
     
    వామ్మో ఆదిలాబాద్‌...
    వ్యవసాయ శాఖలో ఇటీవల రాష్ట్ర స్థాయిలో పదోన్నతుల ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అసిస్టెంట్‌ డైరెక్టర్లను జాయింట్‌ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పించింది. ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న ఆదిలాబాద్‌ జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌గా హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఓ అధికారిని నియమిస్తే.. ఆమె ఇక్కడికి వచ్చేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. జిల్లాలో వ్యవసాయ శాఖలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులను దష్టిలో ఉంచుకుని ఆమె జేడీఏ పోస్టును కూడా వద్దనుకున్నట్లు ఆ శాఖలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న సంక్షేమ, అభివద్ధి పథకాల అమలు తీరు, కార్యాలయంలో గందరగోళ పరిస్థితులను దష్టిలో పెట్టుకుని సదరు అధికారి ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపనట్లు సమచారం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement