కార్మిక ప్రయోజనాలు విస్మరిస్తే కేసీఆర్ ఊరుకోరు
-
వారసత్వ, డిస్మిస్ కార్మికుల ఫైల్ ముఖ్యమంత్రి వద్ద ఉంది
-
ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు
మందమర్రి : సింగరేణి కార్మికుల ప్రయోజనాలే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కషి చేస్తున్నారని, కార్మికుల సమస్యలను విస్మరిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఊరుకోరని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు ఉద్ఘాటించారు. స్థానిక సీఈఆర్ క్లబ్‌లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన టీబీజీకేఎస్ ఏరియా కార్యకర్తల విస్తత స్థాయి సమావేశంలో యూనియన్ నాయకులు, కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత సింగరేణిలో జాతీయ సంఘాల ద్వంద నీతిని అర్థం చేసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ మన తెలంగాణ, మన సింగరేణిలో మన కార్మికుల కోసం మన కార్మిక సంఘం ఏర్పాటు చేయాలని తలచి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏర్పటుకు నాందీ పలికారని ఆయన గుర్తు చేశారు. మన కార్మికుల కోసం ఏర్పడిన టీబీజీకేఎస్ కార్మికుల హక్కులను సాధించడంలో సఫలీకతం అయిందని అన్నారు.
మొదటి నుంచి సింగరేణి కార్మికులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడంలో ఎప్పటికప్పుడు కషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్మికుల హక్కులను కాపాడేందుకే టీబీజీకేఎస్ ఆవిర్భవించిందని, జాతీయ సంఘాలు మాత్రం కార్మికుల హక్కులను కాలరాసి సింగరేణి మనుగడను ప్రశ్నర్థాకంగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. సకల జనుల సమ్మె వేతనాలు చెల్లించడంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా అందిరికీ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ప్రభుత్వం మన చేతుల్లో ఉందని గతంలో సంఘం ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసే విధంగా కోల్‌బెల్ట్ ప్రజా ప్రతినిధులతో పాటు యూనియన్ నాయకులు కషి చేస్తారని భరోసా ఇచ్చారు. త్వరలోనే వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణతో పాటు వీఆర్‌ఎస్, డిపెండెంట్ల సమస్య, డిస్మిస్ కార్మికులకు ఒక అవకాశం కల్పించేందుకు అందుకు సంబంధించిన ఫైల్‌ను పరిశీలిస్తున్నారని తెలియజేశారు. ఎమ్మెల్సీ పురాణం సతీష్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ తమ యూనియన్ పోరాట ఫలితంగానే లాభాల వాటా పెరిగిందన్నారు. కార్మికుల ప్రధాన డిమాండ్ అయిన వారసత్వ ఉద్యోగ హక్కును సాధించి తీరుతామని అన్నారు. అదే విధంగా ఎంతో కాలంగా ఉద్యోగాల సాధన కోసం దీక్షలు చేస్తున్న డిస్మిస్ కార్మికులకు తిరిగి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి కషి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి. వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య మాట్లాడారు. కార్యక్రమంలో కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, అకునూరి కనకరాజు, నాయకులు మేడిపల్లి సంపత్, జె. రవీందర్, ఎస్ ప్రభాకర్, ఓ రాజశేఖర్, వడ్డేపల్లి ఓదయ్య, కె. లక్ష్మణ్, బాబురావు, అన్ని గనులు, విభాగాల ఫిట్ కార్యదర్శులు పాల్గొన్నారు.