కాంట్రాక్ట్ అధ్యాపకులపై వేటు
కాంట్రాక్ట్ అధ్యాపకులపై వేటు
Published Thu, Dec 29 2016 10:17 PM | Last Updated on Sat, Sep 15 2018 2:28 PM
కాంట్రాక్ట్ అధ్యాపకులకు షోకాజ్ నోటీసులు
ఉద్యోగాలు పీకేస్తామని ప్రభుత్వం హెచ్చరికలు
చంద్రబాబు ఎన్నికల హామీకి గ్రహణం
వెనక్కు తగ్గబోమని జేఏసీ నేతల స్పష్టం
తణుకు : కాంట్రాక్ట్ అధ్యాపకులపై ప్రభుత్వం కత్తి కట్టిందా..? చెప్పిన మాట వినడంలేదంటూ బ్లాక్ మెయిల్‌కు దిగుతోందా..? మూడ్రోజులు గడువు పెట్టి హెచ్చరిక నోటీసులు జారీ చేయడాన్ని చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. తమ సమస్యలు పరిష్కరించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని 27 రోజులుగా సమ్మెబాట పట్టిన ఉద్యోగులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. కొందరు అధ్యాపకులు భయపడి విధుల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నా చాలామంది మాత్రం తాడోపేడో తేలేవరకు సమ్మెను వీడమని నిరవధిక దీక్ష చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ విజయవాడలో చేపట్టిన ఆమరణదీక్షకు మద్దతుగా జిల్లా కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జి.శ్యాంకుమార్, పల్లి సుబ్బారావు ఏలూరులో 48 గంటల పాటు నిరవధిక దీక్ష చేపట్టారు.
పట్టించుకోని ప్రభుత్వం
ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ సమస్యలు పరిష్కరించాలని ఏళ్ల తరబడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఈ క్రమంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు విధులను బహిష్కరించి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. జిల్లావ్యాప్తంగా 32 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 264 మంది పనిచేస్తుండగా డిగ్రీ కళాశాలల్లో 60 మంది, పాలిటెక్నిక్ కళాశాలల్లో 15 మంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వీరంతా 27 రోజులుగా సమ్మెలో కొనసాగుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో బుధవారం నుంచి వారు ఆమరణ దీక్షను చేపట్టారు.
ఎన్నికల ముందు క్రమబద్ధీకరణకు హామీ
ఎన్నికలకు ముందు టీడీపీ కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరణ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో వారు చంద్రబాబు హామీని నమ్మి టీడీపీకి ఓటేసి గెలిపించారు. తమకు వేతనం పెరుగుతుందని, ఉద్యోగానికి భద్రత ఏర్పడుతుందని అధ్యాపకులు భావించారు. అధికారం చేపట్టిన మూడేళ్లు కావస్తున్నా ఇంతవరకు చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆందోళన బాట పట్టారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం 16వ నంబర్ జీవో ఇచ్చి కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేసింది. దీంతో మన రాష్ట్రంలోని అధ్యాపకులు సమ్మె బాట పట్టి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. జూనియర్ లెక్చరర్ల కాంట్రాక్ట్ ఈ నెల 31తో ముగియనుంది. ఇదిలా ఉంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లెక్చరర్ల నియామకానికి ప్రభుత్వం గురువారం జీవో జారీ చేయడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
ప్రభుత్వ వైఖరిపై విమర్శల వెల్లువ
అధ్యాపకులు ఉద్యమ బాట పట్టడంతో కళాశాలల్లో విద్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యాబోధన చివరి దశలో ఉన్న తరుణంలో అధ్యాపకులు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికీ సగం సిలబస్ కూడా పూర్తి కాలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభమయ్యే ప్రాక్టికల్స్ ఎలా నెగ్గుకురావాలో తెలియక ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు ఆందోళన చెందుతున్నారు. మార్చి ఒకటి నుంచి పరీక్షలు మొదలు కానుండటంతో ఎలా ప్రిపేర్ కావాలోనని విద్యార్థులు సతమతమవుతున్నారు. అధికారం కోసం ఎడాపెడా హామీలిచ్చి తర్వాత చేతులెత్తేసి ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారని వారు విమర్శిస్తున్నారు.
నోటీసులకు భయపడం
నోటీసులకు భయపడే ప్రసక్తి లేదు. పేద విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పాఠాలు బోధిస్తాం. ఇప్పటివరకు కాంట్రాక్ట్ అధ్యాపకుల బోధనతోనే ఉత్తమ ఫలితాలు సాధించారు. వచ్చే ఏడాది కూడా ఉత్తమ ఫలితాలు సాధిస్తాం.
జి.శ్యాంబాబు, కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల జేఏసీ జిల్లా నాయకులు
హామీని నెరవేర్చమంటున్నాం
కాంట్రాక్ట్ అధ్యాపకుల పట్ల ప్రభుత్వ వైఖరి సరికాదు. ప్రభుత్వ కళాశాలల్లో అత్యధికశాతం ఉత్తీర్ణత కాంట్రాక్ట్ అధ్యాపకుల వల్లే జరుగుతోంది. ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చిన హామీని నెరవేర్చమని అడుగుతున్నాం. వెనక్కు తగ్గేది లేదు.
జి.జాషువా, సివిక్స్ అధ్యాపకుడు, తణుకు
Advertisement
Advertisement