సుధారాణిని పట్టుకున్న స్థానికులు
పోలీసు అయి ఉండి కూడా.. ఓ విద్యార్థినిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడో ప్రబుద్ధుడు. ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కాలేజిలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న జగన్మోహనరావు ఈ దారుణానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన ఓ విద్యార్థిని తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకోవాలన్న ఆలోచనతో.. ఆమెను కిడ్నాప్ చేయించడానికి ప్రయత్నం చేశాడు. ఒంగోలు లాయర్‌పేటకు చెందిన బ్యూటీపార్లర్ నిర్వాహకురాలు ఈదుపల్లి సుధారాణి సాయంతో ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లాలని చూశాడు. అయితే.. అమ్మాయి గట్టిగా కేకలు వేస్తూ స్కూల్లోకి పరిగెత్తింది. దాంతో జగన్మోహనరావు, సుధారాణి అక్కడినుంచి పరారయ్యారు. స్థానికుల సాయంతో చుట్టుపక్కల గాలించగా సుధారాణి వారి చేతికి చిక్కింది. ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వాళ్లు ఆమెను విచారించడంతో అసలు విషయం బయటపడింది.
గత సంవత్సరం కూడా ఇలాంటి ఉద్దేశంతోనే అతడు అమ్మాయిని కిడ్నాప్ చేయించేందుకు ప్రయత్నించాడని తెలిసింది. అప్పట్లో ఇరువైపులకు చెందిన పెద్దలు ఒప్పందం కుదుర్చుకోవడంతో అతడు ఊరుకున్నాడు. మళ్లీ ఆమె తల్లిపై కన్నేసి.. అమ్మాయిని కిడ్నాప్ చేయించడానికి ప్రయత్నించాడు.