ముగిసిన ఎస్‌ఐ రాత పరీక్ష
ముగిసిన ఎస్‌ఐ రాత పరీక్ష
Published Sun, Feb 19 2017 9:50 PM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM
– రెండో రోజు 341 మంది గైర్హాజరు
కర్నూలు: ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ, డిప్యూటీ జైలర్ నియామకాలకు సంబంధించిన తుది రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ పర్యవేక్షణలో జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయం తరఫున జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సంబంధించి 7612 మంది అభ్యర్థులకు గాను, 7271 మంది ఆదివారం రోజు పరీక్షకు హాజరయ్యారు. 341 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఇందుకోసం కర్నూలులో మొత్తం 14 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతించారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసి, అభ్యర్థులను హాలులోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల్లో బయో మెట్రిక్ ద్వారా అభ్యర్థుల వేలి ముద్రలు తీసుకొని ధ్రువీకరించుకున్నారు.
అనంతరం ఫోటోలు తీసుకొని అభ్యర్థులకు ప్రశ్నపత్రాలను అందజేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్–1 మ్యాథ్స్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.0 గంటల వరకు పేపర్–2 జనరల్ పరీక్షలు నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఎస్‌ఐ ఫైనల్ పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్షల నిర్వహణలో అదనపు ఎస్పీలు శివరామ్‌ప్రసాద్, ఐ.వెంకటేష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్‌తో పాటు 14 మంది సీఐలు, 20 మంది ఎస్‌ఐలు, 150 మంది కానిస్టేబుళ్లు పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు విధులు నిర్వహించారు. అన్ని పరీక్ష కేంద్రాలను డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకె రవికృష్ణ పరిశీలించారు.
Advertisement