writen exam
-
స్టేడియంలో కానిస్టేబుల్ రాతపరీక్ష.. నిరుద్యోగానికి నిదర్శనం!
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో నిరుద్యోగ సమస్యకు నిదర్శనమీ చిత్రం. 1,667 పోలీసు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం రాజధాని ఇస్లామాబాద్‌లోని ఓ స్టేడియంలో రాత పరీక్ష జరిగింది. ఏకంగా 32,000 మంది అభ్యర్థులు తరలివచ్చారు. అప్పుల కారణంగా ఖర్చును భరించే పరిస్థితి లేక అధికారులు అందరినీ ఒకేచోటుకి పిలిపించి పరీక్ష నిర్వహించారు. పాకిస్తాన్ యువతలో 31 శాతం మంది నిరుద్యోగులే ఉన్నారు. ఇస్లామాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 30వేల మంది పురుష, మహిళ అభ్యర్థులు స్టేడియంలో నేలపైనే కూర్చుని పరీక్ష రాశారు. గత ఐదేళ్లుగా సుమారు 1,667 పోస్టులు ఖాళీగా ఉండగా.. ఇటీవలే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. పోలీసు నియామక పరీక్షలకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో దేశంలోని నిరుద్యోగ పరిస్థితిపై చర్చ మొదలైంది. దేశంలో నిరుద్యోగ సమస్య గరిష్ఠస్థాయికి చేరుకుంది. పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవెలప్మెంట్ ఎకనామిక్స్(పీఐడీఈ) ప్రకారం దేశంలో 31 శాతం మంది యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అందులో 51 శఆతం మంది మహిళలు, 16 శాతం మంది పురుషులు ప్రొఫెషనల్ డిగ్రీలు చేసి ఖాళీగా ఉన్నారు. పాకిస్థాన్ జనాభాలో 60 శాతం మంది 30 ఏళ్లలోపు వారే ఉండగా.. నిరుద్యోగ రేటు 6.9 శాతంగా ఉంది. ఇదీ చదవండి: ప్రమాదకరంగా పైపైకి -
సచివాలయ ఉద్యోగ రాతపరీక్షల ప్రాథమిక కీ విడుదల
సాక్షి, అమరావతి: కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ ఓ భారీ ఉద్యోగ నియామక ప్రక్రియలో కీలక దశను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. సచివాలయ ఉద్యోగ రాతపరీక్షల ప్రాథమిక ‘కీ’ని అధికారులు శనివారం రాత్రి విడుదల చేశారు. మొత్తం 14 రకాల రాతపరీక్షలకు సంబంధించిన కీ వివరాలను గ్రామ సచివాలయం వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ప్రతి ఒక్క పరీక్షకు నాలుగు రకాల టెస్ట్ బుక్లెట్ సిరీస్ కోడ్ వారీగా కీలను విడుదల చేశారు. వీటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. అభ్యర్ధులు ఈనెల 29వ తేదీ వరకు వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యంతరాలను నిపుణులు పరిశీలించి, తుది కీ ని సాధ్యమైనంత త్వరగా విడుదల చేస్తామని తెలిపారు. ప్రశ్నపత్రం, కీ సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్‌లో చూడవచ్చు. ► మొత్తం 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఈ నెల 20వ తేదీ మొదలైన రాతపరీక్షలు శనివారం సాయంత్రం ముగిశాయి. ఈ పరీక్షలకు 72.73 మంది అభ్యర్ధులు హాజరైనట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ► రాత పరీక్షల కోసం 10,57,355 మంది అభ్యర్థులకు హాల్ టిక్కెట్లు జారీ చేయగా.. వీరిలో 9,51,016 మంది వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు. అందులో 7,69,034 మంది పరీక్షలు రాశారు. ► ఇదిలా ఉండగా, సచివాలయ ఉద్యోగాల కోసం ఇన్ సర్వీస్ అభ్యర్ధులుగా దరఖాస్తు చేసుకున్న వారు వెయిటేజ్ మార్కులు పొందాలంటే గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల వెబ్సైట్ నుంచి ధ్రువపత్రాన్ని తీసుకుని, వారి వారి శాఖాధిపతులతో దానిపై ధ్రువీకరణ చేయించుకొని.. ఆ పత్రాలను తిరిగి వెబ్సైట్లో ఈ నెల 30వ తేదీలోగా అప్ లోడ్ చేయాలని అధికారులు సూచించారు. -
చదవడం.. రాయడం!
నల్లగొండ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో సామర్థ్యం పెంపునకు విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో నెల రోజులపాటు విద్యార్థులకు చదవడం, రాయడం నేర్పించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఆ తర్వాతే ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి తరగతులు చేపట్టాలని నిర్ణయించారు. తద్వారా విద్యార్థుల్లో సామర్థ్యం పెరిగి విద్యాభివృద్ధిలో ముందుకు సాగుతారని విద్యాశాఖ అధికారుల ఉద్దేశం. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 1,483 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థులకు చదవడం, రాయడం సక్రమంగా రావడం లేదనేది విద్యాశాఖ ఉన్నతాధికారుల పరిశీలనలో వెల్లడైంది. గత సంవత్సరం ఎస్ఈఆర్టీ అధికారులు జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పర్యటించి 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల సామర్థ్యాలపై పరీక్షలు నిర్వహించారు. 1 నుంచి 5వ తరగతి పిల్లలకు చదవడం, రాయడం సక్రమంగా రావడం లేదు. 6 నుంచి10వ తరగతి విద్యార్థులకు కొందరికి చదవడం, రాయడం రాకపోగా మరికొంతమందికి సైన్స్‌లో సామర్థ్యం లేదని గుర్తించారు. ఇంకొందరికి గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయని వెల్లడైంది. చాలామందికి ఆయా సబ్జెక్టుల్లో సున్నా మార్కులు వచ్చాయి. ఎస్ఈఆర్టీవారు రాష్ట్ర వ్యాప్తంగా సామర్థ్యాలపై పరీక్షలు నిర్వహించగా అందులో నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే వెనుకబడినట్లు తేలింది. దీంతో ఆ నివేదికలు జిల్లాకు పంపించారు. సామర్థ్యం పెంపునకు డీఈఓ ప్రత్యేక కార్యక్రమం నివేదికలను పరిశీలించిన డీఈఓ సరోజినీ దేవి ఆయా విద్యార్థుల్లో సామర్థ్యం పెంపు కోసం నెల రోజులపాటు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాఠశాల ప్రారంభం అయిన నాటినుంచి బడిబాట మినహా రోజూ ప్రతి తరగతిలోని విద్యార్థులకు ప్రత్యేకంగా చదవడం, రాయడం కార్యక్రమాలే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల తర్వాత పీఈటీలు లేని పాఠశాలల్లో రోజూ ఆ పీరియడ్‌లో చదవడం, రాయడం కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలని నిర్ణయించారు. అదే విధంగా మిగతా పాఠశాలల్లో కూడా ఒక పిరియడ్‌ను తప్పనిసరి చదివించడం, రాయించే కార్యక్రమం చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. సామర్థ్యాల పెంపు తప్పనిసరి చదవడం, రాయడం కార్యక్రమం వల్ల విద్యార్థుల్లో సామర్థ్యం పెంపొందేందుకు అవకాశం ఉంటుంది. ఈనెల ఈ చదవడం, రాయడం చేపట్టి ఆతర్వాత కూడా ఓ పిరియడ్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. రోజూ పాఠ్యాంశాలను చదివించడం వల్ల విద్యార్థుల్లో భయాలు తొలగి ధైరంగా చదువుకునే అవకాశం ఉంది. పది సార్లు చదివినా ఒకసారి రాసినా ఒకటే. రాయడం వల్ల పాఠ్యాంశం మనస్సులో ఉండిపోయే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. – డీఈఓ సరోజినీదేవి, నల్లగొండ -
నేను ఇచ్చిన జాబితానే ఫైనల్
సాక్షి ప్రతినిధి, కడప : జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు బరితెగించారు. తమ కార్యకర్తలకే ప్రభుత్వ ఫలాలు దక్కాలంటూ మొండికేస్తున్నారు. తాము చెప్పింది కచ్చితంగా చేసి తీరాల్సిందేనంటూ జిల్లా ఉన్నతాధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. రేషన్ డీలర్ల భర్తీ విషయంలో ఏకంగా తాము రూపొందించిన ఓ జాబితాను ఖరారు చేయాలంటూ సోమవారం మంత్రి సోమిరెడ్డి కడప రెవెన్యూ డివిజన్‌కు చెందిన ఓ అధికారిని ఆదేశించడం చర్చనీయాంశమైంది. మంత్రి ఆదేశించినట్లుగానే ఆ జాబితా ఖరారైతే మాత్రం ఎన్నో ఏళ్లుగా ఉపాధి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అన్యాయం జగినట్లే అవుతుంది. ఇంటర్వ్యూలకూ హాజరు.. కడప రెవెన్యు డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న 275 రేషన్ దుకాణాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు సంబంధించి 49 రేషన్ షాపులకు దరఖాస్తులు రాలేదు. మిగిలిన వాటికి 864మంది దరఖాస్తు చేయగా, ఈ నెల 10న నిర్వహించిన రాతపరీక్షలకు 725 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సోమవారం ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. వీరిలో అర్హత సాధించిన వారికి షాపులు కేటాయించాల్సి ఉంది. ఇక్కడ టీడీపీ నేతలు చక్రంతిప్పారు. రాత్రికిరాత్రే కొత్త జాబితా.. కడప రెవెన్యూ డివిజన్లో భర్తీకానున్న రేషన్‌షాపులు తమ కార్యకర్తలకే దక్కాలని నిర్ణయించిన టీడీపీ నేత ఒకరు రాత్రికి రాత్రే కొత్త జాబితాను సిద్ధం చేశారు. కేవలం రాతపరీక్షలకు హాజరవ్వడమే ప్రధాన అర్హతగా చూపించి, టీడీపీ కార్యకర్తలకు ఆయా రేషన్‌షాపులను కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసి.. సోమవారం హడావుడిగా కొత్త జాబితాను మంత్రి సోమిరెడ్డి వద్దకు తీసుకెళ్లి.. ఆ జాబితానే ఖరారు చేయించాల్సిందిగా కోరారు. ఇదే ఫైనల్..: రేషన్ డీలర్ల రాతపరీక్షల ఫలితాలు పక్కన పెట్టండి. నేను ఇచ్చిన లిస్టే(జాబితా) ఫైనల్ చేయండి.. అంటూ మంత్రి సోమిరెడ్డి సాయంత్రం జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారిని ఆదేశించారు. జిల్లా రాతపరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు సైతం నిర్వహించామని, ఈ సమయంలో జాబితాను మారిస్తే నాకు ఇబ్బందులు వస్తాయని మంత్రి వద్ద మొరపెట్టుకున్నారు. మీ జాబితాను కలెక్టర్ ద్వారా ఆమోదముద్ర వేయించాలని కోరినట్లు తెలిసింది. అయితే ఇందుకు ససేమిరా అన్న మంత్రి.. నేను చెప్పింది చేయండి.. ఆ జాబితానే ఖరారు చేయండంటూ హుకుం జారీ చేయడంతో ఏమి చేయాలో తేల్చుకోలేక ఆయన సతమతమవుతున్నట్లు తెలిసింది. -
ముగిసిన ఎస్ఐ రాత పరీక్ష
– రెండో రోజు 341 మంది గైర్హాజరు కర్నూలు: ఎస్ఐ, ఆర్ఎస్ఐ, డిప్యూటీ జైలర్ నియామకాలకు సంబంధించిన తుది రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ పర్యవేక్షణలో జేఎన్టీయూ విశ్వవిద్యాలయం తరఫున జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సంబంధించి 7612 మంది అభ్యర్థులకు గాను, 7271 మంది ఆదివారం రోజు పరీక్షకు హాజరయ్యారు. 341 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఇందుకోసం కర్నూలులో మొత్తం 14 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతించారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసి, అభ్యర్థులను హాలులోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల్లో బయో మెట్రిక్ ద్వారా అభ్యర్థుల వేలి ముద్రలు తీసుకొని ధ్రువీకరించుకున్నారు. అనంతరం ఫోటోలు తీసుకొని అభ్యర్థులకు ప్రశ్నపత్రాలను అందజేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్–1 మ్యాథ్స్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.0 గంటల వరకు పేపర్–2 జనరల్ పరీక్షలు నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఎస్ఐ ఫైనల్ పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్షల నిర్వహణలో అదనపు ఎస్పీలు శివరామ్‌ప్రసాద్, ఐ.వెంకటేష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్‌తో పాటు 14 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, 150 మంది కానిస్టేబుళ్లు పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు విధులు నిర్వహించారు. అన్ని పరీక్ష కేంద్రాలను డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకె రవికృష్ణ పరిశీలించారు. -
నేడు పోలీసు కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష
– ఉదయం పది నుంచి ఒంటి గంట వరకు నిర్వహణ – 27 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 16,796 మంది అభ్యర్థులు – మాల్ ప్రాక్టీస్ నివారణ కోసం బయోమెట్రిక్ స్కానింగ్ విధానం – భర్తీకానున్న 622 పోస్టులు – ఏర్పాట్లను పూర్తి చేసిన పోలీసు శాఖ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పోలీసు కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల అభ్యర్థులకు కర్నూలులో 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం మూడు జిల్లాలకు సంబంధించి మెయిన్స్‌కు మొత్తం 16,796 మంది పరీక్షకు అర్హత సాధించారు. సివిల్, ఏఆర్ కానిస్టేబుల్స్, జైల్ వార్డెన్ల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొదట స్క్రీనింగ్ టెస్టును నిర్వహించింది. డిసెంబర్ 8 నుంచి 20వ తేదీ వరకు దేహదారుఢ్య పరీక్షలను నిర్వహించారు. అందులో అర్హత సాధించిన వారిని మెయిన్స్‌కు ఎంపిక చేశారు. మెయిన్స్ పరీక్షను ఆదివారం ఉదయం పది నుంచి ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌ను అరికట్టేందుకు పోలీసుశాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంది. అందులో భాగంగా బయోమెట్రిక్ స్కానింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు 27 కేంద్రాల్లో 94 మంది బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లను నియమించారు. వారికి వ్యాస్ ఆడిటోరియంలో ఇటీవల శిక్షణ కూడా ఇచ్చారు. ఈ విధానంలో అభ్యర్థుల నుంచి వేలిముద్రలు స్వీకరిస్తారు. అలాగే పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఉండే జిరాక్స్, నెట్ సెంటర్లను మూసి వేయించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. మూడు జిల్లాల్లో భర్తీకానున్న 622 పోస్టులు కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలో పోలీసు కానిస్టేబుల్ మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలులోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 16,796 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఇందులో కర్నూలు జిల్లాకు చెందిన అభ్యర్థులు7.969, కడప -5,196, అనంతపురం అభ్యర్థులు 3,631మంది ఉన్నారు. కర్నూలులో 221 పోస్టులు, కడపలో 123, అనంతపురంలో 278 పోస్టులు భర్తీకానున్నాయి. మూడు జిల్లాలో కలిపి మొత్తం 622 పోస్టులు ఉన్నాయి. నిమిషం ఆలస్యమైనా అనుమతించం: ఆకె రవికృష్ణ, కర్నూలు జిల్లా ఎస్పీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశాం. గంట ముందు నుంచే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తాం. నిమిషం ఆలస్యమైన అనుమతించం. అభ్యర్థులు హాల్ టిక్కెట్, ఆధార్ కార్డు లేదంటే ఇతర గుర్తింపు కార్డును కచ్చితంగా తీసుకురావాలి. పరీక్షలో సమాధానాలను బ్లాక్ లేదా బ్లూ పెన్నుతో మాత్రమే రాయాల్సి ఉంది. క్యాలిక్యులేటర్లు, వాచ్‌లను పరీక్ష కేంద్రంలోకి అనుమతించం. పరీక్షల నిర్వహణకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాం. -
ప్రశాంతంగా ఎస్ఐ అభ్యర్థుల రాత పరీక్ష
– దరఖాస్తుదారులు 15,569 – హాజరైన అభ్యర్థులు 14,272 కర్నూలు: పోలీసు శాఖలో ఎస్ఐ ఎంపికకు నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, సాయంత్రం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. ఎస్ఐ పోస్టుల భర్తీకి గత నెల ప్రభుత్వం అనుమతించడంతో 15,569 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 14,272 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 1,297 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ కోసం కర్నూలులో 26 సెంటర్లు ఏర్పాటు చేశారు. బయో మెట్రిక్ హాజరుతో అనుమతి: కాకినాడ జేఎన్టీయూ కళాశాల ఆధ్వర్యంలో ఎస్ఐ అభ్యర్థులకు ప్రిలిమినరీ రాత పరీక్ష జరిగింది. కర్నూలు నగరంలోని 26 కాలేజీలు, స్కూళ్ల యాజమాన్యాల సహకారంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు నిర్వహించారు. బయోమెట్రిక్ సేకరణ ద్వారా (వేలి ముద్రలు) అభ్యర్థులను పరీక్షలకు అనుమతించారు. పోలీసు శాఖ నుంచి కొంతమంది సిబ్బంది (ఫింగర్ ప్రింట్స్) బృందం నియమించి బయో మెట్రిక్ సేకరణకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలలోపు పరీక్ష కేంద్రానికి చేరుకున్న అభ్యర్థులను బయో మెట్రిక్ హాజరుతో అనుమతించి, 10 గంటలకు పరీక్షను ప్రారంభించారు. ఆధార్ లేదా, ఇతర గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ కొంతమంది మరిచిపోయి వచ్చారు. చివరి నిమిషంలో అలాంటి వారిని కూడా పరీక్షకు అనుమతించారు. డీఐజీ రమణకుమార్ ఆదేశాల మేరకు ఎస్పీ ఆకే రవికృష్ణ ఉదయం 10 గంటలకు పుల్లయ్య కళాశాల, కేవీ సుబ్బారెడ్డి కళాశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష హాలులోకి సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రానిక్ వాచ్‌లను అనుమతించరాదని ఇన్విజిలేటర్లకు దిశానిర్దేశం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సీఐలకు ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. పరీక్ష బాగా రాసి పట్టుదలతో ఉద్యోగం సంపాదించాలని అభ్యర్థులకు ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్ష కేంద్రాల యాజమాన్యాలతో మాట్లాడి అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కర్నూలు డీఎస్పీ డీవీ రమణమూర్తితో పాటు పలువురు సీఐలు ఎస్పీ వెంట ఉన్నారు. -
పోలీస్ రాత పరీక్షకు 551 మంది ఎంపిక
కర్నూలు: కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల భర్తీకి స్క్రీనింగ్ టెస్టు కొనసాగుతోంది. స్థానిక ఏపీఎస్పీ మైదానంలో 8వ రోజు మంగళవారం అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించారు. 800 మందిని ఆహ్వానించగా 713 మంది హాజరయ్యారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్టులో పాల్గొన్నారు. కడప ఎస్పీ రామకృష్ణ పర్యవేక్షణలో స్క్రీనింగ్ టెస్టు నిర్వహించారు. ముందుగా హాల్‌టిక్కెట్, సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం బరువు, ఎత్తు, ఛాతి కొలతలలో అర్హత సాధించినవారికి 1600 మీటర్ల పరుగుపందెం నిర్వహించారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున ఎంపిక చేసి పరుగు పందెం నిర్వహించగా 551 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. 168 మంది అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాకపోవడంతో క్రీడామైదానంలోకి అనుమతించకుండా వెనక్కి పంపారు. తహసీల్దార్లు జారీ చేసిన క్రీమీలేయర్, ఓబీసీ సర్టిఫికెట్లు, ఇతర అర్హత కల్గిన ఒరిజినల్స్‌తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావాలని ఎస్పీ రామకృష్ణ సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఎ.జి.కృష్ణమూర్తి, బాబుప్రసాద్, వెంకటాద్రి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన లైజనింగ్ డీఎస్పీ కె.షరీఫ్, ఈ–కాప్స్, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు. -
రాత పరీక్షకు 284 మంది ఎంపిక
కొనసాగుతున్న స్క్రీనింగ్ టెస్ట్ కర్నూలు: కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల భర్తీకి సోమవారం నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టులో 284 మంది మహిళా అభ్యర్థులు రాత పరీక్షకు అర్హత సాధించారు. స్థానిక ఏపీఎస్పీ మైదానంలో ఏడో రోజు మహిళా అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 800 మందిని ఆహ్వానించగా 565 మంది మహిళలు హాజరయ్యారు. కడప ఎస్పీ రామకృష్ణ పర్యవేక్షణలో స్క్రీనింగ్ టెస్టు నిర్వహించారు. ముందుగా హాల్‌టిక్కెట్, సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం బరువు, ఎత్తు కొలతలలో అర్హత సాధించినవారికి 1600 మీటర్ల పరుగుపందెం నిర్వహించారు. ఆధునిక పద్ధతిలోని కంప్యూటరీకరణ యంత్రాల ద్వారా పరీక్షలను నిర్వహించారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున ఎంపిక చేసి పరుగు పందెం నిర్వహించగా 284 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాకపోవడంతో 192 మంది మహిళా అభ్యర్థులు క్రీడామైదానంలోకి అనుమతించకుండా వెనక్కి పంపారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఎ.జి.కృష్ణమూర్తి, బాబుప్రసాద్, వెంకటాద్రి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన లైజనింగ్ డీఎస్పీ కె.షరీఫ్, ఈ–కాప్స్, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు కానిస్టేబుళ్ల ప్రిలిమినరీ పరీక్ష
– పకడ్బందీగా ఏర్పాట్లు కర్నూలు: కానిస్టేబుళ్ల ఎంపికకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. జిల్లా పోలీసు శాఖలో 221 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. ఇందుకోసం 40,024 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒకే రోజు 40,024 మంది హాజరు కానున్నందున పోలీసు అధికారులు నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. కర్నూలులో 35 సెంటర్లలో 22,630 మంది, నంద్యాలలో 32 సెంటర్లలో 17,334 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. మొత్తం 67 సెంటర్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బయోమెట్రిక్ హాజరుతో పరీక్షకు అనుమతించనున్నారు. ఉదయం 9గంటలకల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. ఏపీపీఎస్సీ, ఏఈ పోస్టులకు రాత పరీక్ష ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆదివారం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పోస్టుల నియామకానికి రాత పరీక్షలను నిర్వహించేందుకు సంబంధిత అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సివిల్, మెకానికల్ అభ్యర్థులు 4,251 మంది పరీక్షకు హాజరవుతున్నారు. కర్నూలులో 8 కేంద్రాలు, ఆదోనిలో ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.