రాత పరీక్షకు 284 మంది ఎంపిక
రాత పరీక్షకు 284 మంది ఎంపిక
Published Mon, Nov 14 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM
కొనసాగుతున్న స్క్రీనింగ్ టెస్ట్
కర్నూలు: కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల భర్తీకి సోమవారం నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టులో 284 మంది మహిళా అభ్యర్థులు రాత పరీక్షకు అర్హత సాధించారు. స్థానిక ఏపీఎస్పీ మైదానంలో ఏడో రోజు మహిళా అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 800 మందిని ఆహ్వానించగా 565 మంది మహిళలు హాజరయ్యారు. కడప ఎస్పీ రామకృష్ణ పర్యవేక్షణలో స్క్రీనింగ్ టెస్టు నిర్వహించారు. ముందుగా హాల్‌టిక్కెట్, సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం బరువు, ఎత్తు కొలతలలో అర్హత సాధించినవారికి 1600 మీటర్ల పరుగుపందెం నిర్వహించారు. ఆధునిక పద్ధతిలోని కంప్యూటరీకరణ యంత్రాల ద్వారా పరీక్షలను నిర్వహించారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున ఎంపిక చేసి పరుగు పందెం నిర్వహించగా 284 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాకపోవడంతో 192 మంది మహిళా అభ్యర్థులు క్రీడామైదానంలోకి అనుమతించకుండా వెనక్కి పంపారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఎ.జి.కృష్ణమూర్తి, బాబుప్రసాద్, వెంకటాద్రి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నుంచి వచ్చిన లైజనింగ్ డీఎస్పీ కె.షరీఫ్, ఈ–కాప్స్, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement