50 రోజులవుతోంది.. ఏం జరిగిందో చెప్పండి
కాకినాడ: అగస్టా స్కామ్‌లో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ పేరును ఇటలీ కోర్టు ఎందుకు ప్రస్తావించిందో రాహుల్ గాంధీ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి సిద్ధార్థ్ నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశం ఏదో అయిపోతోందని రాహుల్ ప్రస్తావించారని, పెద్ద నోట్లను రద్దు చేసి 50 రోజులు కావస్తున్నా ఎక్కడ ఏం జరిగిందో ఆయన చెప్పాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన సిద్ధార్థ్ నాథ్ సింగ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడారు.
ఏపీలో బీజేపీని బలోపేతం చేయడం కోసం 45 వేల బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించి 17 మంది బూత్ క్యాంపెయిన్ ఇంచార్జ్‌లను నియమించామని తెలిపారు. వచ్చే ఫిబ్రవరి, మార్చి కల్లా 80 శాతం బూత్ కమిటీలను నియమిస్తామని సిద్ధార్థ్ నాథ్ సింగ్ చెప్పారు.