మెరిసిన సింధూరం
మెరిసిన సింధూరం
Published Thu, Aug 18 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
ఒలింపిక్స్‌లో కొత్త చరిత్ర సృష్టించిన పీవీ
విజయవాడవాసి కూతురి బిడ్డే
విజయవాడ స్పోర్ట్స్:
రియో ఒలింపిక్స్‌లో తెలుగుతేజం ‘సింధూ’రం మెరిసింది. గత లండన్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ సెమీస్‌లో చైనా అమ్మాయి యిహాన్‌వాంగ్ చేతిలో ఓడిపోగా, ఇప్పుడు రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌లో అదే యిహాన్‌వాంగ్‌పై సింధూ విజయం సాధించి సెమీస్‌కు చేరింది. ఆ తరువాత జరిగిన ప్లే ఆఫ్‌లో సైనా చైనా అమ్మాయి జిన్‌వాంగ్ (రిటైర్డ్ హర్ట్)పై గెలిచి కాంస్య పతకం సాధించింది. ఈసారి సింధు 21–19, 21–10 తేడాతో జపాన్‌కు చెందిన ఒకుహారాపై విజయం సాధించి మిసై్సల్‌లా ఫైన ల్‌కు దూసుకెళ్లింది.
సింధు ఆటతీరుకు నవ్యాంధ్ర క్రీడాభిమానులే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగువారంతా పులకించిపోయారు. రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం ఎదురు చూసి మొహం వాచిపోయిన భారత్ క్రీడాభిమానులకు తెలుగుతేజం పీవీ సింధు స్వర్ణపతక పోరు కోసం తిరుగులేని స్థానానికి చేరుకుంది. ఫైనల్‌లో ఒక వేళ. స్వర్ణపతకం చేజారినా... రజత పతకమైనా ఖాయంగా దేశానికి అందించనుంది. భారతీయులు గర్వపడేలా మువ్వన్నెల జెండాను ప్రపంచ క్రీడాపటంలో రెపరెపలాడించి చెరగని ముద్ర వేసింది.
ముందే చెప్పిన ‘సాక్షి’
ప్రత్యర్థి చైనా అయితే చాలు ఆమె రాకెట్ మల్టీ బ్యారల్ రాకెట్ లాంచరై అగ్ని వర్షం కురిపించినట్టుగా శివాలెత్తిపోతుందని గతేడాది జనవరి నెలాఖరులో విజయవాడలో జరిగిన 79వ జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఆడేందుకు విచ్చేసిన సింధు ఆట తీరు గురించి ఆనాడే ‘సాక్షి’ చెప్పింది. రియో ఒలింపిక్స్‌లో అదే జరిగింది.
ఈ సింధూరం ఎవరో కాదు...
అచ్చమైన పదహారణాల తెలుగింటి ముద్దు బిడ్డ పీవీ సింధు పిన్నవయసులోనే భారతదేశ బ్యాడ్మింటన్ స్టార్‌గా దూసుకొచ్చింది. ఈ సింధూరం ఎవరో కాదు...బెజవాడకు ముద్దుల మనువరాలే. ‘కలవారి సంసారం, బందిపోటు వంటి ఆనాటి హిట్ చిత్రాల నిర్మాత జైహింద్ టాకీస్ యజమాని దోనేపూడి బ్రహ్మయ్య కూతురి బిడ్డ. సింధు తల్లిదండ్రులు పీవీ రమణ, విజయ ఇద్దరూ అంతర్జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులు. పైగా ఇద్దరూ అర్జున అవార్డీలే. సింధు కూడా అర్జున అవార్డీనే. సింధు పూర్తిగా బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. ఎనిమిదేళ్ల వయసులో గోపీచంద్ అకాడమీలో చేరింది. రోజూ హైదరాబాద్ గచ్చిబౌలీలోని అకాడమీలో ప్రాక్టీస్ చేస్తుంది. 2012లో సీనియర్ నేషనల్స్‌లో చాంపియన్ అయ్యింది. జూనియర్ ఏషియన్ చాంపియన్‌షిప్ ఆడింది. 2013 హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. 2014లో మరోసారి కాంస్య పతకం దక్కించుకుంది. 19 ఏళ్లకే అర్జున (2014లో), పద్మశ్రీ (2015లో) అందుకుంది.
Advertisement
Advertisement