సామూహిక యోగాకు గుర్తింపు
శ్రీరాంపూర్(ఆదిలాబాద్): యోగాలో సింగరేణికి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు కంపెనీ వ్యాప్తంగా నిర్వహించిన సామూహిక యోగాకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కింది. ఈ మేరకు యూజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. కార్మికుల ఆరోగ్య రక్షణ కోసం సీఎండీ ఎన్.శ్రీధర్ ‘మీ కోసం- మీ ఆరోగ్యం కోసం’ వంటి కార్యక్రమాలకు రూపకల్పన చేసి అమలు చేశారు. యోగా దినోత్సవాన్ని సద్వినియోగం చేసుకొని కార్మికులకు యోగా ప్రాముఖ్యత తెలియజేయడానికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.
కంపెనీ విస్తరించిన ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధి 11 ఏరియూల్లో ఒకేసారి 176 సెంటర్లలో యోగా ప్రదర్శనలు నిర్వహించగా 60,369 మంది పాల్గొన్నారు. బెంగళూరు యోగా వర్సిటీకి చెందిన యోగా నిపుణులతో శిక్షణ ఇప్పించారు. అన్ని ఏరియాల్లో ఆ రోజున లిమ్కా బుక్ ప్రతినిధులు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. చివరికి లిమ్కా బుక్‌లో చోటు దక్కింది. శుక్రవారం ఈ సర్టిఫికెట్‌ను కంపెనీ అధికారులకు అందజేసే అవకాశం ఉంది. ఈ రికార్డు సాధించడంపై యాజమాన్యం, కార్మిక సంఘాలు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణికి లిమ్కా బుక్ రికార్డ్స్‌లో చోటు
Published Fri, Aug 12 2016 3:17 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement