వరంగల్ : వరంగల్ జిల్లా సంగెం మండలం కాపులకనపర్తి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టాటా ఏస్... ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.
మెరుగైన వైద్య చికిత్స కోసం వరంగల్ తరలించాలని సూచించారు. దీంతో వారిని వరంగల్ తరలించారు. అలాగే మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.