వడదెబ్బతో ఆరుగురి మృతి
♦ ఒకే రోజు ఆరుగురు మృత్యువాత
♦ వేర్వేరు చోట్ల ఘటనలు
♦ భానుడు ప్రతాపానికి జనం విలవిల
ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. భానుడి ప్రతాపానికి జనం విలవిల్లాడుతున్నారు. శనివారం గరిష్టంగా 44.3 ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో జిల్లాలో ఒక్క రోజే ఆరుగురు మృత్యువాత పడ్డారు. వడగాడ్పులు వీస్తుండటంతో వృద్ధులు, చిన్నారులు హడలెత్తిపోతున్నారు. ఉదయం 8 గంటలకే ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో జనం బయటికి రావడానికి జంకుతున్నారు. పెద్దగుండవెళ్లిలో వృద్ధుడు..
దుబ్బాక: వడదెబ్బతో 80 ఏళ్ల వృద్ధుడు మరణించిన సంఘటన మండలంలోని పెద్దగుండవెళ్లిలో శనివారం జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వృద్ధాప్యంలో ఉన్న రామయ్య(80) పశువులను చూసుకోవాలనే ఆతృతతో శుక్రవారం మధ్యాహ్నం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. బావి నుంచి ఇంటికి నడుచుకుంటూ వచ్చిన రామయ్య వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద ప్రాథమిక చికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో రామయ్యను 108 వాహనంలో తరలించడానికి ప్రయత్నం చేశారు. 108 వాహన సిబ్బంది వచ్చి పరీక్షించేలోపే రామయ్య మరణించాడు. మృతుడికి ఇద్దరు కుమారులు దుర్గారెడ్డి, నర్సింలు ఉన్నారు. నిరుపేదైన రామయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ చందిరి రత్నమ్మ విజ్ఞప్తి చేశారు.
గోల్కొండవీధిలో వృద్ధుడు..
మెదక్: వడదెబ్బతో వృద్ధుడు మృతి చెందిన సంఘటన మెదక్ పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. పట్టణంలోని గోల్కొండ వీధికి చెందిన అస్త్రగల్ల దేవయ్య(55) కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మూడు రోజుల క్రితం కూలీపని వెళ్లగా వడదెబ్బ తగలడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం మృతి చెందాడు. మృతుడికి భార్య యశోద, నలుగురు సంతానం ఉన్నారు.
శివ్వంపేటలో మహిళ..
శివ్వంపేట: వడదెబ్బతో మహిళ మృతి చెందిన సంఘటన శివ్వంపేటలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.... గ్రామానికి చెందిన దర్జి లక్ష్మీబాయి(60) ఊరెళ్ళి సాయత్రం ఇంటికి వచ్చాక అస్వస్థతకు గురైంది. వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
రామునిపట్లలో మహిళా కూలీ...
చిన్నకోడూరు: వడదెబ్బతో మహిళా కూలీ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రామునిపట్లలో శనివారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆకుల నర్సవ్వ(55) వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. ఈ క్రమంలో వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురైంది. చికిత్స కోసం శనివారం రాత్రి సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, కూతురు ఉంది. గ్రామ సర్పంచ్ వర్కోలు లావణ్య రాజలింగం, ఎంపీటీసీ బొల్లం భాగ్యలక్ష్మిలు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం పరంగా ఆర్థిక సహాయం అందజేయాలని వారు కోరారు.
కొండపాకలో వృద్ధుడు...
కొండపాక: పట్టణానికి చెందిన కడూరి రామయ్య(75) వడదెబ్బతో శుక్రవారం మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రామయ్య శుక్రవారం పని మీద బయటకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకొని నీళ్ల వాంతుల చేసుకొని సొమ్మసిల్లిపడిపోయాడు. తీవ్ర అస్వస్థతకు గురైన రామయ్య రాత్రి మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
దామరకుంటలో మహిళ..
ములుగు: వడదెబ్బతో మహిళ మృతి చెందిన సంఘటన ములుగు మండలం దామరకుంట గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పరిగె బాలమణి(60) ప్రతిరోజు ఉపాధిహామీ కూలీ పనులకు వెళుతుండేది. ఈ క్రమంలో రెండు రోజులుగా వడదెబ్బ తగలడంతో ఆమె అస్వస్థతకు గురైంది. శనివారం సాయంత్రం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్సకోసం ఆసుపత్రికి తరలిస్తుండగా బాలమణి మార్గమధ్యలోనే మృతిచెందింది. మృతురాలికి భర్త లక్ష్మినారాయణ, నలుగురు కూతుళ్లున్నారు.