ఆరు టిఫిన్ బాంబులు లభ్యం
Published Sun, Aug 28 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
చౌటుప్పల్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలంలోని డి.నాగారం గ్రామ శివారులో ఆదివారం పోలీసులకు ఆరు టిఫిన్ బాంబులు లభ్యమయ్యాయి. డి.నాగారం గ్రామం నుంచి అల్లాపురం గ్రామానికి వెళ్లడానికి గతంలో పాత బాట ఉండేది. ఈ ప్రాంతమంతా గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో, బాటలో మావోయిస్టులు ఈ బాంబులను ఏర్పాటు చేసుంటారని పోలీసులు భావిస్తున్నారు. శని, ఆదివారాల్లో కురిసిన వర్షానికి మట్టి కొట్టుకుపోయి ఇవి పైకి కనిపించాయి. ఇవి పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. స్థానిక రైతులు గుర్తించి చౌటుప్పల్ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ నవీన్‌కుమార్ సిబ్బందితో వెళ్లి ఆరు టిఫిన్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 15ఏళ్ల క్రితం ఏర్పాటు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పీపల్‌పహడ్ గ్రామం నుంచి అల్లాపురం గ్రామానికి ప్రత్యేక బాటను ఏర్పాటు చేయడంతో 12ఏళ్లుగా ఈ బాటను ఉపయోగించడం లేదు. ఆరు టిఫిన్ బాంబులను జిల్లా పోలీసు కేంద్రానికి తరలించినట్టు పోలీస్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Advertisement
Advertisement