నాగారం: కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన భర్త.. మృతదేహాన్ని టాటా ఏస్ వాహనంలో స్వగ్రామానికి తీసుకొచ్చాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నాగారం మండల పరిధిలోని పస్తాల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పస్తాల గ్రామానికి చెందిన చిత్తలూరి శ్రీనివాస్, సూరాంబ (35) దంపతులు తమ పిల్లలు శ్రావణి, ప్రశాంత్.
పదేళ్లుగా హైదరాబాద్‌లోని రామాంతాపూర్‌లో నివసిస్తూ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి శ్రీనివాస్ ఇంట్లో ఇద్దరు పిల్లలను పక్క గదిలో నిద్రించమని చెప్పి భార్యతో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో సూరాంబను విచక్షణారహితంగా కొట్టి, ప్లాస్టిక్ తాడుతో ఆమె మెడకు ఉరివేసి హత్య చేశాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కూరగాయలకు వినియోగించే తన టాటా ఏస్ వాహనంలో ఆమె మృతదేహాన్ని వేసుకొని స్వగ్రామం పస్తాలకు బయల్దేరాడు.
మార్గమధ్యలో గురువారం తెల్లవారుజామున పిల్లలకు ఫోన్‌చేసి ‘మీ అమ్మకు బీపీ డౌన్ అయ్యి మృతిచెందింది. పస్తాలకు తీసుకెళ్తున్నా, మీరు కూడా రండి’ అని చెప్పాడు. అనంతరం మృతదేహాన్ని పస్తాలకు తీసుకొచ్చి తన ఇంటిముందు ఉంచాడు. బీపీ డౌన్ అయ్యి మృతిచెందిందని గ్రామస్తులతో చెప్పగా వారు మృతదేహంపై ఉన్న గాయాలను గుర్తించి ఏమైందని నిలదీశారు. దీంతో శ్రీనివాస్ తానే చంపానని అంగీకరించాడు.
అయితే గ్రామస్తులు దాడి చేస్తారనే భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా వారు గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి మొగుళ్ల బక్కయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజేశ్ తెలిపారు.
‘మీ అమ్మకు బీపీ డౌన్ అయ్యింది.. మీరు కూడా రండి’
Published Fri, Oct 1 2021 12:12 PM | Last Updated on Fri, Oct 1 2021 12:49 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment