జైపూర్: మొఘలులుపై పోరాడిన మహారాణా ప్రతాప్ వారసులు ఆస్తుల కోసం, అధికారం కోసం వీధిన పడ్డారు. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్ కోట వద్ద కొత్త మహారాజు పట్టాభిషేకం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మేవాడ్ 77వ మహారాజుగా పట్టాభిషిక్తుడైన విశ్వరాజ్ సింగ్, ఆయన అనుచరులను ప్యాలెస్‌లోకి అడుగుపెట్టకుండా రాజ కుటుంబంలోని సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగి.. పలువురు గాయపడ్డారు.
ఏంటి ఈ మహరాణా ప్రతాప్ వారసుల గొడవ
మహారాణా ప్రతాప్ ప్రసిద్ధ రాజపుత్ర యోధుడు. రాజస్థాన్‌లోని మేవార్ రాజు. భారతదేశ స్వాంతంత్య్ర ఉద్యమంలో మహారాణా భూపాల్ సింగ్ మేవార్ రాజు. ఈయన 1955లో శ్రీ ఎక్లింగ్‌జీ ( Shri Eklingji Trust) ట్రస్ట్‌ను స్థాపించారు. ఆ ట్రస్ట్ బాధ్యతల్ని ఆయన వారసులు కొనసాగిస్తూ వచ్చారు. అయితే క్రమేపీ ఈ ట్రస్ట్ వ్యవహారాలు పాలన విషయంలో కుటుంబసభ్యుల మధ్య పొరపచ్చాలు వచ్చాయి.
75వ మహారాణా విశ్వరాజ్ సింగ్ తాత భగవత్ సింగ్‌కు ఇద్దరు కుమారులు. వారిలో ఒకరు మహేంద్ర సింగ్ కాగా మరొకరు అరవింద్ సింగ్. తన మరణానికి ముందు ట్రస్ట్ నిర్వాహక బాధ్యతల నుంచి తన పెద్ద కుమారుడు మహేంద్ర సింగ్‌ను తప్పించి తన చిన్న కుమారుడు అరవింద్ సింగ్‌కు అప్పగించారు భగవంత్ సింగ్.
వీలునామాలో ఉంది ఇదే..
తండ్రి నిర్ణయంతో కలత చెందిన మహేంద్ర సింగ్ కోర్టును ఆశ్రయించారు. మే 15, 1984 నాటి తన చివరి వీలునామాలో భగవత్ సింగ్ తన పెద్ద కుమారుడు మహేంద్ర సింగ్‌ను కుటుంబం నుంచి వెలివేస్తున్నట్లు పేర్కొన్నారు. తన చిన్న కుమారుడే ట్రస్ట్ కార్యనిర్వహకుడిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. అదే ఏడాది నవంబర్‌లో తండ్రి భగవత్ సింగ్ మరణించడంతో ట్రస్ట్ ఛైర్మన్‌గా అరవింద్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. అయితే..
ఈ ఏడాదిలో మహేంద్ర సింగ్ మరణానంతరం.. ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే విశ్వరాజ్ సింగ్ మేవాడ్ 77వ మహారాజుగా సోమవారం పట్టాభిషేకం చేశారు. చిత్తోర్‌గఢ్ కోటలో సోమవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం, సంప్రదాయం ప్రకారం కులదైవం ఏకలింగనాథ్ ఆలయం, ఉదయ్‌పుర్‌లోని సిటీ ప్యాలెస్‌ను కొత్త మహారాజు సందర్శించాల్సి ఉంటుంది.
అయితే, ఈ పట్టాభిషేకంపై ఆగ్రహంగా ఉన్న అరవింద్ సింగ్ మేవార్ .. తన కుమారుడు లక్షయ్ రాజ్ సింగ్ మేవార్ తమ బలగాన్ని ఉపయోగించి విశ్వరాజ్ సింగ్ మేవాడ్‌ను రాజభవనంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఈక్రమంలో విశ్వరాజ్ మద్దతుదారులు రాళ్లదాడికి దిగారు. లక్షయ్ రాజ్ సింగ్ మేవార్ అనుచరులు సైతం ప్రతి దాడులకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆపై పోలీసుల ఎంట్రీతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment