భద్రాచలం: తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో వరుస కాల్పుల మోతతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ఆదివారం సాయంత్రం మరో ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక జవాను మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
బిజాపూర్ జిల్లా గొల్లపల్లి-కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసుల ఆధ్వర్యంలో ఇటీవల నిర్మించిన రోడ్డును మావోయిస్టులు తవ్వేశారంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో మారాయిగూడెం బేస్‌క్యాంపు నుంచి సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్‌కు వెళ్లాయి. దీంతో సమీపంలోనే మాటువేసిన మావోయిస్టులు వారిపైకి కాల్పులు జరిపారు. వెంటనే పోలీసులు కూడా ఎదురుకాల్పులు ప్రారంభించారు. అయితే, మావోయిస్టుల కాల్పుల్లో అశోక్‌కుమార్ జాట్ అనే కానిస్టేబుల్ చనిపోయాడు. సుధీర్‌కుమార్ అనే కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం క్షతగాత్రుడిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, రోడ్డును తవ్వేశారంటూ పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చిందెవరనే విషయమై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. కాల్పుల ఘటన అనంతరం సరిహద్దు గ్రామాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. కూంబింగ్‌ను విస్తృతం చేసేందుకు మరిన్ని బలగాలను రంగంలోకి దించారు.
తెలంగాణ సరిహద్దుల్లో కాల్పుల కలకలం
Published Mon, Oct 26 2015 8:28 AM | Last Updated on Tue, Oct 16 2018 2:39 PM
Advertisement