విద్యా సమస్యలపై మహాధర్నా
Published Fri, Jul 22 2016 12:52 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
గద్వాల : విద్యారంగంలో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 27న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపడుతున్నామని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి యూనస్‌పాష తెలిపారు. గురువారం స్థానిక ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల ఆవరణలో మహాధర్నా పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం ప్రకారం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించాలని, ఆంగ్ల మాధ్యమంలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు లక్ష్మణ్, విజయభాస్కర్‌రెడ్డి, కిషోర్‌చంద్ర, హుసేన్, రాజేష్, నాగరాజు, భీమన్న, శ్రీహరి, గౌరీశంకర్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement