
ఖాకీ కొలువులకు మరికొంత కాలం!
♦ వయోపరిమితిపై స్పష్టత ఇస్తేనే అడుగు ముందుకు
♦ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోని సర్కారు
♦ నిరుద్యోగులకు తప్పని ఎదురుచూపు
సాక్షి, హైదరాబాద్: పోలీసు ఉద్యోగాల కోసం ఇంకొంత కాలం వేచిచూడాలి. పోలీసు నియామకాల్లో వయోపరిమితి పెంపు విషయం కొలిక్కి వస్తే తప్ప నోటిషికేషన్ ఇచ్చేందుకు ఆస్కారం లేదని అధికార వర్గాలు అంటున్నాయి. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెబుతున్నాయి. పోలీసు విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఏడాదిన్నర గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకున్న నియామక ప్రక్రియలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన పోలీసు విభాగం ఆ మేరకు ప్రతిపాదనలు రూపొందించింది. మహిళలకు 33% రిజర్వేషన్, స్క్రీనింగ్ పరీక్షగా ఉన్న 5 కి.మీ పరుగు తొలగింపు, వయోపరిమితి సడలింపు వాటిలో కీలకమైనవి. డీజీపీ కార్యాలయం ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. వీటిపై మంత్రుల ఉపసంఘం ఇప్పటికే పలుమార్లు చర్చించింది. అయితే దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతోపాటు 9 వేలకు పైగా పోస్టుల భర్తీ కోసం పోలీసు విభాగం పంపిన ప్రతిపాదనల్ని ఆర్థికశాఖ సైతం ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో ఖాకీ కొలువుల కోసం నిరీక్షించక తప్పని పరిస్థితి.
సడలింపుపై అనాసక్తి: ఎస్సైలకు మూడేళ్లు, కానిస్టేబుళ్లకు ఐదేళ్ల వయోపరిమితి విషయమై పోలీసు ఉన్నతాధికారులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం ఎస్సైల వయసు 25 ఏళ్లకు మించరాదని ఉంది. అయితే కొంతకాలంగా నోటిఫికేషన్లు లేని కారణంగా మూడేళ్ల సడలింపు ఇస్తే 28 ఏళ్లకు చేరుతుంది. ఆ తర్వాత శిక్షణ పూర్తయి, విధుల్లో చేరి అవగాహన వచ్చే సరికి మరో నాలుగేళ్లు పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించేది ఎస్సైలే కాబట్టి వారు శారీరకంగా దృఢంగా ఉండేందుకు వయసు కచ్చితత్వం పాటించాలని పట్టుబడుతున్నారు. గతంలోనూ వయసు సడలింపుపై చాలాసార్లు నిరుద్యోగులు డిమాండ్ చేసినా అడ్డు చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సడలింపు ఇవ్వడానికే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. మూడేళ్లే కాబట్టి అది పెద్దసమస్య కాబోదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.
సాంకేతిక సమస్యలు అడ్డు: పోలీసు విభాగంలో తొలిదఫా 9,058 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. వీటిలో ఎస్‌ఐలకు సంబంధించి సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్, కమ్యూనికేషన్ల విభాగాల్లో 540, మిగిలినవి కానిస్టేబుల్ కేడర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రులూ ప్రకటించారు. అయితే ఈసారి 5 కి.మీ. పరుగు పందెం తొలగించాలని నిర్ణయించడంతో శారీరక దారుఢ్యం కంటే అభ్యర్థుల మేథాశక్తిని పరీక్షించడంపైనే పోలీసు విభాగం ప్రధానంగా దృష్టిసారిచింది. దీనికితోడు పోలీసుల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య 8 శాతానికి మించట్లేదు. మహిళలకు కచ్చితంగా 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో వారి కోటాపై స్పష్టత రావాల్సి ఉంది. కీలకమైన ఈ సంస్కరణలపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చాక రాత పరీక్షకు సిలబస్‌ను రూపొందించాల్సి ఉంది. ఈ బాలారిష్టాలను దాటిన తరవాతే తెలంగాణలో తొలి పోలీసు నోటిఫికేషన్ వెలువడటానికి అవకాశం ఉందని ఓ అధికారి చెప్పారు.